దైవాన్ని పట్టాలనుకొన్నప్పుడు యీ దేహమనస్సుల తత్వన్నంతా సాధనమార్గముతో సాధిస్తూ రావాలి. భూతదయను పెంచుకోవటం, సర్వాత్మభావమును అభివృద్ధి పరచుకోవటం, దేహము యొక్క పరిశుద్ధతను, మనసు యొక్క పవిత్రతను అభివృద్ధి పరచుకోవటం, యీ విధమైన నిత్యచర్యలలోపల నిత్య జీవితములోపల సాధనలు సలిపినప్పుడే దైవత్వము సులభముగా అర్థమవుతుంది. సర్వజీవనమస్కారం కేశవం ప్రతిగచ్చతి" సర్వులయం దుండిన భగవంతునకు నమస్కరిస్తున్నాను అని భావించాలి.
మన సాధన అంతటితోనే అపకూడదు. "సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి" దానిని కూడ రెండవ అడ్డుగా పెట్టుకోవాలి. మన జీవితము ఒక పెద్ద ప్రవాహము. ఈ ప్రవాహము విచ్చలవిడిగా వదలిపెట్టిన అన్ని గ్రామములు, అన్ని భూములు, అన్ని జీవులు, అన్నింటిని ధ్వంసము చేస్తుంది. గ్రామములను ముంచివేస్తుంది. కాని, దీనిని భరించే సాగరం దగ్గరికి దానిని పంపే ఉపాయం మనం తీసుకోవాలి. ఈ నదులను అనుగ్రహించేవాడు. భరించేవాడు. వరించేవాడు, తరించేవాడు. ఒక్క సాగరుడే. దీనిని సాగరములో యేరీతిగా చేర్చాలి? దీనికి భగవద్గీత రెండు గట్టులను కట్టుకోమని చెప్పింది. ఈ నదికి ఇటువైపున అటువైపున గట్లు వుండినప్పుడే, యేభూములు యేగ్రామములు ముంచకుండా నేరుగా సముద్రములో పోయి చేరిపోతుంది. ఏమిటి యీగట్లు? అదే అష్టాక్షరనామము అని బోధించాడు. ఏమిటి అష్టాక్షరినామము? ఓం నమో నారాయణాయ కాదు "సంశయాత్మా వినశ్యతి". నీవు నిస్సంశయుడుగా వుంటుండు. అదే గట్టును ఒకవైపున కట్టుకో, రెండవవైపున శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఇవి ఎనిమిది అక్షరాలు. ఈ శ్రద్థను ఒకవైపున పెంచుకో.నిస్సంశయము అనేది ఒక గట్టు. శ్రద్ధ ఒక గట్టు. ఈ రెండిటిని మనము గట్లుగా తీసుకుంటే మన జీవితమనే ప్రవాహము అనుగ్రహమనే సాగరములో లీనమవుతుంది.
(శ్రీ.గీ.పు. 240-241)