షడంగ దర్శనములు, వానియొక్క విశిష్టతను షడ్దర్శనముల యొక్క ప్రభావమును జగత్తునకు వ్యాపింపజేయుదలచి అనేకమంది మహర్షులుఅనేకవిధములయిన సాధనలు జరుపుతూ వచ్చారు. జైమిని మహర్షి తన యొక్క జీవితమంతయూ ధారబోసి మీమాంస యొక్క తత్వాన్ని పూర్వమీమాంసమనే తత్వాన్ని భారతదేశములో వ్యాపింపజేసాడు. మీమాంసమనగా భక్తి జ్ఞాన సిద్ధాంతములను నియమములనుసరించి చర్చించటమే మీమాంస. భేదములను పూర్వమయినది కనుకనే దీనికి పూర్వమీమాంసమని పేరు. ఉత్తర మీమాంసకు పూర్వమే ఉదయించినది కనుక దీనికి పూర్వమీమాంసమని పేరు. ఇది కర్మకాండకు సంబంధించినది. సమస్త ధర్మములు కర్మనే అనుసరిస్తూ వచ్చాయి. కానీ ధర్మము కర్మమయమైనట్టిదే అనే సత్యమును జగత్తుకు చాటుటకు ఆనేకమంది మహనీయులు అనేకవిధములుగా పాటుపడ్డారు. అథాతో ధర్మజిజ్ఞాసా’ అనుటకు పూర్వము ‘అధాతో కర్మ జిజ్ఞాసా అనాలి. కర్మజిజ్ఞాసులు కాక ధర్మ జిజ్ఞాసులు కాలేరు. ధర్మజిజ్ఞాసులు కాక బ్రహ్మ జిజ్ఞాసులు కాలేరు.
పూవులేక పిందె పుట్టునా చెట్టున?
కాయలేక ఫలము కలుగునా జగతిలో?
కర్మలేక భక్తి కలుగునా జగతిలో?
భక్తిలేక జ్ఞాన పథము కలుగునా?
కనుకనే కర్మ జిజ్ఞాసద్వారా ధర్మ జిజ్ఞాస, ధర్మ జిజ్ఞాస వలనబ్రహ్మ జిజ్ఞాస ప్రతి మానవునకూ ప్రాప్తిస్తుంది. జైమినీ మహర్షి తనయొక్క స్వానుభవముతో పరిశోధనలు సల్పి పరిశీలన ద్వారా తనయొక్క మనసును సంతృప్తి పరచుకొన్నాడు. కర్మ జిజ్ఞాస: మానవుడు తెల్లవారినదిమొదలు రాత్రి పరుండువంతవరకూ కర్మలు ఆచరిస్తూనే యుంటున్నాడు. కర్మలేని మానవుడు ఈ జగత్తునందు కానరాడు. ఉచ్చ్వాస నిశ్వాసములు కూడనూ కర్మలే. మన దేహములో ప్రవహించే రక్తము కర్మమయమైనదే. కనుక కర్మను విస్మరించి ధర్మమును విశ్వసించడానికి అవకాశములేదు. జైమిని మహర్షి కర్మ జిజ్ఞాస యందు చక్కని ఉదాహరణమును అందిస్తూ వచ్చాడు. మనము నిత్యజీవితములో గృహమునందు కొన్ని వంటలను చేసుకొంటూ యుంటాము. ఒక పచ్చడిమనము చేయాలనుకుంటే కొన్ని పదార్థములు ప్రోగుచేసుకోవాలి. కొబ్బరికాయ పచ్చడి చేయాలి. దీనికి మిరపకాయలు కావాలి. చింతపండు కావాలి. ఉప్పుకావాలి. కొబ్బరి కావాలి. ఈ పదార్థములన్నియునూ ప్రోగుచేసి కలిపి, నూరినప్పుడే చట్నీ రూపొందుతుంది.. ఇది కర్మజిజ్ఞాన, నాకు ఈనాడు చట్నీ కావాలి అనుకున్నంత మాత్రమునే ఇది సాధించడానికి వీలుకాదు. ఈ పదార్థములను మనము ప్రోగుచేసుకోవాలి. ఈ పదార్థములను ప్రోగుచేసుకోవడమే గాక పదార్థము యొక్క స్వరూపాన్ని ఏకత్వముగా నిర్మించుకోవాలి. ఒట్టి మిరపకాయ తినటానికి వీలు కాదు. ఒట్టి ఉప్పు తినటానికి వీలుకాదు. ఒట్టి చింతపండు తినటానికి వీలుకాదు. ఈ మూడింటిని సమభాగములో ఏకత్వముగా చేసినప్పుడే చట్నీగా తినడానికి వీలవుతుంది. కర్మజిజ్ఞాస అనే చట్నీ చేసినంత మాత్రమున చాలదు. ధర్మజిజ్ఞాస. దానిని తిని చూడాలి. అది తిని చూసారు. ఇందులో ఉప్పు తక్కువ అని గుర్తించారు. తక్కువైన ఉప్పును తిరిగి చేర్చుకోవాలి. ఈ చేర్చుకోవటమే బ్రహ్మజిజ్ఞాస, చట్నీ చేయడం, రుచి చూడడం ఆ రుచిలోపల ఏది దోషమో అనే దాన్ని గుర్తించటం, అటు తరువాత దోషాన్ని నిర్మూలన గావించడమే బ్రహ్మ జిజ్ఞాస..
అటులనే మానవ జన్మమందు విదితమైన కర్మలు ఆచరించి, ఆచరించిన కర్మలను అనుష్టానములో వుంచుకొని, ఈ అనుస్థానములో ఏఏ లోపమున్నదని గుర్తించి ఆ లోపములు తీర్చుకోవడమే బ్రహ్మ జిజ్ఞాస మనము పుట్టినాము. పంచభూతములచే కూడినాము. పంచకోశములచేత చేరనాము. పంచభూతములను అనుభవిస్తున్నాము. ఈ అనుభవించటమే ధర్మ జిజ్ఞాన. అనుభవించిన తర్వాత ఇందులో శాశ్వతానందము లేదని గుర్తించుకొన్నాము. ఈ శాశ్వతానందము ఏమిటి? అదియే బ్రహ్మతత్వము, శాశ్వతానందమయిన బ్రహ్మతత్వమునుచేర్చుకోవటమే బ్రహ్మజిజ్ఞాస. కనుక ప్రతి మానవునికి - కర్మ జిజ్ఞాస ప్రారంభము, రెండవది ధర్మ జిజ్ఞాస మూడవదిబ్రహ్మ జిజ్ఞాస. ఇలాంటి కర్మయొక్క కాండమును సక్రమముగా సామాన్య మానవునకు నిత్య జీవితములో ఆచరణ రూపమయిన ఆనందాన్ని అందించే నిమిత్తమై జైమిని మహర్షి ఈ పూర్వ మీమాంసను దర్శించాడు.
(స.ది.పు.153/155)
(చూ|| వేదము)