స్పర్థలూ, పోటీలూ లేకుండా అందరిలో సమత్వం సహకారం పెంపొందించటం, ఇది కేవలం ప్రేమ, సత్యాల ద్వారా సాధ్యం. ముఖ్యం అయిన విషయం ఏమిటంటే, యిరువర్గాల వాళ్లని ఒకే ఒకవర్గంగా సమ్మిశితం చెయ్యటం వాళ్లని ఒకే తాటిమీద నడిపించటం అసలైన సమస్య. ధనవంతులు ఒకవైపు, బీదవాళ్లు ఒకవైపు ఎవరికివారు విడివిడిగా ప్రత్యేకంగా నివసిస్తుంటారు. వాళ్లని ఒకదగ్గరకు చేర్చేదెట్లా?
నేను వాళ్ల మధ్యవుండే బీద గొప్పభావాలు పోయేవిధంగా, వారిలో ఏకత్వభావాలు వృద్ధిచెందే విధంగాను పనిచేస్తున్నాను. ఈ ఆశ్రమంలో అందరూ కలిసి మెలసి సమభావంతో పని చెయ్యటం మీరు చూడవచ్చు. ఇక్కడ గొప్పవాళ్ళకి ప్రత్యేకమైన సదుపాయాలేమీ లేవు. వాళ్లు బీదవారిలాగే జీవిస్తారు. భుజిస్తారు. పనిచేస్తారు, పూజిస్తారు. నిద్రిస్తారు. అందరూ ఒక శ్రామిక వర్గంలాగా యీ ఆశ్రమపు నీతి నియమాల్ని పాటిస్తూ జీవిస్తారు. ఇక్కడ యిన్ని కఠిన నిబంధనలున్నప్పటికీ వాణిజ్య వేత్తలు పారిశ్రామిక వేత్తలు వస్తూనే వుంటారు. ఎందువల్ల? ధనంగానీ, అధికారంగానీ సంపాదించి పెట్టలేని మనశ్శాంతి వాళ్ళకిక్కడ దొరుకుతుంది.
ఇక్కడ ఒక ఆధ్యాత్మిక, ఆత్మ తత్వంలో కూడిన ఒక వినూత్న ప్రపంచం వుంది. ఇందులో ప్రవేశించటానికి కొన్ని లౌక్యాలు చెయ్యవలసి వుంటుంది. వాళ్ళకి, అందరూ ఆశించే మనశ్శాంతికి దారి చూపించటం నా ఆశయం. ఈ ఆధ్యాత్మిక పరివర్తనలో, ఆనందం అనేది ధనం వల్లగాని, తదితర మార్గాలవల్ల లభించేది కాదని, తనలోనే వుందని, జిజ్ఞాసువు గ్రహించగలుతాడు. ఈ ఆనందం అందరిలోనూ అంతర్లీనమై వున్న విశ్వవ్యాప్తమైన దివ్యత్వ పరి గ్రహణ ద్వారా మాత్రమే లభిస్తుంది.
ఈ భావం యిచ్చిపుచ్చుకునే స్నేహ తత్వాన్ని పెంపొందిస్తుంది. తమ అవసరానికి మించి సంపద కలిగినవాళ్ళు త్యాగం చెయ్యటానికి, అవసరానికి తగినంతగా లేని వాళ్ళకి వాళ్ళకి కావలసినవి, పొందటానికి అవకాశం వుంటుంది. ఆధ్యాత్మికంగా అందరూ ఒకే మతానికి వర్గానికి చెందిన వాళ్ళు, ఒకే ఒక దైవంనుంచి అన్ని మతాల సిద్ధాంతాలు ఉద్భవించాయి. ఈ మూలాధారమైన ఏకత్వపు ఆనుభవం వాళ్ళకి ఆత్మ సత్యాల అవగాహన ద్వారా కలగాలి. అప్పుడు వాళ్ళు ఒకే ఒక మతమైన :”WORK WORSHIP AND WISDOM” కి చెందుతారు. కృషి, ఆరాధన, మరియు జ్ఞానం.
(స.ప్ర.పు. 24/25)
కర్మ సుకౌశలం;సమత్వం యోగం: ఈ రెండింటినీ మనము అవలంభించాలి. సమత్వమే యోగం యోగమే కర్మ సుకౌశలం, సమత్వమును మనము గుర్తించుటకు ప్రయత్నము చేయాలి. యోగము ద్వారా మానవుడు తనంతట తాను ఉద్దరింపబడతాడు. భోగము చేత తనంతట తాను పతనమై పోతున్నాడు. కనుక భోగమా ప్రధానము? యోగమా ఆధారము? దీనిని విచారించాలి. మనము భోగ నిమిత్తమై, కాలమును, కాయమును, కర్తవ్యమును వ్యర్థము గావించుచున్నాము. యోగము నిమిత్తమై మనము ప్రయత్నము చేయడములేదు.యోగమే కర్మ, కర్మయే కౌశలము, కౌశలమే సమత్వము. ఇట్టి సమత్వమనే తత్వాన్ని చేపట్టాలి.
యోగమనే తత్యములో ప్రధానముగ ఐదు రకములనున్నవి.
మొదటిది ప్రకృతి యొక్క సమత్వము
రెండవది సమాజము యొక్క సమత్వము
మూడవది జ్ఞానము యొక్క సమత్వము
నాలుగవది కర్మ యొక్క సమత్వము
ఐదవది భక్తి యొక్క సమత్వము
(శ్రీది.పు.156/157)
"సమత్వాన్ని పోషించుకున్న వ్యక్తి ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు. అందుచేతనే, నాకు ఎప్పుడూ ఆనందమే. మీరేమన్నా "సంతోషం, సంతోషం" అంటాను. "స్వామీ! నా భార్య చనిపోయింది" అంటే, "సంతోషం" అంటాను. "స్వామీ! నా కాలు విరిగింది" అంటే "సంతోషం" అంటాను. "ఏమి, నా కాలు విరిగితే స్వామికి సంతోషమా!" అని మీరు అనుకోవచ్చును. కాని, నాకు అన్నింటికీ సంతోషమే."
సమత్వమనేది లౌకికంగా, వ్యావహారికంగా అనుభవానికి తప్పక వస్తుంది. లౌకికంగా కూడా అంతే. ఉదాహరణకు, బిడ్డ పుట్టినప్పుడు నవ్వుతావు, వృద్ధుడు మరణించినప్పుడు ఏడుస్తావు. పుట్టిన బిడ్డ నవ్వమని చెప్పలేదు, మరణించే వృద్ధుడు ఏడ్వమని చెప్పలేదు. ఈ రెండూ నీ అటాచ్మెంట్’ వలన వచ్చినవే. ఇప్పుడు నీకు, నీ ప్రక్కనున్న టీచరకు విరోధం కల్గిందనుకో. అప్పుడు నీవేమి చేయాలి? విరోధమును పెంచుకోకూడదు. "నాలో ఉన్న పంచభూతములే ఇతనిలోనూ ఉన్నవి. ఏమీ తేడా లేదు" అని అనుకున్నప్పుడు సమత్వము ప్రాపంచికంగా కూడా అనుభవానికి వస్తుంది..
మానవునికి భౌతిక, మానసిక, ఆధ్యాత్మికతత్త్యములు ప్రధానమైనవి. అటాచ్మెంట్ అనేది భౌతికము (Physical), మానసికమునకు సంబంధించినవి సత్వరజస్తమో గుణములు. మూడవదైన ఆధ్యాత్మికము ఆత్మసంబంధ మైనది. ఆత్మయే ఈశ్వరత్వం. ధర్మము, ఐశ్వర్యము, యశస్సు, శక్తి, జ్ఞాన, వైరాగ్యములే ఈశ్వర లక్షణములు.కనుకనే, ఈశ్వరుణ్ణి షడైశ్వర్యసంపన్నుడంటారు.
ఈశ్వరత్వంతో కూడిన మానవునికి ఉండవలసినవి ఇట్టి ఉత్తమగుణములేగాని, ఉత్తగుణములు, చెత్తగుణములు కాదు."
(స.సా.మే 2002 పు. 156/157)
(చూ॥ కర్మయోగి,రాముని ఆశయము)