సంకీర్తన

ఎప్పటికప్పుడే! నశ్వర శరీరములకు, ప్రతిక్షణము అంత్యమే! అట్టి అంత్య సమయమున ఏమి స్మరింతురో, అదియే తదుపరి పరిస్థితులకు అనుకూలమగును. అనగా పునర్జన్మకు పునాది. అట్టి సమయమున నన్ను స్మరించినవాడు నా భావాన్ని పొందును. అనగా నన్నే చేరును.

నాస్తి నాస్తి మహాభాగ

కలికాల సమయుగం

స్మరణాత్ ఉచ్చరణాత్తేవ

ప్రాప్నోతి పరమాం గతి:

అన్నట్లు ఇప్పుడు నామ సంకీర్తన చెయ్యకపోతే ఇంకెప్పుడు మనము చేసేది? నీ యొక్క హృదయాన్ని అనుసరించు.

(శ్రీ భ ఉపు.33)

 

"సమ్యక్ కీర్తనం ఇతి సంకీర్తనం". కీర్తనమునకు, సంకీర్తనమునకు ఎంతయో వ్యత్యాసం ఉన్నది. కీర్తనకేవలం వ్యక్తిగతమైనది. వ్యక్తి గతమైన కళ్యాణము నందించువదే కీర్తన.అయితే సంకీర్తన అనేది యావద్విశ్వానికే కళ్యాణము చేకూర్చునది. దీనికి - "సామూహికభజన" అని మరొక పేరు. అందరూ కలసి ఏకత్వముగా ఏక కంఠముతో ఉచ్చరించే భజనకు - "సంకీర్తన" అని పేరు. దీనిని గురునానక్ మొట్టమొదట ప్రారంభించాడు. ఇది అనేకత్వములోని ఏకత్వమును గుర్తింపజేస్తుంది. ఈ సంకీర్తన అనేది నాలుగు విధములుగా ఉంటున్నది. 1. గుణసంకీర్త. 2. లీలాసంకీర్తన. 3. భావ సంకీర్తన. 4. నామసంకీర్తన.

 

 

మొదటిది గుణసంకీర్తన. భగవంతుని కళ్యాణగుణములను వర్ణిస్తూ తాదాత్మ్యం పొంది, అట్టి సద్గుణములను అభివృద్ధి పరచుకొనుటకు కృషి చేయడమే గుణ సంకీర్తనము. ఈ గుణసంకీర్తనము గావించిన వారిలో త్యాగరాజు ఒకడు.

 

“వాచామగోచరుడవగు రామా! నీ చరితమున్ పొగడ బ్రహ్మాదులకు తరమా! కాచుకొన్నాను నీదు కృపకై, నా మొరాలకించి, నన్ను బ్రోవుమయ్యా " అన్నాడు త్యాగరాజు, "యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ" అన్నట్లుగా, వాక్కునకు అలవికాని గుణములు శ్రీరామచంద్రునిలో ఉన్నవని త్యాగరాజ కీర్తించాడు.

 

రెండవది లీలాసంకీర్తనము. భగవంతుని లీలాతరంగము లను నృత్యరూపకముగా ఆడుకొంటూ, ఆ పవిత్రమైన లీలలను అనుభవిస్తూ వాటియందే లీనమై సంకీర్తనమొనర్చుటను - లీలాసంకీర్తనం అంటారు. భక్తజయ దేవుడు ఈ లీలా సంకీర్తనను సల్పినాడు.

జయదేవుడు కేవలం భగవల్లీలలను మాత్రమే చింతిస్తూ, భగవంతుడు తన యందే ఉన్నట్లుగా విశ్వసించి తన నిత్యజీవితంలో ఆటలు, పాటలు, మాటలు అన్నింటిని భగవంతునిలో అనుభవిస్తూ, భగవత్ప్రేమను తప్పఅన్య ప్రేమలను కోరక తాను ప్రేమ స్వరూపుడుగా మారాడు. కాని, జయదేవుని కీర్తనలను కొందరు సరిగా అర్థము చేసుకొనలేక అనర్థములతో దీనిని వ్యర్థము గావిస్తూ వచ్చారు.

 

మూడవది భావసంకీర్తన. రాధ, మీరాలు భావసంకీర్తన గావించిన వారిలో ముఖ్యులు.రాధ భగవంతుని యొక్కభావము నందు తాను లీనమై భగవతత్త్వము నందు తన తత్త్యమును లీనము చేసుకొన్నది. శాంతభావము, సఖ్యభావము, వాత్సల్యభావము, అనురాగభావము, మధురభావము - ఈ ఐదు భావములందు రాధ తన యొక్క జీవితాన్ని అనుభవిస్తూ వచ్చింది.

 

ఇంక నాలపది నామసంకీర్తన. చైతన్యుడు నామసంకీర్తన సల్పుతూ వచ్చాడు. “భగవంతుడా! సర్వనామములు నీ వే. నీ నామంగాని నీ రూపం గాని లేని ప్రదేశము ఈ విశ్వమందు కానరాదు. ఈ జగత్తు లోని సౌందర్య మంతయు నీ రూప నామములే" అని ప్రతి అణువును, ప్రతికణమును భగవత్ స్వరూపంగా భావించి, - నామముచే తరించినవాడు చైతన్యుడు.

 

ఈ విధముగా ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని అనుసరించగా ఈనాడు అదృష్టవశాత్తు ప్రశాంతి నిలయ వాసులకు ఈ నాల్గింటిని అనుభవించే అవకాశం దొరికింది. నాలుగు సంకీర్తనల సమ్మిళిత స్వరూపమే - మన భజన. ఇవేగాక మరొక విశిష్టమైన విలక్షణమైన మార్గమొకటున్నది. అదే - "నామలిఖితము" అనగా భగవన్నామమును మనస్సునందు తలంచుతూ, మాటలతో స్మరించుతూ, చేతితో వ్రాయడము. ఇది త్రికరణ శుద్ధికి మార్గం."మనస్స్యేకం, వచస్స్యేకం, కర్మణ్యేకం మహాత్మనాం" కనుక, ఇది మహత్తరమైనది. హనుమంతుడు శ్రీరామచంద్రుని వార్తను సీతకు తెలిపి, లంకలో తన కార్యమును పూర్తిగావించుకొని తిరిగి శ్రీరామచంద్రుని వద్దకేగే సందర్భములో - "తల్లీ! నన్ను ఆశీర్వదించు " అని సీతను ప్రార్థించాడు. అప్పుడు సీతాదేవి, "హనుమంతా! శాంతుడవు, గుణవంతుడవు, బలవంతుడవైన నీవు అజరుడవై వర్థిల్లెదవు" అని ఆశీర్వదించింది. కాని, హనుమంతునికి ఆనందం కలుగలేదు. అతని యొక్క అసంతృప్తిని గుర్తించిన సీత. “నాయనా! నీవు అమృతుడవై జీవింతువు!" అన్నది.అయినప్పటికీ హనుంతుని ముఖమునందుఆనందముకనిపించలేదు. తదుపరి, “హమమంతా! నీ గుణగణము లను ముల్లోకవాసులు కీర్తించెదరు గాక!" అని పల్కినది. ఆ మాటలు విని మరింత సిగ్గుపడుతున్నట్లుగా హనుమంతుడు తలవంచుకొన్నాడు. హనుమంతుని మనస్సును గుర్తించిన సీత చివరకు, "రాముడు నిన్ను నిరంతరం ప్రేమించుగాక" అని అన్నది. ఆ మాటలు విన్న వెంటనే హనుమంతుడు గంతులు వేశాడు. తాను కోరినది కూడా అదే. దైవ ప్రేమకు నోచుకోని జీవితము సజీవసమాధిలో సమానమని హమమంతుడు విశ్వసించాడు. కనుకనే, శ్రీరాముని ప్రేమ తనకు కావాలని ప్రార్థించాడు. హమమంతుడు గొప్ప సంగీత విద్వాంసుడు. నిరంతరం రామనామమును విచ్చలవిడిగా గానము చేసేవాడు. సంగీతము ద్వారా భగవత్ప్రేమకు పాత్రులు కావాలి. అదే సంగీతము యొక్క సారం. తన భక్తిని, భావమును, నాదమును శృతి లయ తాళములతో చేర్చి భగవంతుని యందు లీనము కావాలి. భావము నెరిగి, భక్తిని కూర్చి ప్రేమను చేర్చి పవిత్రమైన పలుకులచే పరమాత్ముని ప్రేమిస్తూ వర్ణించడమే గానము. పదములకు అర్థం తెలియకుండా, భావాన్ని చేర్చకుండా, ప్రేమను అందులో ప్రవేశ పెట్టకుండా గానము చేస్తే - అది కేవలము టేపురికార్డు నుండి వచ్చే గానము వంటిది. ప్రతి విషయము నందు భావరాగ తాళ సమ్మిళితమును మీరు అనుభవించాలి. భావము, రాగము, తాళము అనే మూడు పదాలలోని మొదటి మూడు అక్షరముల చేరిక చేతనే "భారత అనే పేరు వచ్చినది.

 

నిత్యజీవితంలో నీవు ఆచరించే ప్రతి కార్యము నందు ఈ మూడింటి సమ్మేళనం అత్యవసరం. దీనికి ఒక ఉదాహరణ: ఒక ఆధ్యాపకుడు చేసే పనిలో ఈ భావరాగతాళముల చేరిక ఉంటున్నది. తాను బోధించే సబ్జెక్టును ప్రేమించడమే - రాగము, ఆ సబ్జెక్టును తాను సరిగా అర్థము చేసుకోవడమే - భావము, ఆ సబ్జెక్టును విద్యార్థులకు తగిన రీతిలో బోధించడమే తాళము. ఈ మూడు తగిన రీతిలోచేరితేనే ఆ అధ్యాపకుడు బోధించగలడు. మనం చేసే వంటలో కూడా ఉప్పుకు తగిన పప్పు - పప్పుకు తగిన ఉప్పు, వంటకు తగిన మంట. మంటకు తగిన వంట అవసరము. పప్పు చారెడు, ఉప్పు దోసెడు వేస్తే వంటకం పాడై పోతుంది. అదేవిధంగా, దేనికి తగినట్లు దానిని హద్దులో ఉంచుకొని, తగిన రీతిలో అనుభవించడమే భావ రాగ తాళ సమ్మిళితము యొక్క అంతరార్థం.

 

మనము ప్రతి విషయమును మొట్టమొదట సరిగా అర్థం చేసుకోవాలి. త్యాగరాజు కీర్తనలను సరిగా అర్థం చేసికొనలేక వ్యర్థం చేసినవారు లేకపోలేదు. త్యాగరాజు తెలుగులో కీర్తనలను పాడాడు. అందుచేత, ఆ కీర్తనల భావమును తెలుగువారు బాగా తెలుసుకొన్నారు. అయితే, రాగతాళములలో తమిళ వాళ్ళకు బాగా ప్రవేశం ఉంది. కేవలం కీర్తనల అర్థం తెలుసుకొన్నవారు - తెలుగువారు, ఆ కీర్తనలను రాగతాళములలో పాడేవారు తమిళ వారు. రాగ తాళములను గూర్చి తెలుగువారికి బాగా తెలియదు, కీర్తనలలోని పదముల అర్థం తమిళ్ వాళ్ళకు సరిగా తెలియదు. కనుక. ఈ ఇద్దరి చేరికలో త్యాగరాజు కీర్తనలు పూర్తిగా నిస్సారముగా మారిపోతున్నాయి. ఒకానొక సమయములో త్యాగరాజ

 

"నే పొగడకుంటే.... నీ కేమి... కొదువ రామా...." అని పాడినాడు.

 

ఈ తమిళ్ వాళ్ళకు గ-కారము, త-కారము, డ-కారముమొదలగు అక్షరముల మధ్యగల వ్యత్యాసము సరిగా తెలియదు. ఒక గొప్పతమిళ్ సంగీత విద్యావంసుడు ఇదే పాటను పాడుతూ –

 

"నే పకోడతింటే....... కేమి ...కొదువ రామా...!"

 

అని అన్నాడు. “పొగడ,పకోడ " ఈ రెండింటి మధ్య ఎంత వ్యత్యాసమున్నదో - చూడండి! కనుకనే పదములు పలికేటప్పుడు భావము అనేది అత్యవసరం. భగవన్నాము సంకీర్తన చేసే సమయంలో భావరాగ తాళాలను చక్కగా గుర్తించాలి. నీకు తెలియనప్పుడు తెలిసినవారినడిగి తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.

 

గానం చేసినప్పుడు భగవన్నామములో ఉండిన మాధుర్యం మన హృదయాన్ని మరింత ఆకర్షిస్తుంది. అనేక మంది పండితులు శ్లోకాలు వల్లిస్తుంటారు. కానీ, వారికే ఆ శ్లోకాల భావము తెలియనందున శ్లోకాన్ని నివారించు కోలేరు. మరి కొంతమంది గంభీరమైన పదములను ఉపయోగపెడుతూ మాట్లాడుతుంటారు. అవి కూడా హృదయాన్ని ఏమాత్రం ఆకర్షించలేవు. కానీ, హృదయం గానము యొక్క రసాన్ని చక్కగా అనుభవిస్తుంది. ఆస్తికులు, నాస్తికులు కూడా గానాన్ని ఆనందంగా ఆలకిస్తూ తమకు తెలియకుండానే తలలూపుతుంటారు. గానములో ఇంత మాధుర్యము నిండి ఉంటున్నది. కనుక, మీయంతట మీరు పాడలేక పోయినప్పటికీ, పాడేవారిని అనుసరిస్తూ పాడుట మంచిది.

 

కాని, సంకీర్తన జరిగే సమయంలో కొంతమంది నోర్లు ఏమాత్రము కదలవు. కొందరు "మా లోపల మేము పాడుకుంటున్నాము అని అంటారు. అది సరియైన తృప్తిని ఇవ్వదు. "వంటగదిలో అనేక రుచిరకరమైన పదార్థము లున్నాయి" అని మనస్సులో అనుకొన్నంత మాత్రమున నోటికి పని పెట్టనిచో నీ పొట్టలోనికి అవి చేరవుకదా! - సంకీర్తన జరిగేటప్పుడు చక్కగా గొంతు విప్పి ఎంతవరకు వీలైతే అంత గట్టిగా భగవన్నామమును ఉచ్చరించాలి. అట్టి సంకీర్తనయే భగవంతుని హృదయాన్ని కరిగిస్తుంది. అప్పుడే అతడు వచ్చి నిన్ను రక్షించగలడు. భావిలో పడిన వాడు, "నేను భావిలో పడ్డాను" అని మెల్లగా అంటే అతనిని ఎవ్వరూ రక్షించరు. కాని, అతడు గొంతువిప్పి "అయ్యో! నేను భావిలో పడ్డాను" అని గట్టిగా అరచినప్పుడే ఎవరైనా వచ్చి రక్షిస్తారు. అనగా తన యొక్క అభిమాన అహంకారములను పూర్తిగా త్యజించి కీర్తనను హృదయ పూర్వకంగా విచ్చలవిడిగా పాడాలి.

 

“నోరును ఇచ్చినదెందుకో తెలుసా?ముద్దలు నోటికి అందించుటకా? కాదు. కాదు. భగవన్నామస్మరణ చేయుటకు. చేతుల నిచ్చిన దెందుకో తెలుసా? పిచ్చిపనులు చేయుటకా? కాదు. కాదు. భగవదర్శనచేయుటకు, పాదముల నిచ్చిన దెందుకో తెలుసా? సందులు గొందులు తిరుగుటకా? కాదు. కాదు. దేవాలయములను చుట్టుటకు. చెవులనిచ్చిన దెందుకో తెలుసా? ఊరివారి సుద్దుల నందించుటకా? కాదు, కాదు. భగవన్నామము నాలకించుటకు, కన్నుల నిచ్చిన దెందుకో తెలుసా? రోజుకు మూడు సినిమాలు చూచుటకా? కాదు. కాదు. భగవంతుని రూపాన్ని దర్శించుటకు. "కనుక, ఇంద్రియాలను మనస్సును పవిత్రం గావించుకొని, చిత్తశుద్ధితో భగవంతుని చింతించాలి.

 

నీవు ఎంత భక్తి శ్రద్ధలతో స్మరింతువో దానికి తగిన ఆనందాన్ని పొందుతావు. భగవంతుని నీవు ఎంత భావముతో చింతిస్తావో, అంత భావసిద్ధి నీకు కలుగు తుంది. ఎట్టి పొగనో - అట్టి మేఘము తయారౌతుంది, ఎట్టి మేఘమో - అట్టి వర్షము కురుస్తుంది. ఎట్టి వర్షమో - అట్టి పంట పండుతుంది. ఎట్టి పంటనో - అట్టి పంటను మనం భుజిస్తాము.

ఎట్టి ఆహారం భజిస్తామో అట్టి జీవితమును అనుభవించ వలసి వస్తుందని ఋజువు చేయడానికి రష్యాలో, ఆమెరికాలో అనేక పరిశోధనలు చేస్తూ వచ్చారు. ఒక డాక్టరు ఒక స్త్రీ గర్భములోని శిశువునకు ఇంజక్షను ద్వారానిత్యము ఒక ఔన్సు యాపిల్ జ్యూస్ ఇస్తూ వచ్చాడు. ఆ పిల్లవాడు పుట్టిన తరువాత యాపిల్ పండు లంటే చాలా ఇష్టపడేవాడు. అనగా, గర్భములో ఉండినప్పుడు ఎలాంటి భావములను, ఎలాంటి పదార్థములను  శిశువు అనుభవిస్తుందో, తాము పుట్టిన తరువాత కూడ వాటినే అనుభవిస్తుంది.ఈనాటి మానవులు తమ నిత్యజీవితములో వీడియోలు, సినిమాలు అధికంగా చూడటంచేత వారికి పుట్టే బిడ్డలు కూడా "సినిమా బిడ్డలు" గానే తయారౌతున్నారు. ఇది తల్లి దండ్రుల దోషమే.

 

ఈనాడు ప్రపంచంలో పంచభూతములను పవిత్రం గావించాలంటే, ఒక్క భగవన్నామ సంకీర్తనయే ఆధారము. మనము చేసే శబ్దములన్నీ గాలిలోని విద్యుత్తరంగములలో కలసిపోయి, ఒక స్థాయికి చేరుకొన్న తరువాత అవి శాశ్వతంగా నిలచి పోతాయి. ఈనాడు ఢిల్లీ రేడియో స్టేషన్లో ఏదైనా కార్యక్రమము జరిగితే, సరిగ్గా అదే సమయానికి మనం ప్రశాంతి నిలయంలో వాటిని వినగలుగుతున్నాము. అనగా, శబ్దములు గాలి లోని విద్యుత్ తరంగములలో చేరిపోయి, క్రమక్రమేణా సర్వత్రా వ్యాపించిపోతున్నాయి. శబ్దములో ఇంతటి మహత్తర మైన శక్తి ఉన్నది. కనుక, మనం చేసే శబ్ధమంతయు విద్యుత్ తరంగములలో లీనమైపోగలదు.ఈనాడు అనేక దుశ్శబ్దముల చేత గాలి కలుషితమై పోయింది. కనుక, ఇట్టి బాహ్య సంబంధమైన గాలిని పరిశుద్ధ పరచాలనుకొంటే భగవన్నామ సంకీర్తన గావించాలి.

 

ఈ భగవన్నామ సంకీర్తనలో పంచభూతాలను పవిత్రం గావించే శక్తి సామర్థ్యాలు ఇమిడి ఉంటున్నది. ఈనాడు గంగను పరిశుద్ధం చేయడానికి ఎన్నో కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నారు. కాని, పరిశుద్ధం చేసే విధానాన్నిమొదట గుర్తించాలి. తల పైన నీరు పోస్తూ కాళ్ళను టర్కీటవలుతో తుడుస్తుంటే ప్రయోజనమేమిటి?ఒక వైపు గంగాజలమును పరిశుద్ధం చేసే ప్రయత్నం చేస్తూ, పట్టణాల నుండి వస్తున్న డ్రైనేజి నీరంతటిని గంగలో కలుపుతుంటే, ఇంక గంగ ఏవిధంగా పరిశుద్ధం కాగలదు! మొట్టమొదట దాని పవిత్రతను నిలబెట్టాలి.

 

ప్రేమస్వరూపులారా! సంకీర్తన చాలా పవిత్రమైన మార్గము. మనకు రాగం తెలియకపోయినప్పటికీ ఇష్టముతో, ప్రేమతో ఆ నామాన్ని స్మరించాలి. రాగము అనగా ఇష్టము అని మరొక అర్ధము. భగవన్నామ స్మరణ అత్యవసరం. ఈ కలియుగంలో నామసంకీర్తనకు మించిన మరొక మార్గము లేదు. కృతయుగమున ధ్యానం, త్రేతాయుగమున యజ్ఞం ద్వాపరయుగమున అర్చనం, కలియుగమున నామస్మరణం - అని ఈ విధముగా ఆయా యుగ పరిస్థితులకు అనుగుణ్యంగా వివిధ మార్గాలు నిర్దేశింప బడినాయి.

 

భజన చేసే సమయములో ప్రతి వ్యక్తి కూడా గొంతెత్తిపాడాలి. అట్లు పాడనివాని నాలుక కేవలం కప్ప నాలుక వంటిది మాత్రమే. కప్ప తన నోరు తెరచి అరుస్తుంటుంది గాని, ఏమి ప్రయోజనం? నాలుక ఇచ్చినది నామస్మరణ చేయుట కోసమే. కనుక, ప్రతి ఒక్కరు నామమును తగిన శ్రద్ధా భక్తులతో గానము చేసి తద్వారా ఆనందాన్ని అనుభవించి, గాలిని పవిత్ర పరచి దేశానికి ఉపకారము చేయుటకు ప్రయత్నించాలి.

(స.పా.ఏ.92పు.67/71)

 

సంకీర్తన మనగా భగవంతుని లెస్సగా కీర్తించడం, భగవంతుని కీర్తిని ప్రకటించడం. కీర్తనం సాధకుని పవిత్రంగావిస్తుంది. విష్ణు కీర్తన విశ్వాన్నే తరింపజేస్తుంది. కీర్తన వ్యక్తిగతమైన భగవత్ప్రార్ధన. సంకీర్తన విశ్వశ్రేయస్సును కోరి చేసే సమిష్టి ప్రార్థన, సంకీర్తన నాలుగు విధములుమొదటిది గుణ సంకీర్తన. రెండవది లీలాసంకీర్తన, మూడవది భావ సంకీర్తన.నాలుగవది నామ సంకీర్తన, గుణ సంకీర్తనం భగవంతుని కళ్యాణ గుణములను హృదయంలో చింతించి, స్మరించి, తమను తరింప చేసుకోవడానికి తగిన మార్గము. ఈ గుణ సంకీర్తనంలో భక్తుడు నిర్గుణ, నిరంజనమైన దైవత్వానికి, తన ప్రేమ చేత కొన్ని గుణములు కల్పించి, ఆ గుణములను స్మరిస్తూ సంతృప్తి పొందుతాడు. భగవంతుడు దయ, ప్రేమ, కరుణా స్వరూపుడైనప్పటికీ తనకు నిర్దయ, నిర్దాక్షిణ్యము, అగ్రహము ఉన్నట్లు భావించి ఆ భావాలను ఆధారం చేసుకొని చింతిస్తాడు. ఈ భావములు తన దోషముల ప్రతిబింబములని భావించక దైవ స్వభావము లనే అనుకొంటాడు. దైవము అవాఙ్మాన సగోచరుడని గుర్తించక వాక్కునకు, మనసునకు ఆధీనమైనటువంటి వాడని భావిస్తాడు. అనేక మంది భక్తులు ఈ మాయకులోబడే కీర్తనలు సలుపుతుంటారు.

 

ఒకానొక సమయంలో తాను దైవాను గ్రహానికి దూరమైనట్లుభావించి పరితపిస్తాడు త్యాగరాజు:

వాచా మగోచరుండని                  || వా||

నీ చరితము బొగడగ బ్రహ్మాదులకైన తరమా

కాచుకున్నాను నీదు కృపకై నా మొరాలకించి బ్రోవుమయ్య   || వా||

కాలుడు గొనిపోయిన గురు పుత్రుని దెచ్చి యిచ్చినావు కంసుని మదమణచినావు

వసుదేవ దేవకీ దేవుల చెరను విడిపించినావు

వాలుగంటి యైన ఆ ద్రౌపది హా కృష్ణా యని మొరలిడబ్రోచినావు

మేలు మేలు పాండవులను గాచినావు

కుచేలుని ఆర్తి తీర్చినావు

కురూపి వక్రమును బోగొట్టినావు

పదహారు వేల రమామణులను బ్రోచినావు

ఇవన్నియు గుణ సంకీర్తనములు. ఈ గుణ సంకీర్తనలు సాధకుని భ్రమలపై ఆధారపడి ఉంటాయి.

ఇక లీలా సంకీర్తనము: సృష్టియంతయు లీలా మయము. ఇలాంటి సృష్టి కర్త లీలాతత్వానికి కొన్ని అదుపులు విధించి, కొన్ని హద్దులు నియమించి గానం చేయడం లీలా సంకీర్తనం. అంతా భగవంతుని లీల అని గుర్తుంచుకోలేక, తన అనుభూతులను మాత్రమే దృష్టియందుంచుకొని, ఇవి భగవంతుని లీలలు అని భ్రమిస్తాడు భక్తుడు. త్యాగరాజుకూడా:

ఏలా నీ దయ రాదూ

పరాకూ జేసేవేలా సమయమూ కాదూ

బాల కనకమయ చేల సుజన పరిపాల

జలధి గంభీర దనుజ సంహార దశరథ కుమార

సకల శ్రుతి సార నాదుపై                                    !ఏలా!

మానవుడు తన భక్తి ప్రపత్తులను కొంత నియమములో నుంచుకొని తద్వారా భగవంతుని కూడా తన హద్దులలో ఇముడ్చు కొంటాడు. లీలలు కూడా, కేవలము భ్రాంతులు కాదు. ఊహలు, భగవంతుని శక్తి సామర్థ్యములు కన్నియును లీలా మయములే, ఏమి చేసినా, ఏమి చూచినా, ఏది విన్నా, ఏది భావించినా అన్ని భగవంతుని లీలాగుణగణ విశేషములే. సృష్టియందు మంచి చెడ్డ అనే తారతమ్యము లుండవచ్చును. భగవంతుని దృష్టిలో

 

మంచి చెడ్డ అనేవి లేవు.

ఒకటి చెడ్డ యనుచు

ఒకటి మంచి యనుచు

సృష్టియందు నిర్ణయింప నగునే

అదియు నిదియు ఒక్క ఈశ్వరుండె జేసె

భేద మెండు కలదు భక్తులారా!

 

నీవు ప్రకృతి వాతావరణమునకు బానిసవు కనుక, కొన్ని పరిమితులు పెట్టుకొని ఉండడం చేత, ఇది మంచి ఇది చెడ్డ అని నీ ఊహ మాత్రమే విభాజనము జరుపుతున్నది. - పరిమితులు మాత్రమే ఈ మంచి చెడ్డలకు మూల కారణము. ఈ భావములు. లీలలు, గుణములు అన్నియును సంకల్ప వికల్పముల స్వభావములు.

 

ఇక మూడవది భావసంకీర్తనం: భావములు కొన్ని విధములైన తరంగములతో కూడినవి. వీటిని అధికంగా జయ దేవుడు అనుభవించాడు. కనుకనే జయ దేవుడు గానం చేసిన కీర్తనలకు భావ తరంగములని పేరు పెట్టారు.

ఇవి ఎట్లా ఉంటాయంటే:

కృష్ణా హరే చిన్ని కృష్ణా హరే

ముద్దు కృష్ణా హరే యని పిలిచెదరా!

విష్ణు స్వరూపా సృష్టి నిరూపా

దుష్టసంహార నిన్ రమ్మందురా   |కృ|

కృష్ణా! శత కోటి మార్తాండ తేజడౌ నీ ముద్దు

చేతులకు గొలుసులు కట్టెదరా

ముంగురులు దువ్వి మురళి చేతికి ఇచ్చి

అందమైన మోము చూచెదరా                      |కృ|

జగత్తునకు ఒక అర్థము. వ్యక్తియైన భక్తునకు మరొక అర్థము స్ఫురించే గీతములను జయదేవుడు గానం చేశాడు. ఈ భావసంకీర్తనంలో ఆరు విధములైన స్థాయిలుంటాయి. శాంత భావము, సత్యభావము, దాస్యభావము. వాత్సల్యభావము, అనురాగభావము, మధురభావము,ఈ ఆరూ ఆరు తరంగములవంటివి. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విధమైన మార్గమును అనుసరించి తరించినాడు.

 

భీష్ముడు మహాజ్ఞాని. కేవల జ్ఞాని మాత్రమే కాదు. అన్ని విధముల వేదాంత తత్వసారమును గ్రోలి ఆచరణ యందుంచిన మహా వీరుడు. రాజనీతి, దైవనీతి, జగన్నీతి. శాంతినీతుల యందు పరిపూర్ణుడు. కనుకనే ఎన్ని కష్టములు వచ్చినప్పటికీ దేహము నేను కాదు. దాని కష్ట నష్ట దుఃఖములకు నేనే మాత్రము బాధ్యుడను కాను అన్న దృఢభావంతో ఉన్నాడు. జీవతత్వమును దైవత్వములో ఇముడ్చాలనుకున్నప్పుడు పవిత్రకాలము అవసరమని, 56 దినములు శరతల్పము పైన పరుండి, ఉత్తరాయణ పుణ్యకాలము వచ్చేంత వరకు కృష్ణ నామాన్ని స్మరిస్తూ వచ్చాడు. దీనినే శాంత భక్తి అన్నారు.ఎలాంటి పరిస్థితులలోను కష్టములకు క్రుంగక, సుఖములకు పొంగక సమత్వమును అనుభవించి శాంతంగా దైవత్వాన్ని చింతించడం శాంతభక్తి.

 

ఇంక సఖ్యభక్తి దీనికి దృష్టాంతము అర్జునుడు, కుచేలుడు, అర్జునుడు శ్రీకృష్ణుడు సాక్షాత్ పరమాత్ముడని గుర్తించి కూడా స్నేహమునే అధిక స్థాయి యందు భావించి నిరంతరము బావా బావా అని సంబోధించేవాడు అర్జునుడు. గోపబాలురు కూడనూ ఈ స్నేహభావముచేత నిజమైన ఆనందము ననుభవించారు.

 

తాను భక్తుడనని, భగవంతుడు తన కతీతమైన శక్తి వంతుడని భావించడం చేత భక్తునికి భగవంతునికి సన్నిహిత సంబంధ మేర్పడదు. ఎప్పుడు స్నేహితమధిక మవుతుందో అప్పుడు సర్వ భేదములు కూడనూ దూరమవుతాయి. శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం స్నేహం, ఆత్మనివేదనం- ఈ నవవిధ భక్తి మార్గములలో స్నేహితము నందు ఒక గౌరవము, మర్యాద, పాటించడం ఉండదు. క్రొత్తగా మన ఇంటి కెవరైనా వస్తే దయ చేయండి కూర్చోండి అని చాప, ఛైరు వేసి గౌరవ మర్యాదలతో ఆహ్వానిస్తాము. అదే పాత స్నేహితుడెవరైనా వస్తే ఒరే-రా రా, కూర్చోరా అంటాం. సన్నిహిత సంబంధానికి ఈ గౌరవ వాచకాలు ఉండవు.

 

అట్లే దైవాన్ని కూడా ప్రియమైన స్నేహితునిగా భావించుకున్నప్పుడు మన భావాలన్నీ స్పష్టంగా చెప్పుకోవడానికి ఒక ధైర్యం వస్తుంది. త్యాగరాజు దైవాన్ని తన పాత స్నేహితునిగా భావించుకొని గౌరవ మర్యాదలే మాత్రం పాటించక ఏకత్వంగా పోయాడు. గౌరవ మర్యాద లివ్వడానికి అనేకత్వంగా భిన్నత్వంగా భావించలేదు-భగవంతుని తన ఇంటికి రారా అని పిలుస్తాడు.

 

రారా మా ఇంటి దాకా

రార! మా ఇంటి దాకా

రఘువీర, సుకుమార, నే మ్రొక్కెద |రా|

రారా దశరథ కుమారా నన్నేలుకోరా

నేతాళ లేరా                                     |రా|

చూడండి! రారా, అంటూ ఏ భావాన్నే అనుభవించాడు త్యాగరాజు,

ఎంత వేడుకొందు ఓ రాఘవా

పంత మేలు ఓ రాఘవా

ఎంత వేడుకొందు ఓ రాఘవా

పిలచి, పిలచి విసుగెత్తింది: |

మారు బల్కకున్నా వేమిరా?

రామ! మారుబలక్కకున్నా వేమిరా?

మా మనోరమణ మారు బల్కకున్నా వేమిరా?

జార, చోరా భజన చేసితిరా

సాకేత సదనా మారు బల్కకున్నా వేమిరా?

మా మనోరమణ |మా|

మరికొంత సేపు చూశాడు రామ చంద్రుడు.

నిను నే నెందు వెదకుదురా |ని|

 ఓ రామా |ని|

ఈ విధంగా అనేక మంది భక్తులు భగవంతుని స్నేహ భావం చేత ఏక వచనంగా సంబోధించి ఆరాధనలు సలిపారు.

దాస్య భక్తికి గోపికలను, హనుమంతుని చెప్పుకో వాలి. వీరు నిరంతరం భగవంతుని దాసులుగా ఉండి దైవానుగ్రహాన్ని పొందాలని పరితపించిన వారు.

 

హనుమంతునికి ఏ సమయంలో నైనా పాద సేవ కావాలి. రామునికి తాము దాసుడుగా ఉండాలి. రామాజ్ఞను శిరసావహించాలి. ఎప్పుడూ ఇదే భావన. .

 

గోపికలు మధురకు పోయిన కృష్ణుని రాకకు ఎదురు చూసి, ఎదురు చూసి కట్ట కడపటకు విసుగెత్తి పోయారు.

ఎంత కాలమీ బాధల్ కృష్ణా!

ఎందుకోసమీ గాథల్

న్యాయము లేదా మా తో వాదా

మాపై కరుణయే రాదా

మీ గోపికలు మేమవునా కాదా?

కించ బరచ మరియాదా? |ఎంత|

నిరంతరము భగవంతునితో ఉండాలని ఆశించేది ఈ దాస్యభక్తి,. రాముడు ఆవలిస్తే చిటిక వేసే సేవ కోరుకొని ఇరవై నాలుగు గంటలూ రాముని కనిపెట్టుకొని ఉండే అవకాశాన్ని సంపాదించుకున్నాడు హనుమంతుడు. చిన్న చిన్న సమయాలలో సైతం భగవంతునిలో కలిసి ఉండటానికి అవకాశం కోసం కాచుకొని ఉండే వాడు.

వాత్సల్యభక్తి: ఇది యశోద భావం. గోపికలు కృష్ణుని ఎన్ని విధములుగ వర్ణించినా ఈమె కా వర్ణన గిట్టేది కాదు. గోపాలా! గోపాలా! ఈ గోపాలా అనే పదము తప్ప అన్యపదము లామెకు నచ్చవు. మధురకు పోయిన కృష్ణుని వార్తలు తెలియక యశోద కూడా ఎంతో పరితపించింది. సందేశం తెచ్చిన ఉద్దవుని నా గోపాలుడు బాగున్నాడా ఉద్దవా?" అని అడిగింది. అమ్మా! మునిమానస సంచారి, గోపీలోలుడు, మధురాపురి విహారి- ఆయన కేమి తక్కువ? అని అనేక రకాలుగా వర్ణించాడు ఉద్దవుడు. అప్పుడామె అన్నది: గోపీలోలు డెట్లా ఉన్నాడో నాకవసరం లేదు. నా గోపాలుడే నాకు కావలసింది. యశోద ఇట్లా తన ఒక్క గోపాలుని భావాన్నే తలుస్తూ ఉండిపోయింది. మీరా గిరిధర గోపాలా అంటుంది. గిరిధర గోపాలా అంటేనే ఆమెకు తృప్తి. ఊరక కృష్ణా అన్నా, గోపాలా అన్నా ఆమెకు తృప్తి లేదు. రంగా, రంగా! పాండు రంగా!! అంటేనే సక్కుబాయికి తృప్తిగాని కృష్ణా ఆన్నా గోపాలా అన్నా ఆమెకు తృప్తి లేదు.

 

నీ పదములనే పాడుకోగలనా

పాండురంగా! రంగా! నేరమా అపచారమా

పరాకా! కరుణా సాగరా పల్కులే వినరావా

ఒక్కొక్కరు ఒక్కొక్క పేరునందు ఆభిరుచి పెంపొందించు కొని భగవంతుని పొందటానికి ప్రయత్నిస్తారు. ఈ వాత్సల్య భక్తిలో. అనురాగభక్తిలో కూడా అదే విధముగ భగవంతుని ఒక్కొక్క పేరుతో ఉచ్చరిస్తూ ధ్యానిస్తూ తపిస్తూ ఉంటారు.

తర్వాత మధుర భక్తి

ఈ మధుర భక్తి మాత్రమే ఉత్తమమైన భక్తి, సర్వమూ దైవంగా భావించి దైవం తప్ప అన్యం లేదు అనే స్థితి ఇది. భర్తను కృష్ణుని వలె, తల్లిని కృష్ణునివలె, అత్తను కృష్ణునివలె, సర్వమూ కృష్ణమయంగానే భావిస్తారు.ఈ మధుర భక్తిలో, ఇందులో ఉన్నతస్థాయికి చెందినది ఒక్క రాధ మాత్రమే. మిగితా గోపికలందరూ మధుర భక్తి కలవారే అయినప్పటికీ వారికి కొన్ని హద్దులు అడ్డుగా ఉండేవి. కృష్ణునిలో బృందావనానికి పోతే అత్త చూస్తుందేమోనని, భర్త చూస్తాడేమోనని లోకానికి వెరచి, అభిమానానికి కట్టుబడి ఉండే వారు. అభిమానమును పూర్తిగా త్రెంచుకొని ఎవరేమనుకుంటే నాకేమి? నా దైవముతో నాకవసరము. అనే భావములో సంచరించునది ఒక్క రాధ మాత్రమే. అభిమాన మమకారములు త్యజించి ఎప్పుడు మాత్రమే ఆహంకారం దూరమవుతుంది. అహంకారం దూరమైనప్పుడే ఆత్మతత్వం ప్రకాశిస్తుంది. ఒకనాడు ఒక గోపిక పడకగదిలో పండుకొని ఉంటుంది. కొంత సేపటికి భర్త వచ్చాడు. వచ్చి పడకపై పండుకున్నాడు. చాలా అలసిపోయాను. నేను పరుండాలి అన్నాడు", పడక పైన భర్త పరుండినాడు. భార్య పాద సేవ చేస్తున్నది. కృష్ణుడు వచ్చి తలుపు తట్టాడు. గోపిక పాపం భయపడిపోయింది! భర్త లోపల ఉన్నాడు. కృష్ణుడు తలుపు తడుతున్నాడు: తీయకపోతే ఆతనికేమి కోపమో! ఏం చేసేదని చాలా బాధ పడిపోతున్నది. ఈ పరిస్థితిని చక్కగా గుర్తించిన భర్త కన్నులు మూసుకొని గురకలు పెట్టి నిద్రపోతున్నట్లుగా నటించసాగాడు. మధ్యమధ్య అటూ ఇటూ పారలుతున్నాడు.

 

గోపిక తలుపు దగ్గరకి వెళ్ళి సందులో నుంచి మెల్లిగా చెపుతున్నది కృష్ణునికి

తలుపు తీయునంతలోనె

తత్తర మది ఏల నోయి!కృష్ణా!

తలుపు తీతు కొంత సేపు

తాళుము కృష్ణా

కొంత సేపు ఆగుము కృష్ణా...

పతి నిద్దుర పోవ లేదు

మది సందియ మొందు నేమొ

తాళుము కృష్ణా...

 

కాని కృష్ణుడు మాట వినేవాడు కాడు, తలపు కొడుతూనే ఉన్నాడు. గోపిక తియ్యకపోయినా తెరచుకున్నది తలుపు! భర్త ఉన్నాడే, కృష్ణుడు వచ్చాడే, ఏమవుతుందో ఏమో అని తబ్బబై ఇటు కృష్ణుని వైపు ఆటు భర్త వైపు చూసింది. అక్కడ భర్త లేడు, అసలు భర్త వేషంలో వచ్చింది కూడా కృష్ణుడే, పరీక్షించాలని ఈ విధంగా వచ్చాడు. అభిమాన మమకారములను త్రుంచే నిమిత్తమై పరీక్షలు పెట్టడం, గోపికలు ప్రార్థించడం, కృష్ణుడు వారిని దూరం చేయడం,ఈ విధంగా సంభవిస్తూ వచ్చింది. అనురాగ భక్తిలోమోహ భక్తిలో లేక మధుర భక్తిలో ఉన్న గోపికలకు, గుణ సంకీర్తనలన్నీ భావ సంకీర్తనలే. గుణ సంకీర్తన, లీలా సంకీర్తన, భావ సంకీర్తన భక్తుల భావోద్రేకాల ప్రతిబింబాలు. నామ సంకీర్తన అట్లా కాదు.

 

సహస్రశీర్షా పురుష సహస్రాక్షః సహస్ర పాద్, భగవంతుని నామములు అనేకంగా ఉండటం చేత ఏ నామమైనా భగవంతుని హృదయానికి సూటిగా నాటుకొని పోతుంది. నామమును గానముగా మార్చుకొని పాడినప్పుడు హృదయాన్ని లాగుతుంది. రూపము అనిత్యము, అశాశ్వతము. కాని నామము సత్యము, నిత్యము, తెల్లచొక్కా, తెల్ల ప్యాంటు వేసుకొంటాడు. కళ్ళకు అద్దాలుంటాయి. ఆ అబ్బాయిని చూడాలి. అంటే ఏ అబ్బాయిని చూడగలము. గుర్తులు ఆనవాళ్ళలో మనం ఎవరిని గుర్తుపట్టగలము? పేరు చెప్పితే లక్షమందిలోఉన్నా లేచి వస్తాడు. పేరు సులభంగా చెంతకు లాగుతుంది. భావములు, లీలలు, ఎంత మందికైనా అదే స్థాయిలో ఉండవచ్చును నామము హృదయాన్ని ద్రవింప జేస్తుంది. శోకముతో పిలువవచ్చును. మాటలతో పిలువవచ్చును. రాగం, తాళం, భావంతో పిలిచినప్పుడు హృదయం కరుగుతుంది. భావ రాగ తాళ యుక్తమైన గానము హృదయాన్ని రమింపజేస్తుంది. ఇంకా నీకు దయ రాలేదా ఆంటే అది హృదయానికి సూటిగా నాటదు.రామా నన్ను బ్రోవరా! అని పద్యంగా చెప్తే అది అసలే ఇంపుగా ఉండదు. రామా! నన్ను కాపాడు... అని ఆర్తితో దీనంగా రాగ రాళయుక్తంగా ప్రార్థిస్తే హృదయాన్ని అయస్కాంతం మాదిరిగా ఆకర్షిస్తుంది. శ్రుతి రాగతాళ లయ భావములలో పాడినప్పుడు ప్రార్థన దైవాన్ని సన్నిహితం చేస్తుంది.

 

భగవద్ రతి గలిగిన దేశం భారతదేశం, భా -రతి భగవంతుని రమింప జేసేది. అంతేకాదు. భా-భావ, ర-రాగ, త-తాళ సమ్మిళితమైన దేశం భారత దేశం,కనుక మనం భజన చేసే సమయంలో భావం ప్రధానమైనదని గుర్తుంచుకోవాలి. తాళం తగినట్లుగా ఉండాలి. తాళం సరిగా లేకపోతే తల - నొప్పి వస్తుంది. తాళం సరిగా ఉండి శ్రుతి అపస్వరంగా వస్తే అది కూడా వినడానికి వీలుకాదు. భజన చెప్పేవారుభావ రాగ శ్రుతి లయబద్ధంగా పాడాలి. ప్రతి వ్యక్తి విధిగా నామస్మరణ చేయాలి. పాట తెలియక పోయినా పాడే సమయంలో ఆ నామాన్ని స్మరించుకుంటే నిజంగా మనకు చిత్తశుద్ధి చేకూరుతుంది. విద్యార్థులలో కొందరు ఏమీ పాడకుండా మూతి ముడుచుకొని కూర్చుంటారు. ఇలాంటి ముఖాలు చూస్తే దైవం దూరం వెళ్ళిపోతాడు. భజనలో తన్మయులై పోవాలి. పదములతో తాను కూడా లీనం కావాలి. రాకపోయినా నెమ్మదిగా నైనా పాడాలి. పాడని నాలుక కప్ప నాలుక.

 

కనుకనే నారాయణుడు నారదునికి చెప్తాడు. మద్భక్తాయత్ర గాయంతి, తత్ర తిష్టామి నారద! అని. ఎక్కడ నా భక్తుడు గానం చేస్తుంటాడో అక్కడే నేను ప్రతిష్ఠ అయి ఉంటాను అన్నాడు. నామ సంకీర్తనం చేత దైవాన్ని వశంచేసుకోవాలి. కోరిన కోరికలు తీర్చే కామధేనువైనా మెడకు తలుగు తగిలించి గూటానికి కట్టివేస్తే అక్కడే నిలిచి పోతుంది. భక్తుల అభీష్టములను నెరవేర్చే కామధేనువుదైవం. భక్తి పాశముతో కట్టి నాలుక అనే గూటానికి బిగించి వేస్తే అక్కడే నిలచి పోతాడు. సమ్యక్ కీర్తనం సంకీర్తనం. నాలుగు వందలమంది ఒక్క తూరి పాడితే వాతావరణం మెంత పరిశుభ్రమైపోతుంది.

 

ఈనాడు వాతావరణమంతా చెడ్డ శబ్దాలతో, చెడ్డ మాటలతో నిండిపోయింది. దాన్నే మనం పీల్చు కొంటున్నాం. అందుకే చెడ్డ ఆలోచనలన్నీ మనకు వస్తున్నాయి. పవిత్రమైన నామాన్ని పాడితే అది వాతావరణాన్ని పరిశుద్ధం చేస్తుంది. పవిత్రమైన గాలిని పీల్చుకోవడం వల్ల పవిత్రమైన భావాలే మనకు వస్తాయి.

(స. సా,న..83.పు.273/278)

 

సంకీర్తనలయందు నాలుగు విధములుంటున్నవి. గుణసంకీర్తన, లీలాసంకీర్తన భావసంకీర్తన, నామసంకీర్తన అని ఇవి నాలుగు విధములు. గుణసంకీర్తనమనగా భగవంతుని మంగళకరమైన గుణగణములను మాత్రమే వర్ణించేది. ఆనాటి మహర్షులు, ఆనాటి కవులు అనేక విధములుగా భగవంతుని గుణములను వర్ణిస్తూ వచ్చారు. "వాసుకి శయన శ్రీనివాస చిద్విలాస భవపాశముల ద్రుంచి మనోల్లాస మివ్వరా - భాసుర కళ్యాణ పురువాసుడౌచు శౌష గోపదాసుని జగదీశ హృషీకేశ వేగ - శ్రీ రమారమణీ మనోహరా" ఈ విధంగా ఆ గుణాలను వర్ణిస్తూ వచ్చారు. ఇంక లీలాగుణగణ విశేషములు. సందుగొందులందు మరి అందరందు నీవే ఆనందమొందుచుందవని విందు శ్రీధరా: ఇందువదనా సురేంద్రవందిత పాదారవింద నిత్యవందనంబు నీకు చెసెద - శ్రీరమారమణీమనోహరా . ఇంక భావసం కీర్తన "మేటియౌ త్రికూట పీట సాటియగు.. రాజు పే ట నేలుచున్న కపటనాటకాధార ఆటల పాటల మృదుమాటలచే భోజరాజు మాటికి పిలిచిన పలుకవేటికి శ్రీ వేంకటేశ శ్రీరమా రమణీమనోహరా" ఈ గుణ సంకీర్తనకు, లీలాసంకీర్తనకు, భావసంకీర్తనమునకు అనేకవిధములైన మార్పులు కలుగుతూ వస్తుంటాయి.కాని నామ సంకీర్తనం మాత్రం అన్నిటికంటే ఉత్తమమైనదని నిర్ణయం చేస్తూ వచ్చారు.

(శ్రీ స.వి.వా.పు.71)

(చూ॥ భజన, సంతృప్తి)        


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage