"క్షుద్రం హృదయ దౌర్బల్యమ్" అర్జునా! యీ నీచమైన మానసిక దౌర్బల్యమును తరుమగొట్టి ధైర్యముగా యుద్ధభూమియందు నిలువుమని ఆదేశించాడు కృష్ణుడు, హృదయ దౌర్బల్యమునకు మూలకారణము దేహాత్మభావము. దేహాత్మ భావమునకు అజ్ఞాన ప్రభావమే కారణము. ఏతావాతా అజ్ఞానము యొక్క ప్రభావము చేత మానవుడు దేహాత్మభావమును పెంచుకొని మానసికంగా దుర్బలుడౌ తున్నాడు. దేహమే దుఃఖమునకు మూలకారణము.
మానసిక దౌర్బల్యముతో ఎట్టి చిన్నకార్యమును కూడ సాధించలేడు. కనుకనే మధ్యమధ్య గీతాచార్యుడు “నాయమాత్మా బలహీనేన లభ్యః" హృదయ దౌర్బల్యం గలవాడు, బలహీనుడైనవాడు యెట్టి కార్యమును సాధించలేడని నిరూపించాడు. మానసిక దౌర్బల్యమున్న వ్యక్తినే దుఃఖమోహములు వెంటాడుతుంటాయి. దుఃఖము ముందా లేక మోహము ముందా అనే విషయమును మనము విచారించాలి. మోహముండినప్పుడే దుఃఖము వెంటాడుతుంది. మోహమే లేకుండిన దుఃఖముండదు.మోహము బింబము, దుఃఖము ప్రతిబింబము. ఈ బింబప్రతిబింబములే మానవునికి ప్రధాన విరోధులు. ఈ మోహదు:ఖములు మానవుని క్రుంగదీయుచున్నవి.
(శ్రీ. స. గీ. పు.121)
(చూ! మోహము, స్థైర్యము)