సూర్యుని ప్రకాశములోని ఏడు వర్ణములు సమానమైనప్పుడు తెల్లదనమే కనిపించును. త్రిగుణములు సమానముగా ఉండిన శాంతి చేకూరును. ప్రశాంతి నిలయమనునది మీ హృదయమే కాని ఈ కట్టడముకాదు. ధనవ్యయము చేసి ఇక్కడికి మీరు అనేక పర్యాయములు రానక్కరలేదు. ఉన్నచోటనే ఉండి ప్రేమతో భజించిన, దీనుల సేవచేసిన అను గ్రహము ఆనందము దొరుకును.
స్వామి అంతటా ఉన్నాడు. ఎక్కడ చూచినా కనిపించేవన్నిఈ పరమాత్ముని స్వరూపమే. పరబ్రహ్మము తప్ప వేరేమియూ ఎక్కడనూ లేదు. సర్వమూ భగవంతుడే , సర్వ భూరాంతరాత్మ అంటే అదే అర్ధము. తనది కాని రూపము లేదు. తనదికాని పేరు లేదు. రాతిలోనూ భగవంతుని చూడవలెను. కాని రాతినే భగవంతుని చేయకూడదు.
(స.సా...77పు. 162)
సూర్యుడు ఉదయించక పూర్వము, కిరణములు ముందు ప్రకాశిస్తాయి. కిరణములు వచ్చిన తరువాతనే అరుణుడు ఉదయిస్తాడు. అయితే కిరణములకు అరుణునకు అవినాభావ సంబంధము ఉంది ఎట్టి భేదము కూడా లేదు. అరుణునిలో చేరినదే కిరణము. కిరణములు కలిగినటువంటిదే అరుణము. అదే విధముగ దివ్య తేజమైన చైతన్యము ఒక విధమైన అరుణుని వంటిది. ఈ కిరణములే ఒక అవతార తత్వము. అయితే అవతారములో - దిగి రావటంలో - కొన్ని గుణములు చేర్చుకొని రావాలి. అది పూర్ణత్వమైనప్పటికి గుణముల చేరికవలన అసంపూర్ణమైనదిగా ఉంటుంది. దేహ, గుణ మనో బుద్ధులు లేకుండా అవతరించిన మానవులకు బోధించటం కాని, మానవులకు ఆదర్శవంతమైన జీవితాన్ని నిరూపించటం కాని సాధ్యం కాదు. కనుక అవతారమునకునిర్గుణ నిరంజన, సనాతనమైన ఆత్మతత్వ చైతన్యమునకు ఉన్న వ్యత్యాసము కొంత వరకు మీరు నిరూపించాలి. నిత్య శుద్ధ బుద్ధ తత్వము - ఇదే అస్తి భాతి ప్రియము. అట్టి అస్తి భాతి ప్రియమునకు రూప నామములు కల్పించినదే అవతారము. అక్కడ మూడు, ఇక్కడ అయిదు. కనుకనే దీనికి పంచకములు అని పేరు పంచకమనగా ప్రపంచమే.
(ప.3.2.85 పు.14)
భారతీయులకు సూర్యునికి సన్నిహిత సంబంధము కలదు. అనాది కాలము నుండి సూర్యుని స్థానము భారత వీరులైన క్షత్రియులకే కాక సామాన్య ప్రజలకు కూడనూ ప్రధాన స్థానమే కాక, పవిత్రమగు పీఠముమ ధరించినది, వహించినది. క్షత్రియ జాతికి మూలపురుషుడు సూర్యభగవానుడు. భారత సంస్కృతిలో ఇట్టి పవిత్ర స్థానము మరెవ్వరికీ లేదు.
భారతీయులే కాక యావత్ప్రపంచమునకు సూర్యుడు ప్రత్యక్ష భగవానుడు. ప్రపంచమంతయూ కాలముచే నడుచుచున్నది. కనుక కాలానికి కూడనూ ప్రధాన ఆధారము సూర్యుడు కాలము తనవలననే కలుగుచున్నది. కనుక కాలుడు సూర్యుని పుత్రుడని కూడ వాడు చున్నాము. ప్రతి మానవుని జీవితమూ కాలముచే కట్టుబడినది కనుక జీవితమునకు సూర్యుడే ఆధార, ఆరాధ్య దేవుడై యున్నాడు. యెవరికి అర్పితము చేసినమా చేయకున్ననూ మానవుని సర్వ కర్మలూ సూర్యునకు మాత్రము ఆర్పితము చేయక తప్పించుకొని వీలులేదు..
మానవుని జీవిత ప్రమాణమును దినదినమునూ కరిగించి హరించు చున్నాడు. అంతియేకాక అతనిద్వారా ఈ లోకమునకు ఎంత ఉపకార మనునదీ వేయిమాటలతో చెప్పనక్కరలేదు. నిత్యానుభవమే ప్రత్యక్ష సాక్షి. లోకమునందలి పాడిపంటలకు సస్యశ్యామలములకు మూల కారకుడు సూర్యుడే. అతని కిరణముల చలువ సోక కుండిన పాడిపంటల యందు పటుత్వముండదు. తన సూటియైన కిరణముల ద్వారా సముద్ర జలమునుపైకిచ్చేది. అక్కడ తనచే సృష్టింపబడిన మేఘముల స్వరూపమున ఇమిడ్చి, వాటిని ప్రజల యొక్క ధర్మ కర్మల ఫలముల ననుసరించి ఆయా స్థానములందు క్రిందికి వర్షరూపమున అందించుచున్నాడు. అతను నిరంతరము ధర్మదేవత స్వరూపమును ధరించి తారతమ్యమును పాటించక తన కెదురైన వాటన్నింటినీ పలుకరించుచూ,తన తేజస్సును వాటిలో చేర్చుచున్నాడు. సూర్యుడు మహాత్యాగి, ఒక నిమిషమయిననూ తన సుఖమును కానీ విశ్రాంతిని కానీ ఆశించక కర్తవ్యకర్మ నాచరించు నిష్కామకర్మయోగి. నిరాడంబరముకల నిగర్వి లోకమునకు యెవ్వరూ చేయనంతటి ఉపకారమునూక్షేమమునూ తాను చేయుచూ, అందించు చుండిననూ తానేమీ చేయనివానివలె నటించుచుండును. ఇన్ని కార్యములు నా వలన లోకమునకు జరుగుచున్నవి కదా! నేను లేకుండిన లోకమేగతి పట్టియుండునో అని ఏనాడూ గర్వముతో తలంచడు.
ఎంత వేడయినమా సహించి వోపికతో యెంతపని అయినమా చేసి లోక క్షేమమును అందించుచున్నాడు! సూర్యుడే శ్రమ అని తలంచినట్లయివుండిన లోక మేస్థితిలో ఉండెడిదో ఊహలకుకూడనూ అందదు. అసలు మానవుని దేహమందు ఈ మాత్రపు వేడి నిలిచియున్నదన్న దీనికి కారణము సూర్యుడంతటి వేడిని సహించుకొనుటయేకాని వేరుకాదు. దీనినిబట్టిచూడగా దేహమునుకూడనూ తానే కాపాడుచున్నాడు. తన శక్తిని కొంత దేహమున ఇముడ్చును. ఆ సూర్యకాంతే దేహమున కొంత లేకుండిన అది ఒక జడమయి నిస్సారమయి యుండెడిదికదా!
సూర్యుడే విసుగు విరక్తి చెందిన లోకమంతా ఒక నిమిషములో మండిపోయివుండెడిది. కాన అతడుయేవిధమయిన విసుగూలేక అతి వోపికతో లోకమును రక్షించుచున్నాడు. ఇది అతను సహజమని భావించు చున్నాడు.కాని సర్వులకోసమని భావించుటలేదు.
సహజ కర్మలయందే ఓర్పు వుట్టిపడును కానీ అసహజ కర్మలందు అంత శాంతము చేరుటకు వీలులేదు.సహజకర్మలు యెప్పటికీ యే ఒకరికి భారమనిపించవు: అహంకారమున ఆచరించిన కర్మలయందే విసుగు, విరక్తి, ఆశాంతి, భారమూ తాండవమాడును. అందుకు ఆశ్చర్యము కూడనూ తోడగును, సహజమునకు అట్టివి చేరవు.
మానవుడు యెవడైనా సుఖంగా జీవించుచుండిన యెవ్వరూ యేమయ్యా సుఖంగా వున్నావని ప్రశ్నించరు. అదే దుఃఖముగా నుండిన ప్రతివాడూ యెందుకయ్యా దుఃఖముగా న్నావని ప్రశ్నల వర్షము కురిపింతురు. కారణమేమి? మానవుడు సుఖ స్వభావము కలవాడు; అందువలన ఆశ్చర్యము కలుగదు. అందులో దుఃఖము మానవునకు అస్వభావము కనుక అంత ఆశ్చర్యము కలిగించి అనేక ప్రశ్నలకు గురిచేయును. దు:ఖముభ్రాంతితో యేర్పడినది కాని అది సహజమైనది కాదు. అందువలననే అన్ని వికారములు కలుగును.
దీనిని బట్టి చూడ సహజమునకు విసుగు కాని, భారము కానీ ఆశ్చర్యము కాని, గర్వముకాని, విరుద్ధమయిన కల్పిత వికారములని సూర్యభగవానుడు ప్రత్యక్షముగా మానవులకు బోధించుచున్నాడు!
సూర్యభగవానుని కర్మ కృత్రిమము కాదు. కనుకనే ఏ ఆర్బాటము కానీ ప్రచారాలు కానీ లేక నిశ్శబ్దములో సకాలమునకు సక్రమ పద్ధతిని సాగించుచున్నాడు. తనవలన కలిగిన కాలమున కూడా వృధాగావించక దానినే మానవుల జీవిత ప్రమాణముగా నియమించి కాలమువలన ఆనంద ఆహారములనేగాక మంచి పెద్దలను కూడా నిర్ణయించి జీవులకు మార్గదర్శకుడై మెలగుచున్నాడు. జీవులకు సద్గతి మార్గమును సమకూర్చుచున్నాడు. ఇట్టి గుణవంతుడూ మహాత్యాగీ నిష్కామకర్మయోగి కనుకనే భగవంతుడు మునుపు ఈయోగమును సూర్యునకు బోధించియుండుట, లేకున్న సామాన్యులకు యిట్టిది సాధ్యమా! ఇప్పుడు ఈ ఆవ్యయమయిన ఈ యోగమును తిరిగి ప్రజా ప్రతినిధిగా నిలచిన అర్జునునికి బోధించుచున్నాడన్న, అర్జునుడుసూర్యునంతటి గుణశాలి అయివుండవలెను గదా! ఇతని చరిత్ర యెంతటిదయివుండునో పాఠకులు యోచించ వచ్చును. అంతటి పవిత్రతే ఈ అర్జునునియందు లేకుండిన కృష్ణ పరమాత్మ ఇంత ప్రయత్నము ఎందుకు సంకల్పించి యుండును అర్హతలేనిదే అందరికీ భగవంతుడు అందు బాటులో వుండడు. తన సంకల్పమునకు తగిన అర్హత అర్జునునియందు ఉన్నదనుటలో సందియములేదు.
(గీ.పు.49/52)
సూర్యుడు తన కిరణములచే దశదిశల వ్యాపించి అచటి ప్రాణిజాతము సుద్దీపింపజేయుచున్నాడు. ప్రజాపతి యొక్క స్వాత్మభావమగుటచే దిగ్జాతములకు కూడా ప్రజాపత్య స్వాత్మభావము కలుగుచున్నది. కనుక ప్రాణశబ్దముచే ఆదిత్యుడు చెప్పబడుచున్నాడు. సమస్తజీవులు భోక్తరూపమున నాదిత్యస్వరూపులగుటచే అతడు వైశ్వానరు డనబడుచున్నాడు. సకల ప్రపంచ మతని స్వరూపమగుటచే అతడు విశ్వరూపుడని కూడా చెప్పబడుచున్నాడు. విశ్వమునందలి నరుల స్వరూపుడు గనుక వైశ్వానరుడనియు, విశ్వమే అతని స్వరూపము కనుక విశ్వరూపుడనియు అతనికి ప్రసిద్ధి గలిగినది.
ఇక్కడ సంవత్సర శబ్దము కాలమునకు పలక్షణము. అహారాత్రముల సముదాయమే కాలము. సూర్య సంచారముచే అహారాత్రములు, చంద్రసంచారముచే తిధులు నేర్పడుచున్నవి. చంద్ర సూర్య మిధునము ప్రజాపతి సమూద్భూత మగుటచే సంవత్సరము, ఆయనములు మొదలగు విభాగములగు కాలముకూడా ప్రజాపతి స్వరూపమే అగుచున్నది. ప్రజాపతికి దక్షిణోత్తర మార్గములు రెండును కలవు. ప్రజాపత్యుపాసన మిచట జ్ఞానమని చెప్పబడుచున్నది. జితేంద్రియత్వము, వేదములయందు విశ్వాసము, జ్ఞానము ఇవిగల ప్రాణస్వరూపమగు ఆత్మ తానేయని తెలిసికొని యుత్తరాయణ మార్గమున సూర్యలోకమునకు పోవును. ఈ లోకము సకల ప్రాణులకు ఆశ్రయము. ఉపాసనాసహితమగు నిష్కామకర్మ నాచరించువాడును అచటకే పోవును. కాలాత్మకుడగు సూర్యుడు వసంతాది ఋతు పంచకము పాదములుగా గలవాడనియు, ద్వాదశమాసము లతని ఆకారములనియు, ఆదిత్యుడు సర్వలోక కారణుడనియు నాలుగు. ఆరు మంత్రములలో చూపబడుచున్నది. వర్షము ఆదిత్యునిచే కలుగుటవలన అతడు మూడవదియగు ద్యులోకమున జలముగలవాడని తెలియుచున్నది.
(ఉ.వా.పు.44/45)
మానవుడు తలయెత్తి పైకి చూచినప్పుడు అనంతాకాశములో ప్రకాశిస్తున్న సూర్యుడు దేదీప్యమానంగా కనుపిస్తుంటాడు. అంతులేని ఆకాశములో అనంతముగా ప్రకాశించే సూర్యుడు ఒక్కడే.
(ఉ.బ.పు.14)
మనము తెలుసుకున్నది తక్కువ తెలుసుకొనవలసినది ఎక్కువ అని అర్థము చేసుకోండి. మానవుడు భూమిని చేయలేడు; నీటిని సృష్టించలేడు. కొమ్మకు కొమ్మకు రాపిడి జరిగినప్పుడు అగ్ని కలుగుతున్నదేగాని కొమ్మలో అగ్నిని పెట్టి నిలబెట్టలేడు. ఇది మానవుని చేతకాని పని. కొమ్మలో అగ్ని వుందిగాని ఆ అగ్ని కొమ్మను కాల్చకుండా కాపాడుకుంటున్నది. ఆ పనిని మానవుడు చేయలేడు. ఈ విధముగా మన కంటికి కనపించక చెవులకు వినిపించక, మనస్సుకు అనిపించక ఏదో ఒక విధమైన శక్తి అంతర్బూతమై వున్నది అని గుర్తించి అది మానవాతీతమైన శక్తిగా వుండవచ్చును అని ఉపాసిస్తూ వచ్చాడు. ఏశక్తికైనా ప్రత్యక్ష ప్రమాణము అవసరము. ప్రత్యక్ష ప్రమాణమునకు ఏది సరియైన సాక్ష్యము అని విచారించి ప్రత్యక్ష ప్రమాణము సూర్యుడేయని విశ్వసిస్తూ వచ్చాడు. సూర్యుడే లేకపోయిన వెలుతురు లేదు. వెలుతురు లేకపోతే సృష్టిస్తంభించి పోతుంది. ఈ ప్రపంచమునందు వృక్షములు అభివృద్ధి కావలె నన్నను, పంటలు పండవలెనన్నను. జీవి పెరగవలెనన్నను వీటన్నింటికి హైడ్రోజను అత్యవసరము. సూర్యుని ప్రధానమైన శక్తిహైడ్రోజన్, హీలియం. హైడ్రోజను, హీలియం రెండూ లేకుండాపోతే జగత్తే లేదు. ఈ విధముగా ప్రత్యక్ష ప్రమాణము సూర్యుడేయని విశ్వసించి ఈ సూర్యతత్వము నందు కొన్ని రహస్యములు గుర్తించినారు.
(ఉ.బ.పు, 15)
సమస్తకర్మలకు కర్మాధికారి, కర్మనిష్ణుడు - సూర్యుడే. నిర్విరామ కృషిచేత నిరంతర తాపత్రయముతో, అంతులేని ఆశలతో, అర్థంకాని ఆవేదనలో ఆప్రాప్యమునకై ప్రకులాడెడి మానవులకు మార్గదర్శకుడిగా నిలచి, వారికి ప్రశాంతిని కల్గించి, కర్మ శూరుడిగా నిలచినవాడు సూర్యుడు. సూర్యునకు ఏమాత్రం విశ్రాంతి లేదు. ఈతడు దూషణ భూషణలకు ఏమాత్రం క్రుంగడు, పొంగడు, ఇతడు సమరస భావంతో, పరమ శాంతితో తన కర్తవ్యాన్ని నిర్వరిస్తుంటాడు. ప్రపంచానికి తాను చేసినదంతయు ఉపకారమే గాని అపకారము కాదు. సూర్యుడు నిరంతరం నిర్విరామంగా పని చేస్తున్నాడు. అతడు ఒక్క అర్థ దినమైనా సెలవు (Leave) తీసుకొంటే, ప్రపంచమే మునిగిపోతుంది. ఒక్క గంటైనా తాను సెలవు తీసుకోవడం లేదు. నిరంతర కృషి గావించే కర్మశూరుడు, కర్మవీరుడు సూర్యుడు.
అందుచేతనే భగవద్గీత యందు శ్రీకృష్ణుడు "కర్మచేసి తీరాలి, ఇది నా కర్తవ్యం"అన్నాడు. భగవంతునికి కర్మాచరణ కర్తవ్యమైనప్పుడు మానవులు తాము కర్మ నాచరించకుండా కర్మసన్యాసం పుచ్చుకుంటామంటే - ఇది కేవలం పిరికితనం, బలహీనత. కర్మ సన్యాసం కంటే కర్మ యోగమే ఉత్తమమైనది. "యోగః కర్మ సుకౌశలం", కర్మల నాచరించుటయే మన యోగం. ఈ కర్మము సన్మార్గంలో ప్రవేశ పెట్టాలి. సదుద్దేశముతో కర్మల నాచరించి, సదానందమును అనుభవించాలి. అలాంటిదే నిజమైన కర్మ, నిరాశతో, నిప్పృహతో కర్మల నాచరించ రాదు, ఆనందంగా కర్మలయందు ప్రవేశించాలి. అప్పుడే నీవు కర్మాధికారవి కాగలవు. సూర్యుని యందు ఎట్టి అహంకారము లేదు. ఇతని లేకపోయినచో సృష్టియేలేదు. ఇతని యందున్న హైడ్రోజెన్ వలన పర్వతములు, వృక్షములు మొదలగునవి ఆవిర్భవిస్తున్నాయి. సమస్త జీవులు, సమస్త పంటలు సూర్యుని నుండియే ఆవిర్భవిస్తున్నాయి. ఇంత పని తానే చేస్తున్నాడనే ఆహంకారం అతని యందు ఏ మాత్రం లేదు. కనుకనే, "నాయనా! నీవు గొప్పపని చేస్తున్నావని, పరోపకారము చేస్తున్నావని గర్వపడవద్దు. నన్ను నీవు అనుసరించు" అని సూర్యుడు ప్రబోధిస్తూ ఉన్నాడు.
మానవ హృదయమే హిమాయలం
మనం సూర్యుని అనుసరించాలి. ఈ నాడే ఉత్తరాయణం ప్రారంభమైనది మహాజ్ఞాని, మహాత్యాగి, మహాదీక్షాపరుడైన భీష్ముడు కూడా తన ప్రాణాన్ని ఉత్తరాయణ పుణ్యకాలము నందే వదలవలెనని 56 దినాలు శరతల్పంపై పరుండినాడు. ఈనాటి నుండి సూర్యుడు ఉత్తర దిశకు ప్రయాణి స్తుంటాడు. ఉత్తర దిశగా హిమాలయ పర్వతములున్నవి.ఈ హిమాలయములు ఈశ్వరుని యొక్క నివాసం, హిమాచలం అనగా ఏమిటి? హిమం తెల్లగా ఉంటుంది. అనగా, ఇది పవిత్రమైనది అని ఒక అర్థము. దీని గుణం ఎటువంటిది? దీని గుణం-చల్లదనం, ఇది ప్రశాంతిని సూచిస్తుంది. ఇంక, అచలము అనగా చలనం లేకుండా స్థిరంగా ఉండేది. కనుక నిర్మలంగా నిశ్చలంగా, ప్రశాంతముగా ఉండిన మన హృదయమే హిమాచలం. ఈ హిమాచలము నందే ఈశ్వరుడు ఉంటున్నాడు. హిమాచలమునకు చేరుకోవాలంటే ఎక్కడో ఋషికేశ్, హరిద్వారములకు మనం ప్రయాణం చేయనక్కరలేదు. మన దృష్టి బహిర్ముఖం గాకుండా, అంతర్ముఖము గావించి, మన నిశ్చల ప్రశాంతమైన హృదయమనే - హిమాచలమునకు ప్రయాణం చేయించమని సూర్యుడు ప్రబోధిస్తున్నాడు.
(స.సా.ఫి.మా.92పు.31/32)
సూర్యుడు తన కిరణములచే సముద్రజలమును ఆవిరిగా మార్చి మేఘములుగా రూపొందించి, వర్షముగా కురిపించి, తీయని నీటిని సమస్త జీవరాసులకు అందిస్తాడు.అదేవిధంగా మనము మన జ్ఞానేంద్రియముల ద్వారా గ్రహించిన విషయ పరిజ్ఞానమును జ్ఞానముగా మార్చి మానవాళికి అందించాలి.
(సా.యా.పు.1)
మన నిత్య జీవితంలో నిత్య కర్మలాచరించడానికి, జీవిత రహస్యముల గుర్తించడానికి ప్రధాన ఆధార పురుషుడు సూర్యుడు. సూర్యుడనియే మొదట గుర్తించారు. సూర్యుడు లేకున్న దినములు లేవు. మానవుడే కాదు; ఏ ప్రాణి కూడా ఉద్భవించడానికి వీలు లేదు. సమస్త ప్రాణులు పశు పక్షులు, వృక్షాలతో సహా సూర్యోదయముతోడనే అభివృద్ధి గాంచుచున్నవి. కమలములు, కలువలు సూర్యోదయాస్తమానము తోటే విచ్చుకొంటున్నవి. కనుక సమస్త సృష్టికి, పోషణకు, క్షీణమునకు సూర్యుడే మూలకారకుడని భావించారు. ప్రత్యక్ష స్వరూపుడేయైన సూర్యుడేనని ఆనాటి నుండియు ఆరాధనలు ప్రారంభం చేశారు. విశ్వామిత్రుడు గాయత్రి మంత్రముతో సూర్యునికి ప్రధాన స్థానము ఇచ్చాడు.
(సా.పు.635)
(చూ: ఏడువర్ణములు, జగత్సేవకుడు, గాయత్రి, న్యూస్, ప్రకాశము, విశ్వామిత్రుడు, సంశయము, హిమాచలం)