ఒక ఉపమానము తెలిసిన, ప్రాచీనధర్మ మెట్టిదో, యిప్పటి అర్థమెట్టిదో, మీకు బోధపడగలదు. శివదేవాలయములు చూడని భారతీయుడుండడని తలంతును. ఆ దేవాలయములో శివుని కెదురుగా ఒక నందిని చూతుము. వాటి భావమేమని? ఇప్పటి అర్థము ఈశ్వరుని వాహనమైన ఒక కోడె యనియు బసవణ్ణ అనియు తలంతురు. కానీ, ప్రాచీనకాలపు యొక్క శాస్త్రమువేరు! శివలింగం ఈశ్వర ప్రతీకం అనియు, నంది జీవ ప్రతీకం అనియు జీవేశ్వరుల మధ్య విభేదం చూడగూడదనియు శివలింగానికి నందికీ మధ్య యెవ్వరూ పోకూడదనియు, ఆలయాచారము! నంది శృంగమధ్యములోనుంచి శివలింగదర్శనం చేయడం మహాపుణ్యమని ఇప్పటివారు భావింతురు, ఎందుకనగా యధార్థమయిన అర్థమును తెలియనివారగుటచే! కానీ, దాని అంతరార్థము అదికాదు. జీవునిలో శివుని దర్శించమనియే పరమార్థము. పశువు, పశుపతికి వాహనము, అనగా అంకితమైనపుడు, నందిఈశ్వరుడను రెండు రూపములు రెండుభావములుగా, కాక అపుడు నందీశ్వరుడను ఒకే నామరూపములను స్వీకరించును. అప్పుడు అది ఆరాధనీయమవుతుంది. పశువు ఈశ్వరార్పితమై ధన్యత గాంచటమే యధార్థ పరమార్థము.
(స.పా.ఏ. 1974 పు55)