మోహము

"అర్జునుడనగా స్వచ్చమయిన స్వభావము కలవాడని కదా! సమయ సందర్భములను యోచించక ఈ ఏడుపు ఏమిటి? యుద్ధమూ కుత్తుకపై కూర్చొన్నది, యుద్ధమేఘులు దట్టమైన స్వరూపమును ధరించి ప్రతిధ్వనించుచు చుట్టుముట్టుచున్నవి. యెదుట నిలచిన శత్రువులా! యెప్పుడా అని వుర్రూత లూగుచున్నారు. వారు యింతవరకూ మీపై చూపిన అన్యాయ, అక్రమ, అనాచారములా లెక్కలేనన్ని. అంతమాత్రముతో పోక ధర్మరీతిగా మీకు రావలసిన రాజ్యమును కూడా మ్రింగివేయుటకు సిద్ధముగా నున్నారు

.

యింతవరకూ మీరు సత్యనిష్టకు వైదొలగక అనేక కష్టాల పాలైతిరి. వారిచ్చిన వియమములు, సమయములు కూడనూ గడిపితిరి. కడకు రాజీ ప్రయత్నములా వేరుగా చెప్పనక్కరలేదు. ఎంతవరకూ చూడవలెనో అంతవరకూ చూచితిమి, అన్నియూ నిష్ఫలమాయెను. అధర్మమార్గ, దురహంకార, దురాచార శీలుడైన దుర్యోధనుని కన్నులు తెరిపించవలెనన్న ఒక్క యుద్ధము తప్ప వేరు మార్గము లేదు,యిది నేటి సంకల్పము కాదు! దీనికి పూర్వము పెద్దలందరూ చేరి అన్ని విషయములు యోచించి యుద్ధమనివార్యమని నిర్ణయించిరి. మీ సోదరులును, నీవును అందులకు సమ్మతించి, మంచిదని వప్పుకొంటిరి. ఆనాటినుండి యుద్ధమునకు తగిన ప్రయత్నము లన్నియూ జరుపుచునే యున్నారు. నీవునూ అందులోనే మునిగి యుంటివి, యుద్ధమునకు సిద్ధమని ఈనాడు వెనుకంజ వేయుటకు యేమిటి ఈ పిరికితనము? ఈ యుద్ధము హఠాత్తుగా వచ్చిపడినదికాదే! కావలసిన సామాగ్రి ఎంతో కాలము నుండి సేకరించితివే! ఆనాడు కాయలు, కసురులు తిని కైలాస నాధుని మెప్పించి పాశుపతాస్త్రాన్ని సంపాదించితివి, దేవేంద్రలోకము నకు పోయి వారి మెప్పుల కుప్పవై దివ్యాస్త్రములను ఆర్జించితివి, అరణ్యవాసం గడిచింది, అజ్ఞాతవాసం నడిచింది, కౌరవుల పాపం పండినదని తలంచితివి. మీ దుర్ధశనిశకుప్రభాతభేరి మ్రోగింది. ఇప్పుడేమిటి నీకీ దుర్దశ పట్టినది? ఈ దౌర్భాగ్యము ఏ శాస్త్రనీతి?నీదియా ధర్మప్రాణమైన క్షత్రియజాతి, శౌర్య ధైర్య, పరాక్రమ బలములు కలిగియూఈ దిక్కుమాలిన వైరాగ్యము ఏ వైపునుండి వచ్చినది? బావా! ఈ పిరికి ప్రవర్తన నీకేకాక నీ పూర్వీకులైన ఆర్యపురుషు లందరికి తీరని తలవంపులు! ఛీ చాలు, చాలు సిగ్గులేని ఈ పరికితనము. క్షత్రియు లందరికీ కళంకము. క్షత్రియునకు యుద్ధము రాచబాట! అసలు క్షత్రియ జాతికిది స్వర్గమార్గము.ఈ సమయమునయుద్ధమే వద్దనిన అపకీర్తుల పాలగుదువు. స్వారితమైన ఆస్తి నీకు విజయుడను బిరుదు. యావజ్జీవిత మంతయూ ధారపోసి సంపాదించిన యాకీర్తిని మట్టిపాలుచేతువా? క్షుద్రమైన ఆ మోహములను పరిత్యజించుకో బావా! నా మాటవిను. గడచిన అమరావతి సంఘటనను జ్ఞాపకము చేసుకో.

 

ఊర్వశి తనకు తానై వలచిరాగా వలదని తిరస్కరించితివి. నీ వలన నాకు పుత్ర ప్రాప్తిని చేకూర్చమని అడుగగా, నన్నే పుత్రునిగా భావించమని కోరితివి. అట్టి అనన్య మహామునివి, జితేంద్రియుడివి. ఆ సమయమున ఊర్వశి తన పాచిక చెల్లక విఫల మనోరధురాలై, నపుంసకునివి కమ్మనమని ఇచ్చిన శాపమే కదా, విరాట నగరమున తీరినది, అట్టి ధీరత్వ మెక్కడకు పోయెను? ఈ దీనత్వ మెక్కడనుండి వచ్చెను? ఛా! యిట్టి పిరికిపందవు. అర్థరాత్రిలో పరుగెత్తి వచ్చి నిద్ర పోపుచున్న నన్నుయుద్ధమున సహయమునకు రమ్మనమని లేపుకొని వచ్చినది. ఈ పిరికి ప్రతాపమును చూపుటకా? చాలు చాలు, యీ దౌర్భాగ్యపు మోహమును నిర్మూలనము చేయుము, దౌర్బల్యమును మంటకలుపుము. బలమును వహించుము" అనెను.

 

ఈ సమయమున కృష్ణ పరమాత్మ నాల్గు పదములను ఉపయోగించెను.1. కశ్మలమని, 2. అనార్యజుష్టమని, 3. అస్వర్గమని, 4. అకీర్తికరమని.అందులో కశ్మలమనగా అజ్ఞాతమనియు, అనార్యజుష్టమనగా ఈశ్వర స్వభావసుఖహాని అనియు, అస్వర్గ్యమనగా ఆధి దైవిక సుఖహాని అనియు, అకీర్తికరమనగా ఆధిభౌతిక సుఖహాని అనియు సూచించినది, పౌరుషాన్ని పురికొల్పే క్షాత్రరక్తాన్ని కదిలించే శ్రీకృష్ణుని మాటలు అర్జుమనిపై కొంత పని చేసినవి. ఈ మాటల కిరణములతో అర్జునునిలోని కరుడు కట్టిన తమోగుణము కొంత కొంత కరుగుట మొదలిడినది, రజోగుణము కొంత పులకరించినది. ఆ రాజసిక తీక్షణతతో అర్జునునికి తిరిగి నోట తడి యేర్పడి ప్రసంగమునకు ప్రయత్నిస్తాడు. అక్కడ అర్జునుడు "కధం?"అని కృష్ణుని ప్రశ్నిస్తాడు. దీనిని సూక్ష్యంగా యోచించిన ఈ పదము యొక్క లక్ష్యము చక్కని గుట్టును తెలుపుచున్నది. అదియేమన భగవత్ గీత ఏమి చేయవలెనో ఆను విషయమును కాక, యెట్లు చేయవలెనో అనునది తెలుపుచున్నది. కధం" అనగా యేవిధంగా అని తలంచవలెను. దీనిని బాగుగా గ్రహించవలెను. ముఖ్యముగా గమనించవలెను.

(గీ.పు.13/15)

 

మోహమున మునిగియుండు మూఢబుద్ధి

ముక్తి యననేమి తెలియదు ముగ్ధబుద్ధి

దుష్టయననే మొ తెలియదు దొడ్డబుద్ధి

చెడ్డనే నిత్యంబు స్మరించు గొడ్డుబుద్ధి

(ము.ము. పు. 88)

(చూ: దౌర్బల్యము, ప్రేమ, బ్రహ్మసాక్షాత్కారజ్ఞానము, మాయ)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage