"దైవాధీనం జగత్సర్వం, సత్యాధీనంతు దైవతమ్,
తత్సత్యముత్తమాధీనం, ఉత్తమో మమ దేవతా”
ఈ విశ్వమంతయూ దైవాధీనమై ఉంటున్నది. అట్టి దైవము సత్యాధీనమై ఉంటాడు. సత్యము ఉత్తముని యొక్క ఆధీనమై ఉంటుంది. అట్టి ఉత్తములే దైవ స్వరూపులు.
(శ్రీ .సె.2000 పు.7)
విశ్వం విష్ణు స్వరూపము. అంతా విశ్వవిరాటస్వరూపమే. "సహస్రశీర్షాపురుషః సహస్రాక్ష సహస్రపాత్". ఇదే విశ్వస్వరూపము. ఆనాడు విప్రులు ఈ వేదమును అభ్యసించే సమయములో ప్రపంచమంతా చేరి మూడు కోట్లమందే ఉన్నారు. కనుక వారిని ముక్కోటి దేవతలు అన్నారు.
అనగా ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క దైవస్వరూపమే. ఇప్పుడు 500 కోట్ల పైన అయిపోయినారు.
కానీ యిప్పుడు కూడా మూడు కోట్ల దేవతలనే అంటున్నాము. కాదు, కాదు ఇప్పుడు 500 కోట్ల దేవతలున్నారు. అందరు దైవస్వరూపులే. "ఈశ్వరస్సర్వభూతానాం, ఈశావాస్యమిదం జగత్" అంతా ఈశ్వరుడే. ఈ సత్యాన్ని గట్టిగా మనము విశ్వసించి ఆందరిని దైవస్వరూపులుగా భావించాలి.
పరుల తిట్టినంత పాపఫలంబబ్బు
విడువదెన్నటికి విశ్వమందు
పరులు పరులు కాదు పరమాత్మ అగునయా!
(ద.య.స. 97 పు.18)
హనుమంతుడు సీతకు రావణుని మరణవార్త చెప్పిన తరువాత, "తల్లీ! నీవు అనుమతిస్తే ఇంతకాలమూ నిన్ను బాధించిన ఈ రాక్షస స్త్రీలను ముక్కలు ముక్కలు చేస్తానన్నాడు. అప్పుడు సీత "నాయనా, హనుమంతా! ఇందులో వీరి దోషమేమీ లేదు. తమ ప్రభువాజ్ఞను తాము పాలిస్తూ వచ్చారు. అంతేగాక బాధించడం రాక్షసుల స్వభావమేగాని నా స్వభావం కాదు. ఎవరి స్వభావం వారిది" అని పలికి ఒక చిన్న కథ చెప్పింది. ఒక వేటగాడిని పులి తరుముకుంటూ వెళ్ళగా అతడొక చెట్టు నెక్కాడు. కాని ఎక్కిన తరువాత చెట్టుపైన ఒక ఎలుగుబంటు కనిపించింది. క్రింద చూస్తే పులి, పైన చూస్తే ఎలుగుబంటు! వేటగానికి ఏమి చేయాలో తోచలేదు. కాని ఆ ఎలుగు బంటు చాల మంచిది. ఎవ్వరికీ హాని తలపెట్టేస్వభావం కాదు దానిది. కొంత సేపటికి చెట్టు క్రిందనున్న పులి, "ఓ. ఎలుగుబంటూ! నేనెంతో శ్రమ పడి వానినింత దూరము తరుముకొని వచ్చాను. కనుక నీవు వానిని క్రిందకు త్రోసివేస్తే భుజించి వెళ్ళిపోతాను" అన్నది. అప్పుడా ఎలుగుబంటూ, "ఓ పులి! ఈ వృక్షము నా నివాసము, ఇతడు నాకు ఆతిథిగా వచ్చాడు. ఇతనిని రక్షించడం నా కర్తవ్యం. కాబట్టి ఇతనిని క్రిందికి నెట్టను" అన్నది. కాని పులి అక్కడి నుండి కదల లేదు. కొంత సేపటికి ఎలుగుబంటుకి నిద్ర వచ్చింది. అప్పుడా పులి ఒక ఉపాయమాలోచించి వేటగానితో. "ఓ వేటగాడా! నాకు కావలసింది ఆహారమే. ఏవైతేనేమి. ఇంకొకరైతే నేమి! కనుక నిద్రపోయే ఆ ఎలుగుబంటును క్రిందికి నెట్టు. దానిని భుజించి నిన్ను వదలి పెట్టి వెళ్ళిపోతాను" అన్నది.
ఈ వేటగాడు స్వార్థపరుడు. తనను తాను రక్షించుకునే నిమిత్తమై నిద్రపోతున్న ఎలుగుబంటును క్రిందికి నెట్టాడు. అది క్రింద పడుతూంటే అదృష్టవశాత్తు ఒక కొమ్మ చేతికి దొరికింది పాపం! ఇదే మంచితనమున కున్న రక్షణ. తన మంచితనమే తనను కాపాడింది. తన చేతి కందిన కొమ్మను పట్టుకొని ఆది విదానంగా తిరిగి చెట్టుపైకి ఎగబ్రాకింది. అప్పుడా పులి, ఓ ఎలుగుబంటూ! నీవింత గొప్ప ఉపకారం చేసినా ఆ వేటగాడు నీకు అపకారమే తలపెట్టాడు. వాడు కృతఘ్నుడు. కనుక తక్షణమే వానిని క్రిందికి నెట్టు" అన్నది. "ఓ పులి! ఎవరి స్వభావము వారిది కావచ్చు గాని, ఉపకారము చేయుటే నా స్వభావము. వాని పాపము వానిది, నాపుణ్యము నాది. కనుక నేను మాత్రం వానిని క్రిందకు నెట్టను" అన్నాదా ఎలుగుబంటు. సీత ఈ కథ చెప్పడం పూర్తి చేసి, "అదేవిధంగా ఓ హనమంతా! ఈ రాక్షసులు నన్ను ఎన్ని విధములుగా బాధించినప్పటికీ నేను తిరిగి వారిని బాధించాలని కోరను. వారి స్వభావం వారిది, నా స్వభావం నాది" అన్నది. ఈ మాటలు విని హనుమంతుడు ఎంతో ఆనందించాడు. లోకంలో ఉపకారికి కూడా అపకారం చేసే వారున్నారు. అటువంటివారు రాక్షసులే. అపకారికి కూడా ఉపకారం చేసేవారే దైవస్వరూపులు.
(స. సా.పి. 97 పు. 52)