అధ్యాపకుడు యిచ్చేవాడు. విద్యార్థి పుచ్చుకునేవాడు. అయితే ఇచ్చేందుకు టీచరు దగ్గర ఏమైనా సరుకు ఉండాలిగదా! అయితే ఈనాడు పుచ్చుకోవటానికి విద్యార్థి సిద్ధంగానూ లేడు. ఇవ్వటానికి టీచరు దగ్గర సరుకూ లేదు. అధ్యాపకులు వాటర్ ట్యాంక్ లాంటి వారు. విద్యార్థులు ట్యాప్ ల వంటివారు. సహజంగా ట్యాంక్ లో ఎటువంటి నీరు ఉంటే, అటువంటి నీరు ట్యాప్ లోనికి వస్తుంది. అదే విధంగా అధ్యాపకుడు ఎట్టి వాడో విద్యార్థి అట్టివాడుగా తయారవుతాడు. ఉపాధ్యాయుడు క్రమ శిక్షలలో తనవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించకపోతే వేలమంది విద్యార్థులు చెడిపోతారు. అధ్యాపకులు ఆదర్శ జీవితాన్ని గడిపినప్పుడు, విద్యార్థులు సత్ప్రవర్తనను అలవరచు కుంటారు. వాటర్ ట్యాంక్ లో పరిశుద్ధమైన నీరు ఉంటే ట్యాప్ లోనికి మంచినీరు వస్తుంది. అదేవిధంగా అధ్యాపకుడు పవిత్రమైన జీవితాన్ని గడిపితే విద్యార్థులు కూడా సచ్చీల సంపన్నులవుతారు. కనుక విద్యార్థులకు అధ్యాపకులు మార్గదర్శకులుగా ఉండాలి.
(శ్రీ, జూ97 పు.21)
అధ్యాపకులు దేశమునకు ఆదర్శవంతమైన జ్యోతులు. ఒక విద్యార్థి చెడితే కేవలం ఆతను మాత్రమే చెడగలడు. ఒక అధ్యాపకుడు చెడితే అనేకమంది విద్యార్థులు చెడటానికి అవకాశము ఉంటుంది. అధ్యాపకులు గైడ్ పోస్టు వంటివారు. విద్యార్థులకు సరియైన ఆదర్శము నందించటంలో ఆధ్యాపకులు నిశ్చల మనస్సులో వ్యవహరించాలి. గైడ్ పోస్టు ఊరికే అటూ, ఇటూ, ఇటూ, అటూ తిరుగుతుండటంతో తప్పుదారి పట్టిస్తుంది. గైడ్ పోస్టు స్థిరంగా నిల్చొని దృక్పథాన్ని చక్కగా ఇతరులకు వివరించాలి. అధ్యాపకులు కూడా నిశ్చలమైన మనస్సులో, నిస్వార్థమైన హృదయంతో ప్రేమ తత్వాన్ని పెంచుకోవాలి. భక్తి ప్రపత్తులను కూడా అభివృద్ధి గావించుకోవాలి. విద్యార్థుల అభివృద్ధిని, దేశాభివృద్ధిని సమాజక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అధ్యాపకులు ప్రవర్తించాలి. ఉన్నత భావాలను పెంపొందించుకొని మంచి ఆదర్శమును లోకమునకు చాటుటకు అధ్యాపకులు పూనుకోవాలి.
(శ్రీ. జూ. 97 పు. 69)
(చూ॥ ఆవతారము, ఆచార్యుడు, విద్యార్థులు)