జీవితంలో నియమం లేకపోతే శాంతిభద్రతలు ఉండవు, ఇతరులను శాసించేవాడు యమ. తనను తాను నిగ్రహించుకొనేవాడు సంయమి. సంయమిపై ఎవరి ఆదేశాలు పని చేయవు. జీవితం నియమనిబద్ధం కావాలి. ఈ నియమం తపస్సుగా మారాలి. నియమరహితమైన జీవితం పతనానికి దారి తీస్తుంది.
నియమం చేతనే గాలి వీస్తున్నది. సముద్రం నిలచి ఉన్నది. భూమి తిరుగుతున్నది. సర్వ బ్రహ్మాండములు నియమానికి లోబడి ఉండటంవల్లనే జగత్తు సంక్షేమంగా ఉన్నది. దీనివల్లనే శాంతి లభిస్తున్నది.
ప్రపంచంలో శాంతికి మించిన లాభం లేదు. శాంతికి మించిన పదార్థంలేదు. శాంతిలోనే సర్వసౌఖ్యములు యిమడి ఉన్నాయి.
ధ్యాన నిష్ఠకు కొన్ని నియమాలను పాటించాలి. దయ, ప్రేమ, ఇత్యాది సద్గుణాలను అభివృద్ధి చేసుకోవాలి. శాంతం కేవలం ధ్యాననిష్టా నియమంలోనే కాదు, సర్వకాల సర్వావస్థలయందు ఉండాలి.
ధ్యానం ఒక కాలానికి, దేశానికి, నియమానికి కట్టుబడినది కాదు. ఈ ధ్యానం ద్వారా పవిత్రమైన దివ్యత్వాన్ని చేరుకోవచ్చు. దివ్యత్వంలో లీనంచేసే మార్గం ఈ ధ్యానం. ధ్యానబద్దుడైన మానవుడు శాంతియే ప్రధాన సూత్రంగా ప్రయాణం చేయాలి.
దైవగుణాలు కేవలం పూజాసమయానికి పరిమితం కారాదు. ధ్యానసమయంలో పరమశాంతి ప్రదర్శించి వెన్ వెంటనే రాక్షసంగా ప్రవర్తించడం సమంజసం కాదు.
(ఆ.శా. పుస్/6)