మానవుడు మొట్టమొదట యింద్రియనిగ్రహము కోసం తగిన కృషి చేయాలి. మన మాటలను మన తిండిని, మన వాసనను మన వినికిడిని, మన దృష్టిని మొట్టమొదట అదుపులో పెట్టుకోవాలి. దృష్టి దోషము రాకుండా చూసుకుంటూ వుండమని అదే పనిగా పిల్లలకు చెప్తుంటాను. ఏదైనా ఒక దానిని చూసినప్పుడే దానిని గురించి యోచించుతావు. దానిని యోచించిన తరువాత దాని పెన వాంఛ కలుగుతుంది. ఒక విషయమును వినిన తరువాత వినిన విషయమును యోచిస్తారు. దానిని యోచించిన తరువాత దానిని పొందాలని మరల ఆశిస్తావు. ఒక విషయాన్ని మాటాడిన తరువాత ఆ మాటకు తగిన రూపాన్ని నీవు పురికొల్పుతావు. కనుక ప్రతీ ఒక్కటి దోషయుక్తమా, దోషరహితమైనదా అనే విచారణ చెయ్యాలి. నీవు నిజముగా దైవత్వమును పొందవలెనంటే వా గ్దోషము, దృష్టిదోషము, క్రియాదోషము, శ్రవణదోషము, మనోదోషము, యీ పంచదోషములు దూరం చేస్తే నీవే పరమాత్ముడై పోతావు, మాటను మొట్టమొదట అదుపులో పెట్టుకోవాలి. కారణమేమిటంటే నాలుకకు రెండు శక్తులు వున్నాయి. కన్నుకు చూచే శక్తి మాత్రమే వుంది. చెవులకు వినే శక్తి మాత్రమే వుంది. ముక్కుకు వాసన చూసే శక్తి మాత్రమే వుంది. కాని నాలుక అట్లు కాదు, మాటాడుతుంది, రుచి చూస్తుంది. రెండూ వుంటున్నాయి. మొట్టమొదట దానిని భగవంతుని కార్యములయందే పాల్గొను అని ఆదేశించాడు. (శ్రీ సత్యసాయి గీతామృతము పు 148-149)