స్వ-అనగా తనయందు, అనగా బ్రహ్మయందు, అప్యయాత్ - అనగా లయమగుట వలన; అని ఈ పదమునకు అర్థము. అంటే ఈ జీవుడు బ్రహ్మమందు లయమగువని చెప్పియుండుటవలన, జీవుడు సుషుప్తి కాలమున సద్రూపుడగుచున్నాడు. తన్ను తాను పొందుట వలన అతడు ఆత్మయే యగుచున్నాడు. స్వప్నరహితమగు సుషుప్తియందు ఆత్మ ఆత్మ యందు లయమగు చుండును. అనగా సత్ లో ఏకమగునని దీని అంతరార్థము. సర్వ వేదాంత వాక్యముల సారము, బ్రహ్మజగత్కారణ మనీ, బ్రహ్మ ఒక్కడే అగుచేత జడమగు పదార్థము లేదని చెప్పబడుచున్నది. జగత్కారణము చేతనమగు బ్రహ్మమని బోధించుట యందు వేదాంత వాక్యము లన్నియు యేకీభవించుచున్నవి. శ్రుతి కూడా బ్రహ్మమే జగత్కారణమని తెలుపుచున్నది.
(సూ.వా.పు.42)
జీవుడు చేతన స్వరూపుడని, అట్టి చేతన స్వరూపుడు, చేతన స్వరూపుడైన పరమాత్మయందే లయమగును కాని: అచేతనమునందు లయము కాజాలడు కనుక, సచ్చబ్దము పరమాత్మకే అన్వయము కాని ప్రకృతికి కాదని, ఈ సూత్రము హెచ్చరించుచున్నది.
(సూ.వాపు 4)