అందరూ అధిక ధనము నాశిస్తున్నారు. ఈ ధనం కోసమే నీతి నిజాయితీలను కోల్పోతున్నారు. నీతి నిజాయితీలను కోల్పోయి సంపాదించే ధనం మట్టితొ సమానము. ధనము మనవెంట ఏనాటికీ రాదు. కేవలం, ధనమును ప్రోగు చేసికొని, భద్రపరిచినంత మాత్రమున సంతోషము వస్తుందా? లేదు, లేదు.
తేనిటీగలు తేనెను ఏ మాత్రం అనుభవించక ఒక దగ్గర చేరుస్తాయి. కాని, వేటగాడు వాటిపై పొగను గాని, వేడి నీటిని గాని చల్లి వాటిని సంహరించి తేనెను అపహరిస్తున్నాడు. అదే విధంగా అన్యాయార్జితమైన ధనం మనకే మాత్రము దొరకదు. దీనికి నలుగురు దొంగలుంటున్నారు. మొట్ట మొదటిది. ప్రభుత్వము. వాళ్ళు ఏదో ఒక " టాక్స్" నెపంతో దాడి చేసి, ఆ ధనమును కొంత వరకు స్వాధీన పరచుకొంటారు. రెండవది అగ్ని. ఈ అగ్ని ఏదో విధంగా దహించివేసి, అన్యాయముతో సంపాదించిన ధనమును అపహరిస్తుంది. మూడవది దొంగ ధనము మన దగ్గర చేరినదంటే దొంగ దృష్టి మన పైన పడుతుంది. ఎట్టిననూ మన నుండి ధనమును దొంగిలించడానికి ప్రయత్నిస్తాడు. ఇంక, నాల్గవది రోగము, అన్యాయార్జితమైన ధనమును క్షీణింప చేయడానికి అనేక విధములైన రోగాలు మనకు ప్రారంభమౌతాయి.
కొంతమంది నోరు తెరుచుకొని అడిగిన భిక్షగానికి ఒక్క నయాపైస కూడా వేయలేదుగాని, రోగమే వచ్చినదంటే డాక్టర్లకు వేలకొలది రూపాయిలు ఇవ్వడానికి వెను కొడరు. కనుక, అన్యాయముగా సంపాదించిన ధనం ఈ రకమైన మార్గములో వ్యర్థమైపోతుంది. మీరు ఈ విషయాన్ని దృష్టియందుంచుకొని, నీతి నిజాయితీలను కలిగియుండి, సత్య ప్రేమల చేత ధర్మమును అభివృద్ధి గావించాలి.
(దే.యు. పు. 74/75)