సంకల్పాలన్నింటికి చిత్తమే స్థానము. అవి అన్నియు చిత్త స్వరూపములు, చిత్తమునుండి పుట్టినవి చిత్తమునందు ప్రతిష్ఠితములయినవి. చిత్తము సంకల్పాలకు మూల మగుటచే అనేకశాస్త్రముల నభ్యసించిన విద్వాంసునికి చేతనత్వము పోయినప్పుడు అతడు లేనివానితో సమానమని లోకులు చెప్పుదురు. బ్రహ్మ బుద్ధితో చిత్తము ముపాసించువాడు సౌష్టవము గలవాడగును. చిత్తము సంకల్పము కంటే గొప్పదగుచున్నది. మనస్సుమొదలగునవి సంకల్పమునందున్నవి. సంకల్పమే వాని స్వరూపము. సంకల్పము మానసిక వృత్తిని చిత్తము, సంకల్పమిచ్ఛా కారణము. కర్తవ్యాకర్తవ్యము లను విషయ విభాగముచే సమర్థించుట సంకల్పమన బడును. తరువాత దానిని వాక్కుతో చెప్పును.ఇచ్చయించిన దానిని నామముతో చెప్పగోరును. శబ్దవిశేషములగు మంత్రములు నామమంత్రములై వాని యంతర్భాగము లగుచున్నవి. మంత్రములందు కర్మ లేకములగుచున్నవి. ఆమంత్రమగు కర్మ యుండనేరదు. ధ్యానము చిత్తమునకంటె అధికమయినది. ధ్యాన విషయమగు దేవతాబుద్దిచే శాస్త్ర విహితమగు సాల గ్రామాది కనిష్ట వస్తువులం దితర చిత్తవృత్తులచే చెదరని బుద్ధివృత్తిని నిలుపుట ధ్యానమందురు. దీనినే చితై కాగ్ర్య మనియు వాడుదురు. ధ్యాననిష్టుడగువాడు నిశ్చలుడగు చున్నాడు. ఆదే విధముగా పృథ్వి నిశ్చలముగా నున్నది. ఆ తీరుననే అంతరిక్షము, ద్యులోకము, జలములు, పర్వతములు, దేవతలు, మనుష్యులు నిశ్చలురు శమాది గుణసంపత్తిచే దేవతా సమానులగు మనుష్యులు కూడా ధ్యానము చేయుచున్నటుల నచంచలముగ నున్నారు. విజ్ఞానము ధ్యానముకంటె ఉత్తమమైనది. శాస్త్రార్థము తెలిసికొను జ్ఞానము విజ్ఞానమందురు. అది ధ్యానముచే లభ్యమగుట వలన ధ్యానముకంటె ఉత్తమమని తెలుపబడినది. బలము విజ్ఞానముకంటె నతిశయమగును.అన్నము భుజించుటచేకలిగిన జ్ఞేయములగు విషయములందు మనస్సు ప్రతిభను పొందు సామర్థ్యము బలము. చేయవిషయములందు ప్రసరించువానిని సులభముగా గ్రహించు బుద్ధిసామర్థ్యము ప్రతిభ. ఇది అన్నముచే పోషింపబడుచున్నది. అన్నము బలముకంటె ఆధికము. పది దినములు అన్నము తినకుండినచో అట్టివాడు మరణించును. జీవించక మరణించినచో, గురువు వలన విషయములు గ్రహించి శ్రవణము చేయలేడు. మననము చేయలేడు. దీనికంటె తేజస్సు అధికమయినది. తేజస్సు నుండి జలము, జలము నుండి అన్నము పుట్టును. కాని తేజస్సు రెండింటికీ అధికమైనది. తేజము, వాయువును బంధించి వెచ్చగా చేయును. ఆపు డాకాశమంతయూ వేడిగా నుండును, తేజస్సు ముందుగా వాయుతత్వమై తరువాత జలము మత్పత్తి చేయుచున్నది. తేజస్సే ఉరుము రూపమున వర్షహేతువగును. ఆకాశము లేజస్సు కంటె గొప్పది. శబ్దమాకాశ మూలమున వినబడుచున్నది. ఆకాశమునందే ప్రియవస్తు సంయోగమువలన అన్యోన్య క్రీడ జరుగుచున్నది. ఆకాశమునందే బీజ మంకురించు చున్నది. స్మరణమాకాశమున కంటె గొప్పది. పూర్వమను భూతమయిన దానిని జ్ఞాపకమునకు తెచ్చుకొను అంత:కరణ ధర్మము స్మృతి అనబడును. స్మరణ ఉన్నప్పుడే సర్వము అనుభూయమానమగుచున్నది. అదిలేనపుడు ఆకాశాదీ వస్తువులను గూడా స్మరించుట శక్యముకాదు. అందువలన స్మరణ ఆకాశమునకు కారణమగుచున్నది.
(ఉ.వాపు.62/63)
కదలదు నీదు సంకల్పము లేనిది గడ్డి పోచయైన
అదియు యిదియు అనగనేల? ఏపీలికాది బ్రహ్మ
పర్యంతము నీవే! అది యెరుంగరు భువిని కొందరు
వివేకమున వర్తించెదమని కడు విర్రవీగెదరు కాని,
ఎవరి కే వేళ యేది సంభవించునో
తెలియ జాల రెంతవారలైన :
(బ.పు.104)
నాయనా! నీ జాబందినది. సంశయముల తోడను, ఆవేదనతోడను గర్భితమైన నీ ప్రేమభక్తి ప్రవాహములను గమనించితిని. జ్ఞానులు, యోగులు, సన్యాసులు, భక్తులు, ఋషులు మొదలగువారి స్వభావమును, నడవడుల మర్మమును గ్రహించుటకు సామాన్య జనులకు సాధ్యం కాదు. సామాన్య మనుష్యులు చిత్ర విచిత్ర స్వభావములు కల్గియుండి, తమ ముక్కు సూటిగ, నితరుల మనోభావమును గ్రహింపలేక విమర్శించు చుందురు. అది వారి నైజము. లోకుల నిందాస్తుతులకు చలింపక, తమ ధర్మమునకే తమ నిర్ణయమునకే హత్తుకొను జ్ఞానులుందురు. ఫలముల నొసంగు వృక్షమే రాతి దెబ్బలకు గురి అగుచుండుట లోకవిదితమే కదా! అధర్మము ధర్మమునకు అడ్డు తగులును. ధర్మము అధర్మమును నశింపజేయును. ఈయదియే లోకములో పోకడ. ఇట్టి వైపరీత్యములు కలుగనిచో, అదియు నొక విచిత్రమే. సత్య విషయమును గ్రహింపజాలని సామాన్య మానవులను నిరసించుటకంటె వారి అజ్ఞానమునకు జాలి పడవలెను. యథార్థమును గుర్తించునంతటి ఓర్పు వారి కుండదు. ఎక్కువ కామక్రోధముల చేతను, దురభిమానములచేతను వారి మనస్సు పూర్తిమైయుండును. అందువలన పూర్తిగ తెలిసి కొనుటకు గూడ ప్రయత్నింపరు. తమ బుద్ధికి తోచినట్లు మాటలాడుదురు; వ్రాయుదురు. అట్టి మాటలనుగాని, వ్రాతలముగాని లెక్కచేయకూడదు. ప్రస్తుతం నివాందోళన చెందనవసరం లేదు. సత్య మెన్నటికైనను జయించును. అదియం దసత్యము జయించినట్లు కనిపించినను, అంతిమ విజయం సత్యమునకే లభించును.
మహాపురుషులు పూజలకుప్పొంగరు; అవమానములకు ఆందోళన చెందరు. పరిశీలించినచో, ఏ ధర్మశాస్త్రము సందును జ్ఞానుల లక్షణము లిట్టి వనియు, వారి నడవడి ఇట్లుండవలెననియు శాసించియుండలేదు. తామను సరించదగు విధానములను వారే తెలిసికొందురు. వారి స్థితప్రజ్ఞయే పవిత్ర లోకసంగ్రహ కర్మలను వారిచేతచేయించును. ఆత్మవిశ్వాసము, లోకకల్యాణము అనుఈ రెండే మహాపురుషుల నైజధర్మములు. శిష్టులను ధర్మాచరణ నిష్ఠులుగ నొనర్చుచు. నైహికాముష్మిక ఫలముల నందునట్లనుగ్రహించుచుందురు. ఆత్మ విశ్వాసము. లోకసంగ్రహకర్మము అను ఈ రెండు నియమములకు బద్ధుడనైయుండు నన్ను గూర్చి నీవాందోళన చెందనక్కర్లేదు. నిందాస్తుతులు శరీరమునకే గాని, అంతరాత్మము అంటనేరవు.
అఖిల మానవులకు నానందమొనగూర్చి
రక్షించుచుండుటే దీక్ష నాకు
సన్మారమును వీడి చరియించువారల
బట్టి గాపాడుటే వ్రతము నాకు
బీదసాదలకైన పెనుబాధ తొలగించి
లేమిని బాపుటే ప్రేమ నాకు
నిమనిష్ఠలతోడ నను గొల్పువారిని
కాపాడుచుండుటే ఘనత నాకు
మంచి చెడ్డలు కూడ మనసులో సమముగా
భావించుచుండుటే భక్తి నాకు
అనగ బేరొంది నాయండ వలరువారి
నెన్నడును మరువనివాడ నన్నమాట
నెట్టి కుచితము మదికి నే నేరకుందు
అట్టి నాపేరు చెడుట యెట్టనుమ భువిని?
అనుచిత భాషణముల నెన్నడును లెక్కచేయకుము. పరులు తమ్ము పొగిడినంతనే యౌన్నత్యము మహాత్ములకు లభింపదు; అల్పు లనినంత మాత్రమున అల్పత్వము సిద్ధింపదు. నల్లమందు, గంజాయి సేవించుచు యోగులమని చెప్పుకొను నట్టివారును, తమ యాడంబరమును సమర్థించు కొనుటకై శాస్త్ర ప్రమాణములను వల్లెవేయు వారును, తమ కుతర్క నైపుణ్యమునకును, అపార్థ శాస్త్ర పాండిత్యమునకునుబ్బితబ్బిబ్బులగుచుండుపండితమ్మన్యులునునిందాస్తుతులకుచలింతురు.అవతారపురుషులనుగూర్చియు, జ్ఞానులను గూర్చియు రచింపబడిన జీవిత చరిత్రలను నీవు చదివియే యుందువుకదా! రామ, కృష్ణావతార చరిత్రలలో ఎందరెందరో దుష్టులు వారిపై ఎన్ని నిందలు మోపి యున్నారో నీవు చదివియే యుందువు. ఆనాడీనడననేల? సర్వ కాలము లందును సజ్జనులను దుయ్యబట్టుచుండుటే దుర్జనుల లక్షణమని గ్రహింపుము. కావున, అట్టి విషయములకు విచారము పడవద్దు. ఏను గులను నక్షత్రములను జూచి కుక్కలు మొరుగు నను సామెత వినలేదా? ఎంత కాలమీ దుష్ప్రచారము నిలుచును? నిజము నిలకడ మీద తెలియును సత్యము జయించును.
నా సంకల్పమును,నా సందేశమును విడువను.నేను నా కార్యమును జయప్రదముగ నిర్వర్తించగలను. ఇందు గురించి కలుగు మానావమానములను, నిందాస్తుతులను సమభావముతో నెదుర్కొందును. నేను నిజముగా అంతరంగములో నిర్వికారుడనై యున్నాను. బాహ్య ప్రపంచము కొఱకే నా నటనమంతయు. లోకసంరక్షణార్థం ఆవతరించితినని ప్రజలకు తెలుపుట కొఱకే నేను ప్రజలలో కలసిమెలసి వ్యవహరించుచుండుట. నే నే దేశమునకూ కట్టుబడలేదు. ఏ నామమునకూ కట్టుబడను. నాది, నీది అను భేదమే నాకు లేదు. ఏ పేరుతో పిలిచినను పలుకుదును. ఎచ్చటికి పిలుచుకొని పోవలయునన్నను పోయెదను. ఇదియే నా ప్రథమ శపథం. ఇంతవరకు ఈ విషయమెవ్వరికీ దెలుపకుంటిని. ఈ మాయా జగత్తుకు దూరముగానున్నాను. మానవోద్ధరణకు మాత్రమే కృషి సల్పుచున్నాను. నా మహిమను ఎంతటి వారైనను కనుగొనలేరు. మున్ముందు నీవు నా యద్భుత మహిమలను గాంచగలవు. భక్తులకు దృఢవిశ్వాసము, నమ్మకము, తితీక్ష యుండవలెను. ఈ విషయములను ప్రచురింపవలెనను కుతూహలము నాకు లేదు. కాని, జవాబు వ్రాయకున్న బాధ పడుదువని ఈ విషయములను జవాబులో చేర్చితిని. ఇంతియే.
(స. సా.జ.2001 పు.11/12)
మొట్టమొదట పూతన. ఈమె పాలివ్వడానికి పోయి ప్రాణము కోల్పోయింది. "యద్భావం తద్భవతి", మనంఎట్టి చింతన చేస్తామో అట్టి ఫలములే లభ్యమౌతుంటాయి.
ఈ పూతన ఎవరు? ఈమె పూర్వ జన్మలో బలిచక్రవర్తి కుమార్తె. ఈమె పేరు రత్నావళి. బలిచక్రవర్తి వద్దకు వామనుడు వచ్చినప్పుడు రత్నావళి కిటికీ నుండి చూసింది. "ఈ బాలుడు ఎంత అందంగా ఉన్నాడు. ఇతడే నాకు పుట్టి ఉంటే అనేకవిధములుగా పాలిచ్చి పాలించి పోషించి ఆనందించి ఉండేదానను" అని తనలో తాను ఆనుకొన్నది. అంతలోనే వామనుడు బలిచక్రవర్తి ఇచ్చిన మాట ప్రకారం రెండడుగులు - ఒకటి భూలోకము, రెండవది ఆకాశము - తీసికొని, మూడవ అడుగు బలిచక్రవర్తి తల పైన పెట్టాడు. వెంటనే రత్నావళికి కోపం వచ్చేసింది. "ఎవడీ దుర్మార్గుడు? వీనిని చంపివేయాలి" అన్నది. మొదట వామనుని చూచినంతనే ప్రేమతో తల్లిగా పాలివ్వాలని ఆశించింది; కాని కడపటికి చంపాలని సంకల్పించుకొన్నది. ఈ రెండు సంకల్పముల చేతనే ఆమె పూతనగా తిరిగి పుట్టింది. ఆ పూతనే కృష్ణునికి పాలివ్వాలని వచ్చింది?
(స. సా.అ..94పు.271)
దుష్ట సంకల్పముల చేత దుఃఖితుడగు
సత్య సంకల్పములచేత సాధువగును
సకల సంకల్పరహితుడే శాంతి పొందు
ఇంతకన్నను వేరెద్ది ఎఱుక పరతు?
(స. సా. డి.96 పు. 325)
సత్యమును ఆధారము చేసుకొనియేబలి చక్రవర్తి ప్రజలనుప్రాణముగా చూచుకుంటూ బిడ్డలుగా పోషించుకుంటూ కాలమును గడుపుతూవచ్చాడు. బలిచక్రవర్తి చాలా దానపరుడు. ప్రేమస్వరూపుడు. సత్యభాస్కరుడు. అతని పాలనలో కేరళ ప్రజలు సుఖశాంతులను అనుభవిస్తూ వచ్చారు. ఆకలిబాధలు లేకుండా వచ్చారు. దేవతలను జయించిన తరువాత నర్మదానది ఒడ్డున ఒక గొప్ప యాగం తల పెట్టాడు. దానినే విశ్వజిత్ యాగము అంటారు. ఆ సమయంలో వామనమూర్తి ఈ బలిచక్రవర్తి తలపెట్టిన యాగమునకు సిద్ధాశ్రమమునుండి వస్తుండగా, అందరూఆశ్యర్యంలో చూస్తూ వచ్చారు. అతను బాలుడు. అతనిలో తేజస్సు ప్రకాశిస్తున్నది. ఈ ప్రకాశమే అందరినీ ఆకర్షించింది. వామనుడు అనగా మాగ్నెట్ స్వరూపమే, ఈ దృశ్యమును బలిచక్రవర్తి కుమార్తె రత్నమాల కూడా చూచింది. ఆ బాలుని తేజస్సును చూచి ఆశ్చర్యపోయింది. ఆలాంటి బిడ్డ నాకు కలిగితే నేను ఎంతో అదృష్ట వంతురాలిని గదా! అని భావించింది. కాని ఇంతలో ఆ బాలుడు (వామనుడు) బలిచక్రవర్తిని మూడడుగులు దానం అడగడం, బలిని పాతాళమునకు తొక్కడం జరిగింది. ఆ దృశ్యముమ కూడా చూచిన రత్నమాల ‘ఛీ! ఇలాంటి దుర్మారుడ్ని, నాకు కుమారుడు కావాలని ఆశించావా! నేమ విషపుపాలిచ్చి చంపి ఉండేదానము అని భావించింది. వామనుడు దీనిని గమనించి “తథాస్తు అన్నాడు. భగవంతుడు ఎవరి సంకల్పములు, భావములు ఏవిధంగా వుంటుంటాయో ఆవిధంగా జరగాలని ఆశీర్వదిస్తూ వస్తుంటారు. కనుక మనం ఎప్పుడూ మంచినే తలుస్తూ వస్తుండాలి. భగవంతుడు లేని స్థానమే లేదు. - సర్వత్రా ఉన్నాడు. అమ్మా! రత్నమాలా! నన్ను నీ పాలనిచ్చిపెంచాలని ఆశించావు. దేహాభిమానం చేత, నీ తండ్రిని పాతాళమునకు తో క్కటంచేత, నీలో క్రోధం ఆవిర్భవించింది. ఇప్పుడు నాకు విషపు పాలిచ్చి చంపాలని చింతిస్తున్నావు. కనుక నీవు ద్వాపరయుగంలో పూతన గా పుట్టి నాకు విషపుపాలను యిచ్చి, నీవు మరణించుదువు గాక! అని శపిస్తాడు. కనుక ప్రతి మానవుడూ సత్సంకల్పములను అభివృద్ధి పరచుకోవాలి. ఏ సంకల్పములు చేసినా భగవంతుడు తధాస్తు అంటుంటాడు. కనుక మంచి సంకల్పములనే సదా చేస్తుండాలి. ఈ పవిత్రతను మానవుడు గమనించక అనేక రకములైన చింతనలు చేస్తుంటాడు. కనుక మనం నిరంతరం మంచి చింతనలు చేస్తుండాలి. పవిత్రమైన చింతనలు చేస్తుంటే పవిత్రమైన ఆశ్వీర్వాదములు కలుగుతూ ఉంటాయి. చెడ్డ సంకల్పములు చేస్తే చెడే ప్రాప్తిస్తుంది. కాని ఫలితములు అందుకున్నపుడు బాధపడుతాం. చింతించేటప్పుడుఆలోచించం, సంకల్పములను బట్టేఫలితాలు ఉంటాయి. భగవంతుడు ఇలాంటి ఫలితాలు అందించాడేమని నిందిస్తాముగాని, అది భగవంతుని తప్పుకాదు, నీదోషమే, కనుక మనం సత్సంకల్పములు చేయాలి, సత్సంగమంలో చేరాలి. నీవు మంచి సాంగత్యం చేస్తే నీలో మంచి భావములే ప్రవేశిస్తాయి.
(శ్రీ అ.2001పు.7/8)
నా సంకల్పము ద్వారా, అవతారమూర్తిగా, కలిగిన నాశక్తి స్వతస్సిద్ధమైనది. సహజమైనది. అనంతమైనది, నా నిర్ణయానుసారము చరించునట్టిది. ఈ శక్తి నాయందు సహజముగానే ఉన్నందున దాని కొరకు సాధనలుకాని, మంత్ర తంత్రములుకాని, అవసరములేదు. అనగా సాధనతో, తపస్సుతో పొందిన సిద్ధులు కావు. మంత్రములు కావు. నా నుండి వాటికవే ఆవిర్భవించు చుంటవి. ఇట్టి శక్తి ఒక్క అవతార పురుషునికి మాత్రమే ఉంటుంది. అందుచేత ఈ లీలలన్నీ భగవంతుని అనంత శక్తిలో ఒక అత్యల్పాంతము మాత్రమే. "ఏకాంశేన స్థితో జగత్’’ అని గీతావాణి.
నా సర్వకార్యములు ఒకానొక విధానము ననుసరించి జరుగుతుంటవి. ఆ విధానము మానవునకు ఆగ్రాహ్యము. నేను రోగ నివారణ చేయగలను. ప్రజలను ఆపదల నుండి రక్షించగలను. పునరుజ్జీవులను చేయగలను.అయితే నాయీ అనుగ్రహమునకు పాత్రులు కావలెనన్న, వారు ఎటువంటి సంశయములు లేని మనస్సు కలిగి ఉండాలి. నా అనుగ్రహమును వారు దానిని పొందుటను, విద్యుచ్ఛక్తిలోని పాజిటివ్, నెగటివ్ కరెంటుతో పోల్చ వచ్చును. నా అనుగ్రహ శక్తి పాజిటివ్ కరెంట్ అయితే, దానిని వారు స్వీకరించు శక్తి నెగిటివ్ కరెంట్ అవుతుంది.ఈ రెండు ప్రవాహముల సంయోగము వలన వెలుగు వచ్చునట్లు ఈ అద్భుతములులేక లీలలు సంభవించు చున్నవి.
(శ్రీస.ది.లీ.పు. 23/24)
నా సంకల్పము, పిలుపులేనిదే ఎవ్వరూ పుట్టపర్తికి రాలేరు. నన్ను చూడటానికి సిద్ధంగా ఉన్న వ్యక్తులను మాత్రమే నేను పిలుస్తాను. కానీ ఈ సిద్ధంగా ఉండటం అనేది ఆయా వ్యక్తులకు వేరువేరు స్థాయిలలో ఉంటుంది.
(శ్రీ. స. ప్రే.స్ర.పు. 372)
(చూ॥ ఈక్షతేర్నాశబ్దం, ఓంకారము, కస్తూరి, దివ్య ప్రకటనలు, నగరసంకీర్తన,సత్యం శివం సుందరం)