యాజ్ఞవల్క్యునితో తర్కించి
తనధీశక్తి నిరూపించిన గార్గీ అబలనా?
వేదాంత జ్ఞాన సంపదతో
జనక మహారాజాను పరీక్షించిన సులభ అబలనా?
భౌతిక సంపద వలదంచు
ఆత్మజ్ఞాన సంపత్తినే ఆశించిన మైత్రేయి అబలనా?
పతికి వైరాగ్య పాఠముల్ నేర్పిన
మహారాజ్జి చూడాల అబలనా?
నాథుడు మూర్చిల్లినవేళ
నరకు నెదరించి పోరాడిన సత్యభామ అబలనా?
శంకరాచార్యునితో తర్కము సలిపి
సహధర్మచారిణి బిరుదును నిలిపిన ఉభయభారతి అబలనా?
ప్రాణంబుకంటె మానమే ఘనమని నిరూపించిన
జోహార్ అగ్ని గుండాన దూకిన రాణపద్మిని అబలనా?
పాశ్చాత్యసీమ నుండి తరిలి వచ్చి
భారతదేశమునకై శక్తి యుక్తుల ధారపోసిన ఆనీబెసెంటు అబలనా?
స్వరాజ్యసిద్ధికై సర్వస్వమును అర్పించి
మహిళాస్ఫూర్తికై చెరసాల కేగిన కస్తూరిబాయి అబలనా?
మాతృదేశ విముక్తికి పోరాడి
కలమును, గళమును సమర్పించిన సరోజినీదేవి అబలనా?
పరిపాలన యంత్రాంగ నిర్వహణలో
పురుషుల కన్న స్త్రీలే మిన్నయని నిరూపించిన
విక్టోరియా మహరాణి, ఇందిరాగాంధీ - అబలలా?
కలరు నాటికి నేటికి, ఏదేశమందైన స్త్రీలు, సబలలని నిరూపింప.
(భ...ప్రీ.ధ.ప్ర. పు. 144)