నా దగ్గరకు వచ్చే వాళ్ళు తమ యిబ్బందులను గురించి, రోగాలను గురించి విన్నవించుకొంటుంటారు. వాళ్ళ రోగాలను నయం చేయటం, యిబ్బందులను తొలగించటం యిదేనా నాపని? కాదు. నేను వచ్చిన పని అంతకన్నా ఎంతో ముఖ్యమైనది.
మామిడి చెట్టు వుంది. దానికి ఆకులూ, కొమ్మలూ, మొదలూ అన్నివున్నాయి. ఒక్కొక్కటి మనకు ఒక్కొక్క రకంగా వుపయోగపడుతుంది. మామిడి చెట్టు వుపయోగం అంతేనా? మామిడి పండ్లు ప్రధానం, యివికాదు.
అరటి చెట్లు వల్ల ఎన్ని వుపయోగాలున్నాయి? అరటి ఆకు వేసుకొని భోంచేస్తావు. అరటి పూవును, పూచను కూరచేస్తావు. కాని ఇవన్నీ కొసరు. అరటిపండ్లు అసలు. అలాగే వేదశాస్త్రాలను భరత వర్షంలో పునః ప్రతిష్ట చేయటం, వేద విజ్ఞానాన్ని తిరిగి వ్యాప్తి చేయటం నా ప్రధాన లక్ష్యం. భక్తుల బాధలను తొలగించటం అన్నది అనుషంగికం మాత్రమే.
ఈరోజు ప్రపంచమంతటా సత్యసాయి కీర్తి మార్మోగుతూ వుండటం మీరు చూస్తున్నారు. ఎప్పుడో భవిష్యత్తులో కాక ఈ శరీరం యిక్కడ వుండగానే, యీ సంగతి మీకు కనిపిస్తూవున్నది. కాని, ఇదేదీ నాకు పట్టదు. సనాతనమైన ధర్మం, ప్రజలందరి సంక్షేమం కోసం వేదాలచే ప్రతిష్టితమైన ధర్మం, తన సహజస్థాయిలో తిరిగి స్థాపించబడే రోజు తొందరలోనే వస్తున్నది. అదేనేను కోరేది. వేద ధర్మ పునః స్థాపనమే సాయి సంకల్పము. నా విభూతులచే ప్రజలను ఆకర్షించటమే కాదు, నా సంకల్పంతో ధర్మాన్ని తిరిగి స్థాపించటం కూడా జరుగుతున్నది.
అసత్యాన్ని నిర్మూలించి సత్యాన్ని ప్రతిష్టించటం, మిమ్ముల్నందరిన్ని ఆవిజయోత్సాహంతో పరవశింప చేయటమే సాయి సంకల్పము.
(శ్రీసా.గీ. పు.397/398)