రావణుని మరణవార్తను విని మండోదరి నేలకూలెను. ఆమె దాసీలతో - కళేబరము దగ్గరకు వచ్చి ఆ శిరస్సులను చేర్చి - ప్రాణేశ్వరునకు సంభవించిన దుర్గతికి చాలా విలపించెను. రావణుని ప్రతాపమును అనేకవిధములుగా వర్ణించెను.
"ఓ నాథా! బ్రహ్మసృష్టి అంతయూ మీకు వశమయి ఉండెనే! అష్టదిక్పాలకులు మీకు నమస్కరించుచుండిరి కదా! కాని ఎన్ని శక్తులుండి యేమి ప్రయోజనము?! ఎన్ని తపస్సులు చేసి యేమి ఫలము?! ఎంత బలపరాక్రమములుండి ప్రయోజనమేమి? రామవిముఖులయితిరి కనుక మీకీ పాట్లు తగినట్లు వచ్చెను. కామమును వశము నందుంచుకొనని కాలుడైననూ కడకు ఈరీతిగా బాధపడక తప్పదు. కామాంధునకు ఈ కఠిన శిక్ష తప్పినది కాదు. కాముడు మాత్రమే రాముని విస్మరించును. ఓ రావణా, శ్రీరాముడు రాక్షస వనమును దహించుటకే అవతరించెను. అతడు సాధారణ మానవమాత్రుడు కాడని నేనెన్నియో పర్యాయములు చెప్పితిని, కాని మీ ప్రారబ్ధము మిమ్ము విడువక వెంటాడెను. మీ దేహబలము పై, బుద్ధిబలముపై, ధన జనబలముపై మీరు ఆధారపడి భ్రమించితిరి. మీరు ఆ కరుణాసముద్రుని శరణుజొచ్చి రాక్షసవంశమును కాపాడుమని పాదములంటి ప్రార్థించితిని. నా మాట వినరైతిరి. మీరు నిరంతరము పరులకు ద్రోహము చేయుటకే చింతించితిరి. కాని, పరుల ఉపకారమునకు ఏనాడునూ ప్రయత్నించలేదు. కాయమా - నిరంతరము పాపములలో మునిగిపోయెను. అట్టి మీకు రాముడు సాకేత లోకము నిచ్చెను. అదియూ మీ భాగ్యమే. లేకున్న రామహస్తములో ప్రాణములు వీడుట అందరికీ సులభము కాదు కదా! అందరికీ ప్రాప్తిరాదు కదా! ఆ శ్రీరాముడు మీ సంహారార్థమే అవతరించెను. రాక్షసవంశ నాశమునకు రాక్షస రాజే రాజబాట వేసుకొనెనను వార్త శాశ్వతముగా నిలిచిపోయెను కదా! ఇదీ మీరు సాధించినది. ఇది మీ పరిపాలనా చాతుర్యము. మీ తపఃఫలము ఇంతేనా?!
“రామచంద్రా, కర్మఫలము తప్పునది కాదను వాక్యమును నిరూపించితిరా? ఇంతకన్ననూ వేరు నిదర్శనము మరొకటేమి కలదు?! ఇది ప్రత్యక్ష నిదర్శనము” అని మండోదరి విలపించుచున్ననూ - జ్ఞానముచే శ్రీరాముడు పరబ్రహ్మయని తెలుసుకొనెను. ఈమె జ్ఞానమునకు సురులు, మునులు సంతోషించిరి. మండోదరి విలపించుచున్న దృశ్యమును చూచి విభీషణుడు కూడా దుఃఖించెను. మండోదరి చెప్పిన వన్నియూ వాస్తవములని యొప్పుకొనెను. ((సనాతన సారథి మే 2022 పు4)