ఈ రోజు మంగళవారము - మంగళదినము. సీతాదేవి ఈ శుభదినమున, తన్ను రక్షించుటకు శ్రీరాముడు వచ్చుచున్న సంతోష వార్తను హనుమంతుని ద్వారా వినెను. అప్పుడు సీత ఇప్పటినుండియు ఈ దినము మంగళవారము గా పరిగణింపబడుగాక" అనెను. ఇదే దినమున అతి భయంకరమైన రాక్షసరాజు, రావణాసురుడు రాముల వారిచే ఓడింపబడి, చంపబడెను. అదే విధముగా ఈ దినమున మీరందరును మీలోని రాక్షస ప్రవృత్తులను, లక్షణములను నాశనమొనర్చి, సాధన మార్గమున ముందంజవేయవలెనని ఆశీర్వదించు చున్నాను.
(శ్రీస.సూ.పు.93)
జానకి రామవిజయమును రావణ పరాజయమును విని సంతసించి ఆమె ప్రసన్నురాలై దేహము పులకరించి ఆనందబాష్పములు రాల్చుచూ, ఓ కపీశ్వరా! ఈ శుభవార్త నందించినందులకు నేను నీకేమియ్యగలను? నీవాక్కునకు సమాధానమైన వస్తువులు లేవు. అందులకు హనుమంతుడు, తల్లి! మీ ఆనందమునకు మీ ప్రసన్నతకు నాకీ దినమున మూడు లోకముల రాజ్యము లభించినంత ఆనందమాయెను. నేడు శత్రువును జయించి తమ్మునితో కూడిన నిరామయుడగు రామప్రభువును చూచుటకంటేభాగ్యమేమి కలదు, అని నమస్కరించెను. అంత జానకి వానరోత్తమా, నేను ఈ పదినెలలు రామచంద్రుని వియోగదుఃఖమున మునిగినందున బైట ప్రపంచము ఏమియూ కనిపించలేదు. నేడు ఏమి వారమో ఏమి తిథియో తెలియదు. యేమైన నేడు మంగళకరమైన వార్తను తెలిపితివి కనక ఈనాడు మంగళవారమనే పిలుతును. నీవీవార్త నందించినందుకు ఈ దినము నిన్ను పూజించు దినముగా ఆశీర్వదింతును. అని సీత పలికెను. హనుమంతుడు ఇది మహా ప్రసాదమని చేతులు జోడించి సీతకు నమస్కరించెను.
(రా.వా.రె.పు.202)
(చూ|| హిరణ్యగర్భతత్త్వం)