లంకలో ప్రవేశించి రాక్షసులను హతమార్చుచుండగా,రామునిలో కూడా ఒక విధమైన విషాదం ప్రవేశించింది. అసలు దోషము చేసినవారెవరు? ఫలితము అనుభవించేవారెవరు? అది వీరి దోషం కాదు, వీరి మాష్టర్ దోషం . అతను చేసినటువంటి దోషంవలన అతని పరిసరములవారందరూ దాని దుష్ఫలితాన్ని అనుభవించక తప్పలేదు. “కాననంబున రేగిన కారుచిచ్చు రేగులను కాల్చి, మామిళ్ళ విడచి. చనునే!” అడవిలో పుట్టిన అగ్ని అన్నింటినీ కాల్చివేస్తుంది. అదేవిధంగా, సమాజంలో సద్గుణవంతులుంటే సర్వులను సద్గుణవంతులుగా చేస్తారు. దుర్గుణవంతుడు ఒక్కడుంటే చాలు, యావత్ సమాజమునే నాశనం చేస్తాడు. అగరువత్తి తాను కాలిపోతూ కాలిపోతూ చుట్టుప్రక్కల వారందరికీ సుగంధాన్ని అందిస్తుంది; స్వార్థమును నాశనము చేసికొని, పరార్థమనే పవిత్రతను అందరికీ అందిస్తుంది. రామ రావణ యుద్ధం జరుగుతున్నది. స్త్రీలు పరుగెత్తుకొనిపోతున్నారు. అందులో ఒక స్త్రీ తన చంటి బిడ్డను చంకన వేసికొని పరుగెత్తుకుంటూ పోతున్నది. లక్ష్మణుడు ఆయుధం విసిరేటప్పటికి పొరపాటున ఆ చంటి బిడ్డకు తగిలింది. చంటి బిడ్డ పడిపోయింది. కానీ, ఆ బిడ్డను వదలి తనను తాను రక్షించుకోవటానికి ఆ తల్లి పరుగెత్తుకొని పోతున్నది. “అన్నా! ఈ రాక్షసుల స్వభావం చూడు! వాత్సల్యముకూడా లేకుండా ఎంత కఠినంగా ప్రవర్తిస్తున్నారు.” అన్నాడు లక్ష్మణుడు. కానీ, సర్వజ్ఞుడైన రామునికి అంతా తెలుసును. “లక్ష్మణా! నీవు పొరబడుతున్నావు. ఆమెకు స్వార్థం లేదు. ఆమెనిండా పరార్థమే ఉంటున్నది” అని ఒక వానరుని పంపించి ఆమెను పిలిపించాడు. “అమ్మా! నీ బిడ్డ పోయినప్పటికినీ దుఃఖం లేకుండా నిన్ను నీవు రక్షించుకునే స్వార్థంతో పరుగెత్తుకొనిపోతున్నావు. దీనికి కారణం ఏమిటి?” అని అడిగాడు శ్రీరాముడు. “స్వామీ! శ్రీరామచంద్రుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణ మూర్తి. ఆయన లంకను ఏలితే ఏలవచ్చును లేక అయోధ్యకు తిరిగి వెళ్ళవచ్చును. మమ్ముకూడా అయోధ్యకు తీసుకొని వెళ్ళి మాచేత తన సేవ చేయించుకుంటాడో ఏమో, అనేటటువంటి ఆశచేత నాకు బ్రతకాలని ఉన్నది” అని చెబుతూ ఆ స్త్రీ, “రామ సేవ చేయాలి. రామరాజ్యం రావాలి. దాని నిమిత్తమై నేను జీవించటానికి ప్రయత్నిస్తున్నాను. అంతేగాని, ఈ తుచ్ఛమైన జీవితం మీద నాకు ఆశ లేదు. రామసేవ చేస్తూ, రామునికి అత్యంత సమీపంలో ఉండాలని నా కోరిక” అని చెప్పింది. అప్పుడు రాముడు చెప్పాడు, “లక్ష్మణా చూశావా! ఎవరెవరి హృదయం ఏవిధమైన భావములతో ఉంటుందో! అందరూ రాక్షసులు కాదు. వారిలో కూడ సాత్త్వికులు ఉన్నారు. ఇందుకు విభీషణుడే ప్రత్యక్ష ప్రమాణం. అలాంటివారు ఎంతోమంది ఉంటుంటారు” అన్నాడు. (సాయి భగవానుని ధర్మవివరణలు- రామాయణంలోని రహస్యములు పు146-147)