ప్రాచీన కాలము మండి హైందవ సంప్రదాయము ‘ లోకాస్సమస్తాస్సుఖినోభవంతు". అందరు సుఖముగా ఉండాలి అనేది భారతీయుల సంప్రదాయము. తన ఆధ్యాత్మిక సంపత్తి వల్ల అన్ని దేశములకు సుస్థిర మైన శాంతి భద్రతలు చేకూర్చుతూ వచ్చింది భారతదేశము.
(బృత్ర.పు.7)
ఒక వ్యక్తి తాను ప్రేమించి జీవించే సంస్కృతిని ప్రతిబింబించే విధంగా వ్యక్తిత్వాన్ని ఏర్పరుచుకున్నాక మధ్యలో ఏదో చిన్న చాపల్యంతో ఆ సంప్రదాయాన్ని మార్చటం మంచి పద్ధతి కాదు.
(శ్రీ .ఎ.ప్ర.పు.244)
వేదమునకు రెండు విధములైన సంప్రదాయము లుంటున్నాయి. ఒకటి బ్రహ్మసం ప్రదాయము. రెండవది ఆదిత్యసంప్రదాయము. యాజ్ఞవల్క్యుడు సమనము చేసినదానికి బ్రహ్మసంప్రదాయమని పేరొచ్చింది. దీనినే కృష్ణ యజుర్వేదము అన్నారు. తదుపరి యాజ్ఞవల్క్యుడు తన దోషాన్ని తాను గుర్తించి గురువు ఆజ్ఞను ఉల్లంఘించిన తప్పుచేత ఆహారపానీయములు మాని కఠినమైన సూర్యోపాసన సలుపుతూ వచ్చాడు. పశ్చాత్తాపమే ప్రాయశ్చిత్తము అని ఈ విధమైన ప్రాయశ్చిత్తాన్ని అనుభవిస్తూ వచ్చాడు. తరువాత సూర్యుడు ప్రత్యక్షమై వాజి రూపమును ధరించి నాయనా! గడచినది గడచినది. తిరిగి ఇట్టి దోషమును నీవు ఆచరించరాదు. గురు ద్రోహము దైవ ద్రోహము మహా ప్రమాదము. నీవు జాగ్రత్తగా ఉండుమని తిరిగి వేదములను సూర్యుడే ఉపదేశించాడు. వాటిరూపములో సూర్యుడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? యాజ్ఞవల్క్యుని పూర్వీకులు నిరంతరము అన్నదానము సలిపేవారు. కనుక ఆ కుటుంబమునకు వాజసం అని పేరు వచ్చింది. వాజసమనే పేరు రావటంచేతనే వాటి స్వరూపాన్ని ధరించి ఇతనికి వేదోపదేశం చేశాడు. దీనికే శుక్లయుజుర్వేదమని పేరు వచ్చింది. వాజసస్కంధము అని మరొక పేరు వచ్చింది.
ఆదిత్య ఖండమని ఇంకొక పేరు వచ్చింది. సూర్యో పాసనచేత లభ్యమైనది కనుకనే దీనికి ఆదిత్య స్కంధము అని వాజసరూపములో ప్రత్యక్షమై బోధించటంచేత ఇది వాజసస్కంధమని, ఈ విధంగా ఒక్కొక్క విధమైన రూపమును ధరిస్తూ వచ్చింది. యజుర్వేదము రెండుగా విభజింపబడినది. వేదములు నాలుగైనప్పటికిని యజుర్వేదము విభజించటంచేత ఐదుగా రూపొందుతూ వచ్చాయి. ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వణ వేదములు. యజుర్వేదములో కృష్ణయజుర్వేదము శుక్లయజుర్వేదమని రెండుగా విభజించటంచేత ఐదు వేదములుగా రూపొందినాయి.
(బృ. త్ర. పు.184/185)