ప్రేమస్వరూపులారా! మానవునియందున్న దైవం కంటే వేరు దైవం లేడనే సత్యాన్ని మీరు మొట్టమొదట గుర్తించాలి. మానవుడే దైవం. మానవునకు, దైవమునకు ఎట్టి భేదమూ లేదు. కేవలం భావదోషంవల్లనే బేధం కనిపిస్తున్నది. కంటికి కనిపించే విశ్వాన్ని మానవుడు ప్రాకృత భావంతో చూస్తున్నాడేగాని, విశ్వేశ్వర స్వరూపంగా చూడటం లేదు.ప్రాకృత దృష్టిని పరమాత్మ దృష్టిగా మార్చుకోవాలి. ప్రాకృత దృష్టితో చూపినప్పుడు ఇది ఒక గులాబీ పుష్పం, దైవభావంతో చూసినప్పుడు ఇదే హృదయ పుష్పం. దైవత్వంతో కూడిన ఈ జగత్తును మీరు జగత్తుగానే చూస్తున్నారుగాని, దైవత్వంగా చూడటం లేదు. కనుకనే, ఈ జగత్సంబంధమైన కష్టనష్టములను అనుభవిస్తున్నారు. మదాలస తనకు పుట్టిన ప్రతి బిడ్డకు సత్యాన్ని ఈ విధంగా బోధిస్తూ వచ్చింది. “నాయనా! నీవు కేవలం ఈ భౌతికమైన శరీరానివి కాదు. నీవు అజ్ఞానమునకు, మాయకు అతీతుడవు. కాని, మెహమనే నిద్రలో సంసారమనే స్వప్నమునుగాంచి నీ స్వస్వరూపాన్ని మరచిపోతున్నావు.మోహమనే నిద్ర నుండి మేలుకొని జ్ఞానమనే జాగ్రత్తలో ప్రవేశించు.. మానవుడు జన్మించిందిజగత్తుకు సంబంధించిన విషయములను అనుభవించ డానికి కాదు. ఎంత అనుభవించినా మానవునికి తృప్తి కల్గటం లేదు. అనుభవించే కొలది ఆశలు పెరిగిపోతున్నాయేగాని, తరిగిపోవడం లేదు. మానవుడు మొట్టమొదట తన తత్త్వాన్ని తాను గుర్తించుకోవాలి. మానవుడనగా ఎవరు? మా - అనగా, అజ్ఞానము; న - అనగా, లేకుండా, వ - వర్తించడం. కనుక, అజ్ఞానము లేకుండా వర్తించే వాడే మానవుడు. ఈ పదానికి మరొక అర్థం కూడా ఉన్నది మా - అనగా, కాదు; నవ - అనగా, క్రొత్త. కనుక, మానవుడు క్రొత్తవాడు కాదు, పాతవాడే. ఇతడు నవీన మానవుడు కాదు, సనాతన మానవుడు, పురాతన మానవుడు, ఎన్నో వేల సంవత్సరముల నుండి వస్తున్నాడు.
(స.సా.జ..2000 పు 2/3)
మదాలస అనే రాణి తన పిల్లలను తొట్లెలో వేసి వారికి జ్ఞానాన్ని బోధించే పాటలు పాడుతూ జోకొట్టేది. “నాయనా! నీవు శుద్ధుడవు, బుద్ధుడవు, నిరంజనుడవు. సంసారమనెడి స్వప్నమును, మోహనిద్రనుత్యజించు" అని వారికి బోధించిఅరణ్యానికి పంపింది. పుట్టిన పిల్లలందరికీ జ్ఞాన బోధలు -సల్పి వారిని ఆరణ్యానికి పంపితే, ఇంక రాజ్యమేలేది ఎవరు? అని ఒకనాడు భర్త కోప్పడ్డాడు. అప్పుడామె "మహారాజా! రాజ్యభోగము అనిత్యమైనది. కనుకనే, నా కుమారులను నిత్య, సత్యమైన హృదయ సామ్రాజ్యానికి రాజులుగా పట్టాభిషేకం చేస్తున్నాను" అని జవాబు చెప్పింది. స్వప్నం రావడానికి కారణం. ఏమిటి? మీరు భుజించిన ఆహారం కాదు. మీరు విన్న విషయములు కాదు. స్వప్నానికి మూలకారణం నిద్రయే. నిద్రయే లేకపోతే స్వప్నమే లేదు. అదేవిధంగా, మోహమనే నిద్రవల్లనే సంసారమనే స్వప్నం వస్తున్నది. కనుకనే మదాలస తన పుత్రులకు "సంసార స్వప్నా త్య జ మోహని ద్రాం" అని బోధించింది.
(స.పా.పి.2000పు.46/47)