బ్రహ్మసూత్రము శారీరకశాస్త్ర మనియు, వేదాంత దర్శన మనియు చెప్పబడుచున్నది. అంటే శరీర సంబంధితమైన ఆ త్మ, జీవుడు, ఇంద్రియాది భూతాలను గూర్చిన శ్రేష్టమైన పరిశీలన జరుపుట. అనగా బ్రహ్మమే శరీర ఇంద్రియాలకు ఆధారమని గుర్తించుట. ఏతావాతా ఆనంద ఘనమే నీ స్వరూపమని తెలుసుకొనుట. ఇక దర్శనము అనగా చూపు అని అర్థము నిచ్చుచున్నది. ఇది సత్య దర్శనమునకు తోడ్పడుచున్నది. దర్శనములన్నియు సుప్రసిద్ధులు, ద్రష్టలునగు మహర్షులచే ప్రతిపాదింపబడినవి. న్యాయము గౌతమునిచేతన, వైశేషికము కణాదుని చేతము, పూర్వమీమాంస జైమినిచేతను, ఉత్తరమీమాంస వేదవ్యాసుల చేతను ప్రతిపాదింపబడినవి. వీరిలో కపిలుడు, వ్యాసుడు విష్ణ్వంశమనియు మునుల విశ్వాసము. వీరేమిటి, అందరూ విష్ణ్వంశలే అని బ్రహ్మసూత్రము నిరూపించుచున్నది. బ్రహ్మసూత్రములద్వారా ఉత్తర మీమాంస వేదవ్యాసమునిచే ప్రతిపాదింపబడెను. ఈ సూత్రము పూర్వ పక్ష, సిద్ధాంతములతో గూడి బ్రహ్మవిద్యను ఈ విధముగా ఆక్షేపణ సమాధానములలో బోధించుచున్నది. శరీరమును ఉపాధిగా చేసుకొని పురుషుని గురించి విదితము చేయును గనుక శారీరక మీమాంస అని, వేదాంతమును గురించి వివరించునది గాన వేదాంత దర్శనమని ఈ ఉత్తర మీమాంస పేరెన్నిక గన్నది.
(సూ.వా.పు.3)
(చూ|| షడ్ దర్శనములు)