శోకించతగనిదానికై నీవు శోకిస్తున్నావు. దానికంతా నీవు శోకించవలసిన వాడవు కాదు. నీ హృదయము అజ్ఞానములో నిండివుంటుంది. ఈ అజ్ఞానమును ముందు పారద్రోలాలి. దీనికి ఎనిమిది విధములైన స్థితులుంటున్నాయి. ఈ క్లేశము నీ హృదయములో వున్నంత కాలము నీవు అజ్ఞానములో మునిగే వుంటుంటావు. క్లేశము లేకుండా వుండే స్థితిని యెప్పుడు పొందుతావో అప్పుడే జ్ఞానమునకు అర్హుడవవుతావు. ఈ యెనిమిది క్లేశేములము హృదయములో లేకుండా చూసుకోమన్నాడు. మొదటిది వాసన, రెండవది అగ్ని, మూడవది ఋణము, వాల్గవది రోగము, ఐదవది ద్వేషము, ఆరవది రాగము, ఏడవది విచారము, ఎనిమిది విషము. ఇవన్నీ పోయి యేదో విషము కొంచెముగా నీ హృదయములో శేషముగా వున్నప్పటికిని నీ కిది తప్పినది కాదు. అగ్ని అంతా ఆరిపోయింది. కొంచెము యెక్కడో మిగిలింది. ఈ చిన్న అగ్ని గాలి వీచటంవలన పెద్దదై బ్రహ్మాండమైన మంటగా బయలుదేరుతుంది. కనుక యీ చిన్న శేషము కూడను వుండకూడదు. రోగమంతా నయమై పోయింది. కాళ్ళపైన కొంచెము వాపు వుంటుండాది. కాని, పేషంటు యింటికి వచ్చి యేదైనా అపథ్యము చేసినప్పుడు తిరిగి ఒళ్ళంతా నీరు పట్టవచ్చు. రోగశేషము, అగ్ని శేషము యేమాత్రము వుండకూడదు. ఇక ఋణశేషము అప్పుల బాధ. అంతా తీరిపోయింది. ఏదో యిరవై రూపాయలు మాత్రము అప్పు వుంది. అంటే వడ్డీ పెరుగుతూ కూర్చుంటుంది. కనుక ఆ యిరవై రూపాయలు తీర్చేయాలి. అదే విధముగనే శేషమనేది కొంచెం వుంటుండాదంటే కృష్ణుడు యెంత బోధించినప్పటికి ప్రయోజనము లేదు. నీ అజ్ఞానశేషమును పూర్తి నిర్మూలనము గావించాలి. కనుకనే యీ సాంఖ్యమును అర్జునకు బోధిస్తున్నాను అన్నాడు.
(శ్రీ. గీ..138-139)