బాహ్యంగా జరిగినది నరకాసుర వధ. అంతర్భావంలో జరిగినది - దుర్గుణముల నిర్మూలనము. అన్ని దుర్గుణముల కంటే అహంకారము, అసూయ చాలా చెడ్డవి. ఎట్టివాడినైనా అహంకారము క్షణంలో క్రిందకు త్రోసివేస్తుంది. అసూయ నెమ్మదిగా ప్రవేశించి జీవితాన్నే నాశనం గావిస్తుంది. కనుక, నరకాసుర వధ అనేది మానవుని యందుండిన అహంకార అసూయల వంటి దుర్గుణాలను దూరము గావించే నిమిత్తమై జరిగిన చరిత్ర, దీనికి వైజ్ఞానికంగా మరొక చరిత్ర ఉన్నది. ఈ విశ్వంలో ప్రాచీన కాలము నుండి అనేక గ్రహాలు తిరుగుతూ ఉన్నది. అయితే, ద్వాపరయుగంలో "నరక" అనే గ్రహము భూమికి అతి సమీపంగా వచ్చింది. ఈ గ్రహము భూమిపైన పడితే భూమి అంతా భస్మమైపోగల ప్రమాదం ఏర్పడినది. చల్లనైన చంద్రుడే భూమికి రెండడుగులు దగ్గరగా వస్తే అనేక ప్రమాదాలు సంభవిస్తాయి. కనుక, ద్వాపర యుగంలో- "నరక" అనే గ్రహము భూమిని ఢీ కొనడానికి సమీపించగా ఆ విపత్తు నుండి కాపాడమని ప్రజలందరూ కృష్ణుని ప్రార్థించారు. అప్పుడు కృష్ణుడు ఆ గ్రహాన్ని సంహరించి లోకాన్ని సంరక్షించిన ఘట్టమే నరకాసుర సంహారము.
ఆనాటి ప్రజలు భూమిని భస్మం చేయడానికి సమీపించిన నరక గ్రహాన్ని ఒక రాక్షసునిగా విశ్వసించారు. ఏలనగా, ప్రపంచాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించేవాడు రాక్షసుడే కదా! పూర్వము జర్మనీ దేశస్థుడైన హిట్లర్ అన్ని దేశాల పైన దండెత్తాడు. అతడి రాక్షసత్వాన్ని వ్యతిరేకిస్తూ పూర్వం తల్లులు ఒక జోలపాట కూడా పాడేవారు.
దండెత్తి వచ్చెనని జడిసి ఏడ్చితివా"
జో.........! జో.........!
హిట్లరుని చంపుటకు ఎఱ్ఱ సైన్యంబు
వీరుడా స్టాలిను గలరు. ఏడవకు ......... జో.........! జో.........!
కనుక, ఆనాటి వారందరూ హిట్లర్ని కూడా ఒక రాక్షసునిగా భావించారు. అదేవిధంగా ద్వాపరయుగములో నరక గ్రహాన్ని అందరూ రాక్షసునిగా విశ్వసించారు. అనేక మంది అతడి వలన అనేక బాధలకు గురియైనారు. ఆందుచేతనే, నరకాసురుడు పదహారు వేలమంది గోపికలను అపహరించాడని అంటున్నాము. అట్టి రాక్షసుని శ్రీకృష్ణుడు సంహరించి, ఆ గోపికలను విడిపించాడు. ఆ పదహారు వేల మంది గోపికలను వారివారి ఇళ్ళకు వెళ్ళి క్షేమంగా జీవించవలసినదిగా కృష్ణుడు ఆదేశించాడు, కాని, ప్రాకృతికంగా గోపికలు - "స్వామీ! లోకులు కాకులు. ఇంత కాలంపాటు మేము ఆ రాక్షసుని ఆధీనంలో జీవించి ఇప్పుడు మా ఇళ్ళకు వెళ్ళితే లోకులు నిందిస్తారేమో!
ఈ లోక నిందను మేము భరించలేము. కనుక, ఈ బంధము నుండి రక్షించిన మీరే మమ్మల్ని కాపాడి పోషించమని ప్రార్థిస్తున్నాము" అన్నారు. కనుక. వారు అతని పత్నులు కాదు. తనద్వారా రక్షింపబడినవారు కనుకనే శ్రీకృష్ణుడు వారిని పోషించుతూ వచ్చాడు.
(స. సా.న.92 పు.269/270)
(చూ||దీపావళి)