అనాదికాలమునుండి భారతదేశమునందు తల్లులను కూడా దైవస్వరూపంగా విశ్వసిస్తూ వచ్చారు. దుర్గా, సరస్వతి - వీరందరూ తల్లులతో సమానమే. వారికి వేరువేరుగా పేర్లు పెట్టుకొనినప్పటికీ, వారందరిని తల్లులు గానే భావిస్తూ వచ్చారు. సరస్వతియొక్క స్వరూపాన్ని విశ్వసించి, ఆనందించి, అనుభవించాలి. కొంతమంది, కొంతకాలం క్రిందట సరస్వతి పేరు కూడా చెప్పకూడదని చెప్పారు. ఇదిచాలా
అజ్ఞానము. ఇది చాలా అమాయకత్వం, తల్లితో సమానమైనటువంటి సరస్వతిని విస్మరించడం కడుశోచనీయం. సరస్వతిని స్మరించకుండా, ఏ ఒక్క అక్షరమును మనం వర్ణించలేం. ప్రాచీన కాలంలో మన ఋషులు సరస్వతిని వర్ణించారు.
"సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమే సదా
పద్మపత్ర విశాలాక్షీ పద్మకేసరవర్ణినీ
నిత్యం పద్మాలయా దేవీ సామాంపాతు సరస్వతీ"
మన భారతదేశమునకు కూడనూ ఈ సరస్వతి పేరు పెట్టారు . సరస్వతికి భారతి అని పేరు కూడా ఒకటి ఉన్నది. ఈ భారతి యొక్క పేరు సరస్వతి పేరే. ఈ సరస్వతి పేరే భారతదేశమునకు పెట్టారుగాని, ఏదో ఒక రాజు పేరుకాదు. దుష్యంతుని కుమారుడైన భరతుని పేరు ఈ దేశమునకు పెట్టారమకుంటున్నారు. అంతకు పూర్వం ఈ దేశమునకు ఏమి పేరు? ఇవన్నీ తీసుకుంటే దైవము నుంచి వచ్చిన పేర్లే ఇవన్నీ. సరస్వతి పేరు ప్రపంచంలో అన్నింటిలోనూలీనమై ఉంటున్నది. ఈమెకు బ్రహ్మపత్ని అని ఒక పేరు. బ్రహ్మ అనగా సృష్టికర్త యొక్క అనంతమైన శక్తిని మనం విశ్వసించాలి. సృష్టికర్త యొక్క దివ్యత్వాన్ని తెలుసుకోవాలి.
(శ్రీ 2.98 పు.14)
(చూ: ఆరాధన, ఆహుతి, గాయత్రి, శరన్నవరాత్రులు)