దురదృష్టవశాత్తు ఈనాడు ఏడు విధములైన మహాపాతకాలు దేశాన్ని పట్టి పీడిస్తున్నవి. అవి 1) నీతిలేని వాణిజ్యము 2) నిజాయితీలేని రాజకీయము 3)శీలం లేని విద్యావంతుడు 4) త్యాగం లేని ఆచారము 5) కృషిలేని సేద్యము. 6)గుణములేని మానవత్వం. 7) స్థిరంలేని భక్తి. ఏనాడు ఈ మహాపాపములు సమసి పోతాయో - ఆనాడే దేశము నిత్యకళ్యాణము పచ్చతోరణములతో కళకళ లాడుతుంది. అయితే, మానవుని యందు ఈనాడు శీలసంపద, నీతినిజాయితలు, కృషి, త్యాగము మొదలైన సద్గుణాలు సన్నగిల్లిపోతున్నాయి. అందుచేతనే దేశము మరింత అల్లకల్లోలములకు, అశాంతికి గురియౌతున్నది. ఈనాడు విద్యార్థుల ప్రవర్తనను అరికట్టుటకుగాని, ప్రజల నోరు మూయుటకు గాని ఎవ్వరికీ సాధ్యము కావటము లేదు.
(స.సా.ఏ2పు.80/81)