భిన్నత్వంలో అభిన్నత్వం చూడటం నేర్చుకోవాలి. అన్నిటిలోను వ్యత్యాసమున్నట్లు కనబడుచున్నది. దీనికి కారణమేమి? తనకును, భగవంతునకును మధ్యయున్న సంబంధమును గూర్చి భావించడంలో, కల్పన చేసికొనడంలో, అనుసరించు మార్గంలో భిన్నత్వము కలిగియుండుటయే - మానవుడు ఏ మార్గమైనా నిష్కల్మష హృదయంతో, నిర్మల భావంతో, ప్రేమతో నిండిన మనస్సుతో శరణాగతుడై అనుసరించిన యెడల గమ్యమైన దైవత్వము చేరుకొనుట తథ్యము.
"నహి జ్ఞానేన సదృశం" జ్ఞానముతో సమానమైనటువంటిది వేరొకటిలేదు. సంసార సముద్రమును దాటించి పరమప్రాప్తిని యేది కలిగించునో దానినే జ్ఞానమని అందురు. అట్టి జ్ఞానము కూడనూ రెండు విధములుగా ఉన్నది. అందులో మొదటిది విషయజ్ఞాన మనియూ, రెండవదానిని అభేద జ్ఞానమనియూ అందురు. అనగా మొదటిది లౌకికమైనది; రెండవది "అహం బ్రహ్మాస్మి" అనే బ్రహ్మాత్మ విజ్ఞానమే; దీనినే అభేదజ్ఞానమందురు. ఇది అనాది. సంసార భయాన్ని నివారించి, మానవుని నిర్భయ స్వరూపుని చేసి బ్రహ్మప్రాప్తిలో ప్రవేశ పెట్టును. ఇది బుద్ధికి సాక్షియై యుండును. అందువలన దీనికి సమ్యక్ జ్ఞానమని పేరు.
(గీ.పు. 122)
(సా.పు. 44)