ఒకానొక సమయములోపల దక్షిణామూర్తి దేశసంచారము చేస్తూ వచ్చాడు. ఈ సంచారములో ఒక్కొక్క వస్తువును, ఒక్కొక్క విషయాన్ని తన గురువుగా స్వీకరిస్తూ వచ్చాడు. దక్షిణామూర్తికి ముప్పది నాల్గుమంది గురువులున్నారని కొంతమంది. అరువదినాల్గు మంది. గురువులున్నారని కొంతమంది చెప్తారు. ఒకనాడు సముద్రము దగ్గరగా వచ్చి యిసుక తిన్నెమీద కూర్చొని ఆ సముద్రము యొక్క అలలను ఆశ్యర్యముగా ఆనందముగా తిలకిస్తున్నాడు. ఒక నిముషమునకు సముద్రములో గాలికి యేదో చెత్తవచ్చి పడింది. తక్షణమే సముద్రము ఒకదానిపైన ఒకటి అలలను పంపిచి ఆ చెత్తను గట్టుకు పంపించింది. దక్షిణామూర్తి అనుకున్నాడు. అగాధమైన లోతు కల్గిన యీ అనంతమైన సముద్రములో ఒక చిన్న చెత్త వచ్చి పడితే దానికి యేమి నష్టము? ఎందుకోసము యీ విధముగా యింత తీవ్రంగా దానిని తత్ క్షణమే వెనుకకు నెట్టివేస్తున్నాది. అని యోచించాడు. తదుపరి ధ్యాన దృష్టిలో దీనియొక్క అంతరార్థమును గుర్తించాడు. ఈ నాడు కొంత చెత్త వచ్చి పడితే దానిని తాము ప్రవేశపెట్టుకుంటే అదే విధముగనే చెత్త, చెత్త... దండిగా వచ్చి కట్టకడపటికి సముద్రము రూపును కూడా మరపింపచేస్తుంది. సముద్రమును కప్పివేస్తుంది. కనుకనేమొట్టమొదటిలోనే జాగ్రత్తపడి చిన్న చెత్తను కూడ తాను లోపల చేర్చకపోతే తనకు ఏవిధమైన అపవిత్రత వుండదు కదా. అనే వుద్దేశముతో సముద్రము యీరకముగా చేస్తుండాదని భావించుకున్నాడు.
(శ్రీ.గీ.పు.143/144)
ఒకానొక సమయంలో దక్షిణామూర్తి సముద్రపుబొడ్డున నడుస్తూ ఉండగా ఇంతలో ఎక్కడినుండియో గాలికి కాస్త చెత్త కొట్టుకు వచ్చి సముద్రంలో పడింది. తక్షణమే సముద్రము ఒక అల తరువాత మరొక అలను పంపించి ఆ చెత్తను గట్టుకు నెట్టేసింది. ఈ దృశ్యాన్ని చూసిన దక్షిణామూర్తికి చాల విచారం కల్గింది. "ఓ సముద్రుడా! నీవు అనంతంగా, అగాథంగా ఉన్నప్పటికీ కాస్త చెత్తకు నీలో చోటివ్వలేకపోతున్నావు. ఇంత స్వార్థమా నీకు! కాస్త చెత్త నీలో పడితే నీకు వచ్చే నష్టమేమిటి?"అనుకొని ధ్యానంలో కూర్చున్నాడు. అప్పుడా ధ్యానంలో సముద్రుడు కనిపించి "దక్షిణామూర్తీ! నాయందు రత్నములు, ముత్యములు మొదలైన అనేక విలువైన పదార్థము లున్నాయి. నాయందు చెత్తకు చోటిచ్చానంటే అది క్రమక్రమేణ పెరిగిపోయి నా రూపాన్నే మరుగు పర్చుతుంది." అన్నాడు. సముద్రానికి అలలే శృంగారం. గ్రామానికి ఇళ్ళుశృంగారం, గగనానికి చంద్రుడే శృంగారం.మానవునికి గుణమే శృంగారం. కాబట్టి, మానవుడు తనలో దుర్భావాలకు ఏమాత్రము చోటిచ్చినా అవి క్రమక్రమేణ పెరిగి పోయి మనవత్వాన్నే మరుగు పర్చుతాయి.
(స. సా.వా.2000పు.209)
(చూ॥ చతుర్విధ పురుషార్థాలు, నీలవర్ణము)