ఈ నాటి అశాంతికి మూలకారణం సైన్స్, దేనికైనా ఒక పరిమితి ఉండాలి. సైన్స్-టెక్నాలజీ చాలా అవసరమే. కాని అది మితి మీరి పోవడము చేత ఆటంబాంబులు, హైడ్రోజన్ బాంబులు అభివృద్ధి అవుతున్నాయి. ఇవన్నీ మనిషిని చంపడానికి భయపెట్టడానికి చేసే సాధనాలే. కీడు కీటకమైనా చేయగలదు. చంపడానికి ఇన్నికోట్లు ఖర్చు పెట్టాలా? ఇంత పెద్ద బాంబులు తయారు చేయాలా? వీటికి ఖర్చు పెట్టే ధనం ప్రజా సంక్షేమం కోసం వినియోగిస్తే ఎంత బాగుంటుంది? ఒకదేశం వారిని చూచి మరొక దేశం వారు పోటీలుపడి బాంబులు తయారుచేస్తే ప్రపంచమే భస్మం అయిపోతుంది.
“అహింసా పరమోధర్మ:" ఈ ధర్మాన్ని అనుసరిస్తే మనకు ఇంకా అస్త్రా శస్త్రాలతో గాని ఏటం, హైడ్రోజన్ బాంబులతో గాని పనే ఉండదు. ప్రపంచమంతా ప్రేమ పైనే ఆధారపడి ఉంది.
(దే.యు.పు.5)
అహింసా పద్ధతి నవలంబించుటవలన హిందూ దేశము రెండుగా విభజింపబడి ఆరెండు దేశములను పరస్పరము ద్వేషించు కొనుచున్నవి కదా అన్న, అది అహింసా పద్ధతి వలన కలిగిన తప్పుకాదు. ప్రజలకు అహింసా పద్ధతియందు నమ్మకము లేకపోవుట వలన కలిగినట్టిది ఆ తప్పు. నమ్మకము లేక అహింసా వాదులమని చెప్పుచుండుట వట్టి బూటకమే. దేశములు, దేహములు దగ్గర యైనంత మాత్రమున హృదయములు దగ్గర ఆయినవని భావించుటకు వీలు లేదు. మనము దూరదేశములందుండి నప్పటికిని అన్యోన్యము ప్రేమించుకొంటిమేని మిక్కిలి దగ్గర అయినట్లే. దగ్గర నుండిననూ దూరమున నుండిననూ ప్రేమించుటయే మానవ ధర్మము. దేహములను దేవాలయములు భావించినప్పుడే అన్యో న్య ప్రేమ కలుగుటకు కారణ మగును.
(స.శి.సు.ద్వి పు.315/316)
(చూ॥ క్షమ, ప్రేమ,భారతదేశము)