దేహమనే మందిరమును ఐదు ద్వారములుంటున్నవి. ఈ ద్వారములు ఎందుకోసము నిర్మించారు? దైవదర్శనం నిమిత్తమై ప్రవేశించే భక్తుల కోసం ఏర్పరిచినది. ఒక్కొక్కదేవాలయమునకు అనేక ద్వారములుంటాయి. ఈ ద్వారములలో భక్తులే ప్రవేశిస్తుంటారు. గానిఅన్యులు ప్రవేశించరు. ఒక చిన్న ఉదాహరణ. మనము ఒక యిల్లు కట్టుకున్నాము. చక్కగా సుందరముగా ఉంటున్నాది. అనేక ద్వారములు పెట్టుకున్నాము. మనము మన బంధువులు మనవారు అందులో ప్రవేశించటము వెలుపలకు పోవటము ఈ అనుకూలం నిమిత్తము ద్వారములు పెట్టుకున్నాము. ద్వారమున్నది కదా అని పందులు, కుక్కలు, గాడిదలు, అన్నింటిని ప్రవేశింప చేస్తామా? కాదు కాదు. అలాంటి ప్రవేశింపరానివి ఏమైనా వచ్చినప్పుడు ద్వారమును బంధిస్తాము. ప్రవేశింప తగినవారు వచ్చినప్పుడే ద్వారము తెరుస్తాము. ఇదే విధముగనే యీదేహమనే దేవాలయ ద్వారములు పవిత్రమైనవాటికి మాత్రమే ప్రవేశించటానికి తగిన అవకాశము ఇవ్వాలి. అపుడే దీనికి దేవాలయమనే సార్థకనామము, క్షేత్రమనే సార్థకనామము, చెల్లుతుంది. ఆట్లు కాకుండా యిది విరుద్ధమైన మార్గమును అనుసరించినప్పుడు క్షేత్రము కానేరదు. కనుక యీదేహము యొక్క సద్వినియోగమునకు ఆహారము అత్యవసరము.
(బృత్ర.పు.48)
(చూ॥ ప్రధమస్థానము)