"కానిదిదియని చెప్పంగ గలరు గాని,
బ్రహ్మమిదియని చెప్పంగ వలను కాదు.
సత్య నిత్యంబు జ్ఞానమనంతమయిన
అదియే బ్రహ్మంబు; వాక్కున కలవికాదు."
"యుతోవాచో నివర్తంతే అప్రాప్యమనసాసహ." వతత్వమును గురించి చెప్పటము అసాధ్యము. రామ చరిత్ర యెంత పవిత్రమోఅంత విచిత్రము కూడా. కానీ, వేదశాస్త్ర ఇతిహాస పురాణములు, నారాయణుని యొక్క కల్యాణ గుణగణములను ఘోషించి, ఘోషించి, సఖతి - నఇతి , ఇదికాదు. ఇదికాదు అని చెప్పి చెప్పి, ఇది బ్రహ్మము అని నిర్ణయించి చెప్పలేని పరిస్థితిలో నిలిచిపోయినవి. ఇది స్మృతి యొక్క స్మరణ. భగవంతుని యొక్క కళ్యాణ గుణగణములను వర్ణించుటకూ, అదిఇది" అని చెప్పుటహ, నాటికి, నేటికి, ఏనాటికైనను ఎవ్వరికిని సాధ్యము కాదు. అట్టిది. ఇట్టిది అని ఎట్టివారైననూ గట్టిగా చెప్పుటకు, ఊహించుటకు కూడను వీలుకాదు. అనేక మంది కవులు భగవంతుని యొక్క లీలాగుణగణ విశేషములను, భగవంతుని మహత్తరమైన శక్తులను వర్ణించుచు, వేదికలపైన ప్రచార ప్రబోధనలను సల్పవచ్చునే తప్ప, ఆచరణయందు వాటిని అనుభవించుటకు సాధ్యము కాదు. ఇంతవరకు భగవంతుని యొక్క సత్యస్వరూపాన్ని నిరూపించినటు వంటి గ్రంథము కానీ, వ్యక్తి కానీ కానరాడు. కేవలము వారి భక్తి ప్రపత్తుల యొక్క ప్రభావము చేతను, వారి విశ్వాసము చేతను భగవంతుని కొంతవరకును, అందని చందమామను ప్రేళ్ళలో చూపించినట్లుగా వాక్కులతో ఉచ్చరించ వచ్చునే తప్ప సత్యస్వరూపమును నిరూపించుటకు వీలుకాదు. ప్రాచీన కవులు, ప్రాచీన ఋషులు అట్టిపనికి పూనుకొనక, తాము త్రికాల జ్ఞానులు, త్రికాలదృష్టి కలిగినవారు కనుక, పరమాత్ముని యొక్క శక్తి సామర్థ్యములు అంతయో, ఇంతయో తెలుసుకొని, ప్రపంచమునకు చాటడానికి పూనుకొన్నారు. వారు మహాశక్తి వంతులు.
(ఆ.రా. పు. 20/21)
దైవత్వమును గుర్తించే శక్తి సంపాదించాలి
అవతార పురుషులైన రాముడు, కృష్ణుడు దేహము విడిచి వెళ్ళారు. తెలియనివారు అనుకుంటారు యుద్ధంలో పోయారని, యాదవులలో ముసలం పుట్టి ఒకరికొకరు చంపుకున్నారని. కాని, రామకృష్ణావతారములు ఈ విధంగా పోయినవి కానే కాదు. రాముడు సరయూనదిలో దిగి అంతర్థానమయ్యాడు. అంతకుముందే సీతను పంపించాడు. కృష్ణుడు కూడా ద్వారకకు వెళ్ళాడు. ఎక్కడికో వెళ్ళినట్లు వెళ్ళాడు. చెట్టు క్రింద కూర్చున్నాడు. ఉద్ధవుడు చూశాడు .... చూశాడు... ఒక్క క్షణంలో కృష్ణుడు అంతర్థానమైపోయాడు. ఈ విధంగా ఒకరి చేతిలో పడే శరీరాలు కావు ఇవి. దైవత్వమును గుర్తించుకునే శక్తిని మీరు సంపాదించుకోవాలి. దానివల్ల ఈ దైవత్వమేమిటో మీకు అర్థమౌతుంది. (రామాయణ దర్శనము వేసవి తరగతులు 2002 పు 40-41)
అన్నింటియందు దైవతత్త్వము చాలా ప్రధానమైనది. పూర్వం ప్రపంచంలో వెలుగు రావడానికి కొన్ని కోట్ల సంవత్సరములు పట్టిoది, ఎక్కడ చూసినా అంతా చీకటే. అదేవిధంగా, రాముని జన్మఅయిన తరువాత పదిహేను దినములు సూర్యోదయు లేదు. సూర్యోదయము లేక పోవడంచేత చంద్రోదయం కూడా లేదు. - జనులు చాలాబాధపడుతున్నారు. అప్పుడు చంద్రుడు “నేను రామచంద్రుని చూడాలి. అతనిని చూసేటందులకు అవకాశం లేకుండా పోయింది. నేను ఎప్పుడు రాముణ్ణి చూడాలి,” అని చెప్పి తపస్సు మాదిరి చేశాడు. అప్పుడు రాముడు తిరిగి వచ్చి చెప్పాడు చంద్రునికి. “నాయనా! ఈ పదిహేను దినముల చూడలేకపోయావు. వచ్చే అవతారంలో ఎవరికీ లేని మొట్టమొదటి దర్శనం నీకే ఇస్తున్నాను,” అన్నాడు. ఎప్పుడు? కృష్ణావతారంలో చెఱసాలలో శ్రీకృష్ఠ జననం అయిన తరువాత ఆ బిడ్డను అర్ధరాత్రి సమయంలో వసుదేవుడు తలపై పెట్టుకొనిపోతున్నప్పుడు చంద్రుడు - మొట్టమొదటగా చూశాడు. మరెవరూ చూడలేదు. ఒక్క చంద్రునికి మాత్రమే దర్శనం ఇచ్చాడు. ఈవిధంగా, రామాయణంలో అనేక నిగూఢమైన విషయాలు, అంతరార్థాలు ఉన్నాయి. (రామాయణ దర్శనము వేసవి తరగతులు 2002 పు 55-56)