మానవుడు సర్వశ్రేష్టమైన దైవత్వాన్ని పొందుటయే ఉత్తమ మార్గం. అట్టి దైవత్వాన్ని పొందుటకు సాధ్యం కానప్పుడు, కనీసం మానవత్వాన్నైనా అభివృద్ధి పరచుకొని, జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. అంతేగాని, మానవుడు దానవుడుగా లేక పశువుగా మారుట ధర్మ విరుద్ధం. ఈనాడు ఇట్టి ధర్మ విరుద్ధమైన చర్యలు జగుత్తనందు వ్యాపించి ఉండుట చేత మానవత్వమే మరుగున పడిపోతున్నది. నీతి నిజాయితీలు, సంఘమర్యాదలు శూన్యమైపోయినవి. మానవుడు సంఘము" అనే పదాన్ని సరిగా అర్థము చేసికొనలేక, జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు. కేవలం మనుష్యుల యొక్క చేరికయే సంఘము" అని భావిస్తున్నాడు. కాదు. కాదు. అనేకత్వములో ఉన్న ఏకత్వాన్ని గుర్తింపజేయునదే సంఘము. అందరూ కలసి ఏకకాలంలో ఏక కర్మము ఆచరించి ఆకర్మఫలితాన్ని ఏకాత్మభావంతో అనుభవించాలి. ఇదే సంఘము యొక్క ప్రధానమైన ధర్మం. నిజమైన సుఖాన్ని సంఘము ద్వారానే అనుభవించడానికి సాధ్యమౌతుందనే సత్యాన్ని మానవుడు గుర్తించాలి. ఇదే సంఘం యొక్క అంతరార్థం. అనగా మానవుని సుఖ - సంతోషాలన్నీ సమాజము పైననే ఆధారపడి ఉంటాయి. సంఘమే లేకుండిన మానవుడే లేడు.
(స.సా.న.1991 పు.299)