ఉపనిషత్తులు సమస్త విషయములను క్రోడీకరించి ఒక త్రికోణముగా రూపొందింప చేస్తూ వచ్చాయి. శరీరము, మనస్సు, ఆత్మ - ఈ మూడూ ఒక త్రికోణము, శరీరము స్థూలము, ఆత్మ సూక్ష్మము. ఈ స్థూల, సూక్ష్మములు రెండింటిని మనస్సు ఏకము చేస్తున్నది. ఏవిధంగానైతే నాద బిందు కళలు సర్వత్రా వ్యాపించి యున్నవో ఆటులనే మనస్సు కూడను సర్వత్రా వ్యాపించి ఉంటున్నది. ప్రణవము సర్వత్రా ఉంటున్నది - అదే "ఈశావాస్య మిదం జగత్". మనస్సు సర్వత్రా వ్యాపించినదగుటచేత - మనో మూల మిదం జగత్ అయింది. సమస్తమునకూ మనస్పే కారణం. సుఖదుఃఖములకు, పాపపుణ్యములకు, ఆనంద ఆహ్లాదములకు మనస్సే కారణము. ఐతే, ఈ మనస్సు స్థూలమైన శరీరమును అదుపులో నుంచుకొని తగిన కర్తవ్య కర్మలను నిర్వర్తించడానికి కృషి సల్పాలి. శరీరము కేవలం జడమైనది. పదార్థములతో కూడినది. దీనికి చైతన్య శక్తి లేదు. ప్రాణమే దీనికి చైతన్యము కలిపిస్తున్నది.
ఇదే నిజమైన చైతన్యశక్తి ఐతే, ఈ చైతన్య శక్తి ఎక్కడనుంచి లభిస్తున్నది? ఇది ప్రజ్ఞానము నుండి లభిస్తున్నది. కనుక “రేడియేషన్" అనే ప్రభావము నుండి ప్రాణమనే "వైబ్రేషన్" ప్రవేశించి దేహమనే "మెటీరియల్” లోపల జీవిస్తూ ఉంటున్నది. దీనినే సత్ చిత్ ఆనందమనే త్రికోణంగా జాగ్రత్ స్వప్న సుషుప్తులనే త్రికోణంగా రూపొందించి జేసినది ఉపనిషత్తు. జాగ్రత్ స్వప్న సుషుప్తులు కాల వ్యత్యాసములే కాని, అనుభవించే వ్యక్తి ఒక్కడే. అన్నింటి యందు ఏకత్వాన్ని నిరూపింపజేసేది ఉపనిషత్తు..
(ప.పా. ఫి 1994. పు. 40/41)