సాత్వికాహారమంటే ఏమిటి? కారం, ఉప్పు, చింతపండు, మసాల తక్కువగా ఉండాలి. అంతేగాక, అది చాలా వరకు తైలముతో కూడి ఉండాలి. తాజాగా ఉండాలి. చల్లగా ఉండకూడదు. ఉదయం వండినది సాయంత్రం భుజించకూడదు. అనేకమంది సాత్వికాహారం పేరుతో పాలు, పెరుగు, పండ్లను భుజిస్తుంటారు. ఇది సాత్వికమైనవే. కాని మితిమీరితే, ఇవి తామసికంగా మారుతాయి. పెరుగేకదా! అని దానిని మనము ఊరికే భుజిస్తే అది తమోగుణంగా రూపొందుతుంది. పాలను కూడా మనం అధికంగా తీసుకోరాదు. పాలు చిక్కగా ఉంటే మనము తీసుకోకూడదు. అందులో సగం పాలు, సగం నీళ్ళు కలసి ఉండాలి. ఈనాడు అదృష్ట వశాత్తూ పాలు చిక్కగా దొరకటం లేదు. పాలుపోసేవారే దానిలో నీళ్ళు కలుపుకొని వచ్చి మనకు సహాయం చేస్తున్నారు. కనుక, పాలు, పెరుగులను అమితంగా భుజించరాదు. ఆ విధంగా భుజించేవానికి నిద్ర ఎక్కువగా వస్తుంది. నిద్ర తమో గుణము యొక్క తమ్ముడు, కనుక, నిద్ర రాకుండా ఉండే ఆహారాన్ని భుజించాలి.
(శ్రీభ.ఉ. పు.139)