ద్వాపరయుగంలో రాధ. రాధిక అనే ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉండేవారు. రాధ నిర్గుణోపాసకురాలు, రాధిక సగుణోపాసకురాలు. రాధిక ఒక్క కృష్ణుణ్ణి తప్ప మరి దేనినీ ఆశించేది కాదు. మధురకు పోయిన కృష్ణుడు తిరిగి రాలేదని ఆమె అన్నపానాదులను త్యజించి కన్నీరు కార్చుతూ ఉండేది. చివరికి ఆమె "కృష్ణా! నీ రూపమనే కమలాన్ని ఇంత కాలము నా హృదయంలో పెట్టుకుని దానిని కన్నీటి ధారలతో కాపాడుతున్నాను. ఇప్పుడు నా దేహం శుష్కించిపోయింది? నా కంటిలో నీరు కూడా ఇంకి పోయింది. ఇంక, నీ రూపాన్ని నా హృదయంలో ఏరీతిగా కాపాడుకోగలను? కనుక, ఏ హృదయాన్ని నీవు నాకు ఇచ్చావో దానిని తిరిగి నీకే అర్పితం చేస్తున్నాము",
"ఏ హృదయంబు నొసగితివా ఈశ నాకు
మగిడి దానినే అర్పింతు మహిత మూర్తి
పరగ వేరేది తెత్తు నీ పాదార్చనకును
అంజలి ఘటింతు అందుకోవయ్య నీవు"
అని తనను తానే ఇచ్చుకుంది. కృష్ణునకు. అంతకు పూర్వం రాధ సగుణోపాసనకంటే నిర్గుణోపాసనయే చాల గొప్పది అనుకునేది. కానీ, రాధిక కృష్ణునికి అర్పితమైన తరువాత నిర్గుణోపావనకంటే సగుణోపాసనయే చాల శ్రేష్టమని నిర్ణయించుకుంది.తాను కూడా కృష్ణుని రూపాన్ని హృదయంలో నిల్చుకుని నిరంతరం కృష్ణవింతన చేస్తూ వచ్చింది. తులసీదాసు భగవంతుని సర్వాంగములనూ కమలములతో పోల్చుతూ "నవ కంజలోచన, కంజ ముఖకర కంజ పద.." అని వర్ణించాడు. అలాంటి పరమ భక్తులు ఆనాడు లోకంలో ఎంతో మంది ఉండేవారు. కానీ, ఈ కలియుగంలో పార్ట్-టైం భక్తి పెరిగిపోయింది. ఈనాటి భక్తులకు దైవమందిరాన్ని చూసినప్పుడు మాత్రమే దైవం జ్ఞాపకం వస్తాడు. కృష్ణ మందిరాన్ని చూస్తే కృష్ణా! కృష్ణా! అని లెంపలేసుకుంటారు. ఆ తరువాత కృష్ణుణ్ణి మర్చిపోయి లౌకిక విషయాలలో మునిగిపోతారు.ఇలాంటివారు పేరుకు మాత్రమే భక్తులుగాని, పెన్నిధి భక్తులు కారు.
(స.సా.ఆ.99పు,258/259)