ప్రకృతి సంబంధమైన సర్వ విషయ వాసనలకు ఆతీతుడై, సర్వదా సర్వకాలము, సర్వత్ర సర్వేశ్వర చింతనే తన శ్వాసయని భావించి, ఆచరించి, ఆనందించునదే సన్యాసములోని నిజసారము. గృహస్థమును రోసి, జనని జనక పతీసుతులను బంధు మిత్ర ధన కనక వస్తు వాహనములు, జనన మరణాది దుఃఖములు యావత్తు అస్థిరములని ధృడముగా తెలిసికొని రాగవిరాగదూరుడై, శిక యజ్ఞోపవీతముల విసర్జించి, కాషాయ వస్త్రములను ధరించి, గ్రామవాసము చేయక చిక్కిన అల్పాహారాలు భుజించి, చిక్కనిచో ఆహారములేదని చింతించక, తిన్న చోట తినక నిద్రించినచోట నిద్రించక, నిద్రాహారములను జయించి, భగవంతుని నిరంతరము ధ్యానించుచు, జపించుచు, కాల ప్రమాణములను మీరి వర్తించు నదే నిజమైన సవ్యాస మనబడును.
(ప్ర..వా.పు. 11/12)
ఆనాటి పరిస్థితులను బట్టి కాలడి ప్రజలు శంకరులవారు తన తల్లికి అంత్యక్రియలు చేయడాన్ని వ్యతిరేకించారు. ఎందుచేతనంటే సన్న్యాసియైనవాడు కర్మకాండలో ప్రవేశించకూడదు. అసలు సన్యాసమనగా ఏమిటి? సమస్త ఆశలను త్యజించడమే సన్యాసము. విద్యార్థులకు అర్థమయ్యే నిమిత్తమై నేను కొంచెం లోతుగా వివరించవలసి వస్తున్నది. సన్యాసము స్వీకరించేవారు మొట్టమొదటవిరజాహోమముచేస్తారు. అనగా తాముమరణించినట్లు భావించి తమ శ్రాద్ధకర్మలు తామే చేసుకొని నూతనమైన నామమును, సనాతనమైన వేషమును దరిస్తారు. పూర్వపు రూపము పోతుంది. పూర్వపు నామము కూడా పోతుంది. క్రొత్త పేరు వస్తుంది. లోకానంద, నాగానంద అని తమ పేరు చివర ఆనందాన్ని తగుల్చుకుంటారు కాని వారిలో కించిత్తైనా ఆనందముండదు! ఈ విధంగా విరజా హోమంలో తమ తద్దినమును తామే పెట్టుకున్న తరువాత ఇంక తల్లి ఎక్కడ! తండ్రి ఎక్కడ! కనుకనే సన్న్యాసికి ఎవరితోను సంబంధ ముండకూడదు. తాను కర్మకాండలో ప్రవేశించకూడదు.
(స.సా..జూలై 97పు.185)
సన్యాసమంటే ఏమిటి? కేవలము గుణము మారాలికానీ గుడ్డలు మారితే ప్రయోజనం లేదు. మనస్సు మారాలి కానీ, మనిషి మారితే ప్రయోజనం లేదు . కనుకనే, తాను సర్వేంద్రియములను అరికట్టి, సర్వసంగపరిత్యాగి అయినటువంటివాడే సన్యాసి. ఈనాడు సన్యాసులకున్నన్ని ఆశలు గృహస్థునకు కూడా లేవు. దేనికి ఈ ఆశలు? ఎవరికోసం ఈ ఆశలు? "ఇదంతా తొమ్మిది చిల్లుల తోలు తిత్తియే కాని కాంతి కల్గిన వజ్రఘటముకాదు." నిమిషనిమిషమునకు నీరు లూరునే కాని పునుకు జీవ్వాజీలు పుట్టబోవు. కడుపులోని మలము కడమెల్ల ఎముకలు తరచిచూడ పైన మురికి తోలు కనుక మరణమునకు భయపడరాదు. అభివృద్ధికి పొంగిపోరాదు. ఏమిటి ఈ అభివృద్దులు? మరణాలు? ఇవి కేవలము జీవితములో తరంగాలు, సముద్రములో నుండి వచ్చేటటువంటి తరంగముల వంటివి. పుట్టిన దానికి చావు తప్పదు. కనకనే ఈ రెండూ సహజమైనవే కాని దీనికి విచారించనక్కరలేదు. అయితే ఈ ప్రాకృతమైన జగత్తునందు, జీవించు వంతవరకు కూడానూ Ideal boy, Ideal girl మంచి ఆదర్శవంతమైనటువంటి జీవితంగా మనం జీవించాలి. కాని ఈనాటి విద్యార్థినీ విద్యార్థులు ఈ భౌతిక ప్రభావమునకు మునిగి, ఈలౌకిక వాంఛలలో మునిగి కేవలము తాత్కాలికమైన జీవితము గడిపే నిమిత్తమై కృషి చేస్తున్నారు. చదివిన చదువులు దేనినిమిత్తం? పొట్టకూటికా? కాదు.. కాదు.... పొట్టకూడు కూడా అవసరమే! కాని చదివిన చదువును పదిమందికి ఆదర్శవంత మయినటువంటి మార్గములో దీనిని అందించటానికి ప్రయత్నించాలి. "సద్గుణములు, సద్బుద్ధి, సత్యనిరతి, భక్తి, క్రమశిక్షణ, కర్తవ్యపాలనములు నేర్పునదే విద్య విద్యార్థి నేర్వవలయు".
(శ్రీమా.95.పు.8)
(చూ: మానవజీవితము)