చదివే సమయములో సరియైన స్థితిలో కూర్చొని చదువుకోవాలి. ఎందుకనగా ఈ దేహమున కొక ప్రత్యేకమైన విశిష్టత ఉన్నది. పశువులకు మృగములకు వెన్నెముక వంగి ఉంటాది. కాని మనిషికి చక్కగా ఉంటాది. మూలాధారము నుండి సహస్రారము వరకు పోయే మార్గము సరియైన స్థితిలో ఉంటుంది. కనుకనే సరియైన ఆలోచనలు సలుపుకుంటుంది. అట్లు కాకుండా వంగిపోతే ఆలోచనలు కూడ సక్రమమైన మార్గమునుఅవలంబించవు. ప్రతి మానవునియందు 101 నాళములు ఉంటాయి. అందులో ఒక్క నాళము మాత్రమే ప్రత్యేకంగా ఉంటుండాది. అది సహస్రారముతో సంబంధమై ఉంటుంది. ఇది ఆధ్యాత్మికమార్గములో ధ్యాననిష్ఠలో నుండిన వారికే సహాయకారిగా ఉంటుంటాది. దీనినే సుషుమ్ననాడి అన్నారు. ఇడ పింగళ సుషుమ్న నాడులలో భ్రూమధ్యము నుండి చేరినప్పుడే ఈ సుషుమ్ననాడి ఏకాగ్రతను అందిస్తుంది. వెన్నుముకలో 33 రింగ్స్ ఉన్నాయి. అందులో 9 నుండి 12 వరకు ఉండినవాని యందే సుషుమ్ననాడి చక్కగా వెలుగుతుంది. "నీలతో యద మధ్యస్థా విద్యుల్లేఖేవ భాస్వరా, నీవారశూక వత్తన్వీ పీతా భాస్వత్య ణూపమా" అని వేదము నల్లటి మేఘముల మధ్య ఒక్క తూరి మెరుపు మించినపుడు ఎంత ప్రకాశంగా ఉంటుందో మన వెన్నెముకలోపల అదేవిధంగా విద్యుల్లేఖ మించు తుంటాదట. అదే మన ప్రాణాధారము. కుండలీయోగము చేసేవారికి ఇది అర్థమవుతుంది. ఏయోగమయినా చేయి. యోగము చేయనప్పటికినీ సరియైన స్థితిలోనే దేహాన్ని ఉంచుకోవాలి.
(బృత్ర.పు.62/63)