జంతూనాం నరజన్మదుర్లభం అన్నారు. ముఖ్యంగా నర శబ్దమునకు అంతరార్థం తెలుసుకోవాలి. న అనగా కాదు. ర అనగా మృత్యువు. నాశనము కానటువంటి తత్త్వమునకే నర అని పేరు. “నరుడు" అనగా నాశనం కానటువంటివాడు. నర, నారద, నారాయణ - ఈ మూడు పదముల అంతరార్ధమును తెలుసుకుంటే, ఈ మూడు ఒక్కటే అని తెలుస్తుంది. నరునకు, నారాయణుని చూపించినటువంటివాడే నారదుడు. నర’ తత్త్వమునకు ఎంతటి ఉత్తమమైన అర్థములో ఉంటున్నాయి. ఇలాంటి నర’ మానవత్వాన్ని దుర్వినియోగపరుచుకుంటున్నందుకు విచారించాలి. నరునికంటే దైవం వేరొకడుకాదు. దైవం తనకంటే భిన్నంగా లేదు. తనకన్నా భిన్నంగా లేనటువంటివాడు కనుకనే, భగవంతుని పూజించనవసరం లేదన్నాడు నారదుడు. నరుడే నారాయణుడు. నరుని యందు నారాయణుని చూడటమే నిజమైనటువంటి మంచితనం. నారాయణుని యందు నరత్వమును వహించటమే గొప్పతనం. కాని మనం ‘గొప్పవాడు’ కావాలని ఆశిస్తున్నాం. గొప్పవాని కంటే మంచివాడు చాలా ఉత్తముడు. ప్రతి నరుని యందు నారాయణునిచూస్తుంటాడు మంచివాడు. కాని వారాయణుని యందు కూడనూ నరుని చూస్తూ వస్తుంటాడు చెడ్డవాడు. అతనే రావణుడు. కాని నారదుడు నరునియందు నారాయణుని చూస్తూ వచ్చాడు.
(శ్రీ సె. 2000 పు. 8)
(చూ॥ మంచితనము)