మధ్యాహ్నము వరంగల్ నుండి వచ్చిన టీచరు Nathaniel మనము బడులను గుళ్ళుగా మారుస్తాము. అని చెప్పాడు. బడిని గుడిగా మార్చటము కాదు. బడులు నిరంతరము గుళ్ళే. వైద్యాలయము, భోజనాలయము, విద్యాలయము, దేవాలయము, మొదటిది దేహము నకు ఆరోగ్యమున అందించడానికి, రెండవది పుష్టిని, తుష్టిని అందించడానికి, మూడవది జ్ఞానమును అందించి లోకానికి సుజ్ఞాన విజ్ఞాన ప్రజ్ఞానమును చాటడానికి ఏర్పడినవి. విద్యాలయము నుండి దేవాలయమునకు పోవాలి. విద్యకు ఆలయమైన బడిని ఏ విధంగా మనము తయారు చేశాము. ఒక చావిడి సత్రము లాగా తయారు చేశాము. కాని యిది నిజముగా గుడి, బడి కాదు. పాఠశాల కాదు. విద్యాలయము. ఇటువంటి పవిత్రమైన ప్రదేశమున మనము చక్కని విద్యనందిస్తే వారు విద్యార్థులవుతారు. వారు కూడా సమస్త ప్రపంచమునకు ఆదర్శమూర్తులుగ తయారవుతారు.
(శ్రీసా.ది.పు.113)