సత్యం మాతా పితా జ్ఞానం ధర్మో భ్రాతా దయా సఖా శాంతం ప త్ని క్షమా పుత్ర: షడేతే నిజ బాంధవాః
సత్యం మాతా: ప్రపంచములో ప్రతి వ్యక్తికీ ఒక తల్లి ఉంటుంది. కానీ జగత్తులో గల సర్వజీవులకు ఒకే తల్లి, ఆ తల్లిని మనం గుర్తించాలి. ప్రతి మానవునకు సత్యమనే ఒక మాతృదేవి ఉంటున్నది. ఆ దేవిని అనుసరించిన వానికి ఎట్టి ఇబ్బందులు కలుగవు. ఆ తల్లి త్రికాలాబాధ్య మైనది, త్రిలోకములకు అధిపతి అయినది, త్రిగుణములకు అతీతమైనది. ప్రాకృతమైన తల్లి మరణించవచ్చు. మార్పు చెందవచ్చు. ప్రదేశాన్ని మారవచ్చుగాని, సత్యమనే తల్లి ఏదేశమునకైనా, ఏ కాలమునకైనా, ఏవ్యక్తికైనా, ఏనాటికైనా ఒక్కటే. ఇట్టి దివ్యమైన, భవ్యమైన, సవ్యమైన, సమంజసమైన సత్యాన్ని ప్రతి వ్యక్తి తల్లిగా భావించి, విశ్వసించి అనుసరించటం అత్యవసరం.
పితా జ్ఞానం:
ఇంక తండ్రి ఎవరు? జ్ఞానం. జ్ఞానమనగా లౌకిక జ్ఞానం , భౌతిక జ్ఞానము, వైజ్ఞానిక జ్ఞానము కాదు. "అద్వైత దర్శనం జ్ఞానం", ఏకాత్మ భావాన్ని విశ్వసించడమే జ్ఞానం. ఆ జ్ఞానమే సత్యస్వరూపం. దీనినే వేదం "సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నది.
ధర్మో భ్రాతా:
సర్వ మానవులనూ, సర్వదేశములందు, సర్వకాలములందు ఏకత్వముతో ప్రేమించే సోదరుడు ధర్మము. ప్రేమస్వరూపుడైనవాడు ఈ సోదరుడు. దీనిని పురస్కరించుకొనే ప్రాచీన కాలము నుండి వేదము ‘సత్యం వద ధర్మం చర” అని సత్య ధర్మములకు అత్యంత ప్రాధాన్యము నందిస్తూ వచ్చింది. ధర్మమును మించిన సోదరుడు మరొకడు లేడు. రామలక్ష్మణులు సోదరులై పవిత్రమైన ఆదర్శమును జగత్తున కందించారు. యుద్ధంలో లక్ష్మణుడు మూర్చిల్లినప్పుడు రాముడు చాలా బాధ పడ్డాడు. లక్ష్మణా! సీత వంటి భార్యను ఎక్కడైనా వెదకి తెచ్చుకోవచ్చు. కౌసల్యవంటి తల్లిని నేను పొందవచ్చు. కాని ని వంటి సోదరుని తిరిగి పొందలేను. నీలాంటి సోదరుడు ఉండటంచేత నా రామతత్వము ప్రకాశిస్తూ వచ్చింది" అన్నాడు.
దయా సభా:
ఈ లోకంలో ఈనాటి మిత్రులు రేపు శత్రువులుగా మారవచ్చు. కానీ, మానవునికి, సర్వకాల సర్వావస్థలయందు మిత్రునిగా ఉండేది దయ. దయకు మించిన మిత్రుడు మనకు కాన రాడు. నిజమైన మిత్రుడు దయాస్వరూపుడు.
శాంతం ప త్నీ:
పత్ని ఎవరు? శాంతమే పత్ని, శాంతమే మహర్షుల ఆభరణము; ఋషుల యొక్క కిరీటము; ఆధ్యాత్మికమందు రాజమార్గము.
క్షమా పుత్రః :
క్షమయే పుత్రుడు. క్షమను మించిన పుత్రుడు లేడు. ఈ క్షమయే సత్యము. క్షమయే వేదము. క్షమయే ధర్మము, క్షమయే అహింస. క్షమయే శార్యము. ఈ జగత్తునందు క్షమను మించిన శక్తి మరొకటి లేదు. సత్యము, జ్ఞానము, ధర్మము, దయ, శాంతి, క్షమ - ఈ ఆరూ ప్రతి మానవునకు నిజమైన బంధువులు. ఈనాడు మానవుడు ఇట్టి మాతృదేవిని, యిట్టి పితృదేవుని, యిట్టి సఖుని యిట్టి సోదరుని, యిట్టి పత్నిని. యిట్టి కుమారుని కోల్పోవటంచేత జగత్తు అనేక అల్లకల్లోలములకు గురౌతున్నది.
(ద.స.98.పు.1/2)