భుజబలంబు మంచి బుద్ధిబలంబుండి
దైవబలములేక దాసుడగును
కర్ణుడంతటివాడు కడపటికేమయ్యె
మరువబోకుడిట్టి మంచిమాట.
కర్ణునకు భుజబలము, బుద్ధిబలము, శస్త్ర బలము, సర్వబలములుండి కూడను దైవబలము లేకపోవుటంచేత కట్టకడపటికి ఏమయ్యాడు? దైవబలము నిజమైన బలము, ప్రాకృత బలము దుర్బలము. శరీరమానసిక బుద్ధిని అనుసరించుకొని అనిత్యము ఆశాశ్వతమైన బలమునే ఆధారము చేసుకొని ఆత్మ తత్వాన్ని పొందుటకు ప్రయత్నం చేయటము వెఱ్ఱితనము. ఆత్మజ్ఞానము లభ్యము కావాలనుకున్నప్పుడు దివ్యమైన ఏకత్వమును అభివృద్ధి పరుచుకోవాలి. ఈనాడు. ఏకత్వమును కోల్పోవటంచేతనే భిన్నత్వము అభివృద్ధి అయిపోయి దేశము అల్లకల్లోలమై పోతున్నది. జ్ఞానమును భిన్నత్వముగాని విభాగముగాని చేయుటకు వీలు కాదు. ఈ దివ్యజ్ఞానము మనమే. మనలో వున్నదనిగాని మనము సంపాయించేదని గాని భావించరాదు. మనమే జ్ఞానము మనమే అనంతము. మనమే సత్యము. మనమే బ్రహ్మము. దీనిని పురస్కరించుకొని "సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ" అన్నారు.
(బృత్ర.పు, ౧౩౬ )
ఏవీరుడైనా ఎంత భుజబలము ఉన్నా దైవబలము లేనివాడు దాసుడై చెడును.
(సా. పు 121)