తమ్ములారా! ఈ శరీరము విషయభోగముల ననుసరించుటకు కాదు. సర్వభోగముల సమభవించుటకు కాదు. ఇవి అన్నియు క్షణభంగురములు. దీని మూలమున జీవుడు మరల సంసారములోనికి వచ్చును. అందుచేత యీ భోగములన్నియుము దు:ఖములకు కారణములు. ఈ విషయభోగములందాసక్తి కలవాడు మూర్ఖుడు. విషయములు విషమువంటివి. అమృతమును విడిచి విషమును గోరుట తగునా? అటుల విషమును గోరువాడు మంచివాడు కాడు. చింతామణిని విడిచి గాజు పెంకును అభిలషించినట్లుండును. నరశరీరమును ధరించి మానవుడు సంసారసాగరమును దాటలేకపోయిన యెడల వానివంటి దౌర్భాగ్యుడును, మందమతియు లేడు. వానివంటి ఆత్మఘాతకుడు ఉండడు. అందుచే మనుజులై పుట్టినవారు సర్వులయందు దైవము ఆత్మస్వరూపుడై ఉన్నాడన్న సత్యమును గ్రహించి జన సేవ చేయుచూ అదియే దైవసేవగా భావించి దైవాజ్ఞలను శిరసావహించి, దైవార్పిత భావముతో సర్వకర్మలు గావింతురు, ఆచరింతురు.
(రా.వా.రె.పు.225/226)
(చూ|| దుష్ప్రచారములు)