సమస్త మంచి చెడ్డలకు తానే కారణమనియు, సర్వమూ తననుండే పుట్టినవనియు, అట్లుండియూ నాటి దోషములు తన నేమాత్రము బంధించుటకానీ, బాధించుటకానీ చేయవనియూ వాటితో తనకేమీ సంబంధము లేదనియు. అన్నిటికిని అతీతమై యున్నాననియూ తెలుపుటలో మానవుడు చేయు మంచి చెడ్డలకు మానవుడు యే మాత్రము కర్తకానీ, కారణముకానీ కాదనియూ, యెట్టి మంచి చెడ్డలయిననూ భగవంతునిప్రేరణవలననే ననియూ, మానవుడు యెట్టి పాప పుణ్యములకూ బాధ్యుడు కాడని తలంచ వచ్చును. నిజమే. అయితే, ఇట్టి విశ్వాసము నిశ్చలమైన, నిర్మలమైన నిస్వార్థమైన ప్రేమ పరమాత్మునిపై కలిగి యుండిన ఇంతకంటే ధన్యము, పుణ్యము మరేమున్నది? తెలిసికొనవలసినదీ స్థిరముచేసుకొనవలసినదీ ఇదే. సర్వమూ భగవంతుడే, నాకేమాత్రమూ ఈ లోకముతో కానీ, భావముతో కానీ సంబంధము లేదని, నేను వీటన్నింటికి అతీతమైనవాడనని యే మానవుడు తెలిసికొననో వాడే సత్యజీవి. అయితే మాటల్లో మాత్రము సర్వమూ భగవంతుడే’, నేనతని చేతిలో కీలుబొమ్మ. అతని ఆధీనంలో నున్నవాడను నాదేమీ లేదని చిలుక పలుకులు పలుకుచూ. మంచిదానిని మాత్రము "నేను చేసినదనియూ, చెడ్డ మాత్రము భగవత్ ప్రేరణ అనియూ, కీర్తి మర్యాదలు గౌరవ ప్రతిష్టలు వచ్చు పనులు ఉపదేశములు అరచుట, తప్పులో, అపకీర్తియో, అగౌరవములో జరిగిన అవన్నియూ నావి కాదు. నేను నిమిత్త మాత్రమయిన వాడను సర్వమూ భగవంతుడు చేయించుచున్నా డనుట నేటి మానవులకు పరిపాటయినది. అది ఒక నూతన ప్యాషన్ కూడా! ఇట్టి గడియారం "పెండ్యులం వంటి మాటలు ఆటలు, సత్యములు కాలేవు, మనోవాక్కాయ కర్మలందు కూడా సర్వమూ భగవంతుని లీలావిభూతియే అనిదృఢవిశ్వాసమును కలిగియుండుట చక్కటి తత్త్వము. మంచి చెడ్డలు మానవుని దృష్టి దోషములే; వీటిని భగవంతునియందు నిరూపించుట ధర్మవిరుద్ధము.
(గీ.పు. 109/110)