జగత్తంతా ప్రేమచేతే నుండి ప్రేమపైనే ఆధారపడుతుంది. సర్వాన్ని అనుగ్రహింపగల ప్రేమతత్వాన్ని మానవుడు గుర్తించలేక ఐహిక వాంఛలకు లొంగిపోతున్నాడు. త్యాగం, ధర్మం, సత్యం మొదలైన వాటికి తిలోదకాలిస్తున్నాడు. మానవత్వంలోని ఏకత్వాన్ని దివ్యత్వాన్ని నిరూపించేది కూడా ప్రేమ ఒక్కటే. భగవంతుని ప్రేమను పొందడానికిప్రేమతో హృదయాన్ని నింపుకుని ఆహృదయాన్ని స్వామికి సమర్పించుకోవాలి. ప్రేమ రాహిత్యమే నేటి అనర్థాలకు మూలం.
నిజంగా మీకు భగవంతుడు కావాలనుకుంటే ప్రహ్లాదునివలే నిరంతరమూ ఓం నమో నారాయణాయ నమ: అని స్మరించండి. రాధా మీరాల వలె నిత్యం భగవంతుని స్మరణలోనే జీవించండి. జయదేవుడు, గౌరంగుడు, తుకారాంల వలె నిరంతరమూ భగవంతుని ప్రార్థించండి. రామకృష్ణునివలె భగవద్దర్శనం కోసం వెక్కి వెక్కి ఏడ్వండి. అప్పుడే భగవానుడు సాక్షాత్కరిస్తాడు. ప్రేమస్వరూపుని కేవలం ప్రేమతోనే పొందండి. ప్రేమతో కృష్ణనామాన్ని స్మరిస్తున్న రుక్మిణి సమర్పించిన తులసీ దళానికా ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు తూగలేదా? భగవంతుని పొందాలన్నా, తూచాలన్నా ప్రేమద్వారానే సాధ్యమవుతుంది. మీలో ప్రేమను పెంచుకోనప్పుడు భగవంతుడు కావాలంటే మీకు చిక్కుతాడా?
సర్వం విష్ణుమయం జగత్ అణువణువునా భగవత్ స్వరూపమే, మీ శత్రువులను కూడా ప్రేమించి విశ్వప్రేమ తత్త్వానికి వారుసులు కండి. భగవంతునికి దగ్గర కండి. నా జీవితమంతా ప్రేమమయమే నాలోని ప్రేమే అందరి హృదయాలను ప్రేమమయం చేస్తుంది. ఈ ప్రేమవలననే స్వామితత్త్వం జగత్తంతా వ్యాప్తి చెందుతోంది. నాలోనిప్రేమ అనే ఆయస్కాంతమే మిమ్మల్ని నాదగ్గరకు ఆకర్షిస్తోంది.
మీ రెక్కడ వున్నా మీ హృదయాన్ని పవిత్రం చేసుకోండి. పవిత్ర ప్రేమతో మీ జన్మను సార్థకం చేసుకోండి. మిమ్మల్ని ద్వేషించేవారిని నిర్మలమైన చిరునవ్వుతో మీజన్మను సార్థకం చేసుకోండి. మిమ్మల్ని ద్వేషించే వారిని నిర్మలమైన చిరునవ్వులతో మీ వారిని చేసుకోండి. విశ్వప్రేమతత్త్వాన్ని పదిమందికి పంచి ఇవ్వండి.
పవిత్రం ఎక్కడుంటే ప్రేమ అక్కడ ఆవిర్భవిస్తుంది. అక్కడే ఆనందం వెల్లి విస్తుంది.
(భ.పు.2)
ఆత్మకు అనువరతము అడ్డు తగులునది మనస్సు, సూర్యుని వేడివల్ల ఆవిర్భవించిన మేఘములు సూర్యుని ఏవిధముగా మరుగు చేయుచున్నవో అదే విధముగనే ఆత్మనుండి పుట్టిన మనస్సు - మనస్సంమాతమైన మేఘములు - ఆత్మకు అడ్డు తగులు తున్నాయి. మనస్సుండినంతవరకు మానవుడు ఆత్మతత్త్వాన్ని గాని ఆత్మ జ్ఞానముగాని ఆత్మ విషయాన్ని గాని అర్థముచేసుకోలేడు. సర్వకాల సర్వావస్థలయందును ఆత్మను గుర్తించే స్థితియే సాక్షాత్కారమని చెప్పబడుతుంది.
(బ్బ.త్ర.పు.123)
(చూ॥ అవతారము, ఇరువదిగుణములు, తల్లులు, మాయ)