మహా ప్రస్థానమును నిమించిరి. అనగా, యేమియూ తినక, త్రాగక, విశ్రాంతి గొనక ఉత్తరదిక్కునకు వెడలుట: దీనినే మహా ప్రస్థానమని అందురు.
(భా.వా.పు.85)
శ్రీకృష్ణ నిర్యాణానంతరము పంచపాండవులు ద్రౌపదితో మహాప్రస్థానం సాగిస్తూ ఉండగా ఒక్కొక్కరూ ఒక్కొక్కరుగా క్రిందపడి అందరూ మరణించారు. ధర్మజుని వెంట ఒక శునకము మాత్రము ఉంది. ఇంద్రాది దేవతలు ధర్మజునితో, ధర్మజా! శునకమును స్వర్గమున ప్రవేశపెట్టుటకు వీలులేదు. దానిని వదిలి నీవు మాత్రము స్వర్గమున ప్రవేశించు అన్నారు. ధర్మజుడు, మహానుభావులారా! ఈ శునకము నావెంట జంటగా యింత దూరము వచ్చింది. నావారు అనేవారు ఎవ్వరూ రాలేకపోయారు. శునకమును ప్రవేశపెట్టకపోయినచో నేనుకూడా స్వర్గమున ప్రవేశించను అని దృఢముగా పలికాడు. మరునిముషములో అక్కడ శునకము లేదు. ధర్మజుని తండ్రి అయిన యమధర్మరాజు నిలుచుని ఉన్నాడు. కుమారా! నిన్ను పరీక్షించుటకు ఈ విధముగా చేసాను. నాతో రా! నీవు అలనాడు యుద్ధరంగమున పలికిన అసత్యమునకు కొన్ని ఘడియలు నరకమున వుండాలి అని యమధర్మరాజు పలికాడు. అదే విధముగా ధర్మజుడు నరకమున ప్రవేశించాడు.
ధర్మజుడు సలసల కాలిపోవుచున్న నరకమున పాదము మోపినంతనే అంతటా ఒక చల్లదనము ఆవరించింది. నరకవాసులు, ఇదేమి వింత! ఎంత హాయిగా ఉన్నది ఈ నరకము అనుకొని కారణము అడిగి తెలుసుకున్నారు. ధర్మజుడు కొన్ని నిముషములు గడచిన తరువాత నరకమును వీడి స్వర్గమునకు వెళ్ళవలసి వచ్చింది. నరకవాసులందరూ అతని చుట్టూ చేరి, మహాత్మా! నీవిచ్చటనే వుండరాదా? అని ప్రార్థించారు. ధర్మజుడు వెంటనే యమధర్మరాజు అనుగ్రహముతో తాను సంపాదించిన పుణ్యఫలమంతయు ఆ నరకవాసులకు ధారపోశాడు. ఆ కారణంగా నరకవాసులందరూ పాపవిముక్తులయ్యారు. (దివ్యఙ్ఞాన-దీపికలు ద్వితీయ భాగం పు 70-71)