కృష్ణుని చేతిలోని మురళిగానుండ ఇచ్చగించు. మురళివలె తిన్నగా, లోన ఖాళీగా (విషయవాసన భరితముకాక) నుండిన, భగవంతుడు అనుగ్రహించి, ఆదరించి నిద్వారా కమ్మని సంగీతమును వినిపించును.
(శ్రీ. స.సూ .పు.73)
కృష్ణుని మాధుర్యం ప్రకృతిలో నిండారివున్నది. ఆ మధురిమను రాధ ఆస్వాదించి పరవశురాలవుతున్నది. రాధ ఎవరు? ఆమె ప్రకృతి. మాయాశక్తి. శ్రీకృష్ణ సంభూతమైన హ్లాదినీ శక్తి,. ఆమె కృష్ణుని మహాభావము. ప్రకృతి రూపంలో ప్రకటితమైన కృష్ణుని ఆనందమును రాధ దొంగిలించి తన హృదయంలో భద్రపరుచుకున్నది.తను పోగొట్టుకున్న ధనం మళ్ళీ తన చేతికి చిక్కేదాకా యజమాని దొంగ ఇంటి చుట్టూ తిరుగుతూ వుంటాడు. అల్లాగే కృష్ణుడు తన ఆనందం కోసం రాధ యింటి చుట్టూ తిరుగుతూ వుంటాడు.
ఒకనాడు కృష్ణుడు మురళిని వదిలేసి గాఢనిద్రపోతున్నట్లు నటించాడు. రాధ ఆదృష్టవంతురాలైన మురళి చెంతకు వెళ్ళి ఇంతటి భాగ్యం నువ్వు ఏ విధంగా సంపాదించుకున్నావో నాకు చెప్పవా? ఏమి నోములు నోచావు? ఎన్ని జాగరణలు చేశావు? ఏ పుణ్యతీర్థాలకుసేవించావు? ఏ మంత్రం జపించావు? ఏ మూర్తిని పూజించావు. అని దీనంగా వేడుకున్నది. భగవదనుగ్రహంవల్ల వేణువుకు మాటలు వచ్చాయి. "నేను అన్ని ఇంద్రియ వాంఛలూ, అసూయా దురాశా అహంభావమూ విసర్జించాను. నాదీ అనేది ఏదీ అడ్డురాకుండా చేసుకున్నాను. అదే ప్రభువు ప్రేమవాహిని నా ద్వారా సకల సృష్టి మీదా ప్రసరించాలని కోరుకున్నాను. అంతే" అంది మురళి.
(వ.1963పు.122/123)
భగవంతుడు అనే శ్వాసము మాత్రమే పీల్చండి, అదే నిజమైన దివ్యజీవనం. "అహం" భావాన్ని మరచి వేణువులా “శూన్యంగా" హృదయాన్ని ఉంచుకోండి. (ఎటువంటి సంకల్పవికల్పాలు లేని మనసుతో) అప్పుడు ఖాళీగా ఉన్నమీ హృదయమనే మురళిపై అద్భుతమైన, మధురమైన రాగాలు పలికిస్తాడు.
(శ్రీస. స..పు.220)
ఆనాడు కృష్ణుని మురళీగానం వినుట వలన ప్రజలకు మానసిక రుగ్మతలుపోయి, ఆరోగ్యం, ఆనందం కలుగుతూ వచ్చాయి. కృష్ణుని మురళికి నవ రంధ్రములుండినవి. దీని అంతరార్థమేమిటంటే - మానవ దేహానికి నవరంధ్రములు ఉంటున్నాయి. నవ రంధ్రములు కలిగిన ఈ దేహమునకు భగవన్నామమునే శ్వాసగా తీసుకోవాలి. దీనిని పురస్కరించుకొనియే ఆనాటి గోపికలు "కృష్ణా! మా దేహమునే ఒక మురళిగా తీసుకొని, నీ ఉచ్చ్వాస నిశ్వాసాలను దాని లోపల స్వేచ్ఛగాసంచరింపజేయుము. నీ ఉచ్చ్వాస నిశ్వాసములే వేదసారము. ఇట్టివేదసారమును నాదబ్రహ్మముగా మార్చి, మా దేహమనే వేణువు నందు దానిని తిరుగబోసి, మధురమైన గానమును వినిపించుము" అని ప్రార్థించారు. కనుక, మన దేహం నవరంధ్రములు గల మురళివంటిది. అన్నింటి యందు దైవస్పర్శ ఉండాలి. అనగా, సర్వాంగములు దేవుని సేవ యందే అర్పితము కావాలి. ఇదే సంపూర్ణ శారణాగతితత్త్యం: ఏకత్వాన్ని విశ్వసించడమే సంపూర్ణశరణాగతి, అంటే "దైవం వేరు - నేను వేరు " అనే భావము కలిగియుండ కూడదు. అందచేతనే, గోపికలు "కృష్ణా! నీవు నా కనుపాపలోనే దాగియుండి జగత్తునంగా చూస్తున్నావు. నీవు లేకపోతే నేను లేను" అనే భావన కలిగియుండినారు. దీనిని బట్టి గోపికలు ఎంతటి పవిత్ర హృదయాలను కలిగియుండిరో గుర్తించాలి. వారి భావములన్నీ అంతర్ముఖముగా ఉండేవి. కనుక, ఈనాడు బాహ్యమైన భావాలను దూరం చేసి, అంతర్భావాలను అభివృద్ధి పరచుకొని దివ్య త్వమును అనుభవించాలి.
(స. సా.ఆ.91 పు.263)