ఔరంగజేబు కుమార్తె జేబున్నిసా. ఆమె అపురూప సౌందర్యవతి. ఆమెకు ఆమె తండ్రి ఒక చక్కని అద్దమును జన్మదిన కానుకగా ఇచ్చాడు. ఒకరోజు జేబున్నిసా ఉద్యానవనమున కూర్చొని ప్రకృతి సౌందర్యమును ఆస్వాదిస్తూ ఉండగా ఉన్నట్లుండి ఆమెకు ఆ అద్దమందు తన అందమును చూసుకోవాలన్న అభిలాష కలిగింది. తన చెలికత్తెను పిలిచి, “నా గదిలో ఉన్న ఆ అందమైన అద్దమును జాగ్రత్తగా తీసుకొనిరా” అని ఆజ్ఞాపించింది. ఆ అద్దమంటే తన యజమానురాలికి ఎంతో ఇష్టమని ఆ పరిచారికకు తెలుసు. ఆమె గబగబా వెళ్ళి అద్దమును తీసుకొని వస్తూ ఉండగా అది చేయి జారి క్రిందపడి ముక్కలైంది. పరిచారికకు ఏమీ తోచలేదు. చేతులు కాళ్ళు వణకడం మొదలు పెట్టాయి. యువరాణి తనకేమి శిక్ష విధిస్తుందో అని భయపడుతూ వెళ్ళింది. జేబున్నిసా పాదాలపై పడి, “అమ్మా, ఆ అద్దము నా చేతినుండి జారి క్రిందపడి పగిలిపోయింది. మీరు నాకు ఎట్టి శిక్ష విధించినా స్వీకరిస్తాను” అంది. జేబున్నిసా ఏమాత్రం చెదరక, కోపగించుకోక, "లే, లే, ఫరవాలేదు. ఆ అద్దం పగిలిపోవడం నా మంచికే. అది ఉన్నంతవరకు దానిలో నా ప్రతిబింబాన్ని చూస్తుంటాను. నేనింత అందమైనదాన్ని కదా అని గర్వం కలుగుతుంది. గర్వం తియ్యని విషం. కాబట్టి, ఏది జరిగినా మన మంచికే అని తెలుసుకో. నాకు నీమీద ఏమాత్రం కోపం లేదు” అంటూ ఆ చెలికత్తెను ఓదార్చి తన క్షమాగుణాన్ని చాటుకొంది. (సనాతన సారథి, అక్టోబరు 2022 పు 17)