కైవల్యోపనిషత్తు నందు "నకర్మణా నప్రజయా ధనేన త్యాగేనైకేన అమృతత్వమానశుః" అని తెలిపినట్లుగా, నకర్మణా అనగా యజ్ఞయాగాదులు, వ్రతములు, దానధర్మాదులు, తీర్థయాత్రలు, నదీ సాగర స్నానములు మున్నగు కర్మలవల్ల మోక్షము కలుగదు. అనగా అజ్ఞానం నివృత్తి కాదు. అనగా అధికార సంపదలు, బుద్ధి చాతుర్యము, కీర్తి ప్రతిష్ఠలు, సౌందర్యం, పుష్టి, పుత్రులు. మున్నగువాటివల్ల ముక్తి పొందజాలరు. నధనేన పైన తెలిపిన కర్మలన్నియు దనసహాయముతో జరుపబడునవి. ధనము లేని యెడల అట్టి కర్మలు జరుపబడజాలవు. అయితే జ్ఞానమును ధనముతో కొనలేరు. ధనమునకూ జ్ఞానమునకూ సంబంధము లేదు. కాబట్టి ధనము వలన ముక్తిని సంపాదించుకొనజాలరు. ఇది ధన సాధనము కాదు. అట్లయిన ముక్తికి సాధనమేమి? త్యాగేనైకేన అమృతత్వ మానశుః జగత్తు
లేనేలేదను జ్ఞానమువల్లను, ఉన్నట్లు కనబడినను అది మిథ్యా మాత్రమేనని తెలుసుకొనుటవల్లను, ఇహపరములలోగల భోగముల ఆశలు వదలుకొనుట వల్లను - అనగా సర్వం త్యాగము - సర్వత్యాగము వల్లనూ ముక్తి కలుగును అని దీని అర్థము. అనగా ఆత్మ తత్వజ్ఞానముచేత మాత్రమే.దాని ఫలమైన సంసారము దుఃఖము నశించును. కేవలము కర్మలవల్ల అవి నాశము కావు అని ఉపనిషత్తు చెప్పుచున్నది.
(సూ.వా.పు.1/2)