తైత్తిరి యోపనిషత్తు పంచాగ్నుల యొక్క ప్రమాణాలను గురించి, నాలుగు తరగతులకు చెందిన మానవులను గూర్చి చక్కగా వివరించడమే గాకుండా, గురుకులంలో తమ విద్యాభ్యాసమును పూర్తిచేసుకొని గృహస్థాశ్రమములో ప్రవేశించబోయే విద్యార్థులు తమ జీవితంలో ఎట్టి మార్గాన్ని అనుసరించవలెనో ఉపదేశించుచున్నది. "ప్రేయోమార్గం, శ్రేయోమార్గం" అని రెండు విధములైన మార్గము లుంటున్నది. ప్రేయోమార్గములో మానవుడు తాత్కాలికమైన ఆనందాన్ని అందించే ఇంద్రియ సుఖములనాశించి, తత్ఫలితాన్ని అనుభవిస్తాడు. చాలామంది. ఇట్టి అనిత్యమైన, అసత్యమైన ప్రేయోమార్గమునే ఆశిస్తున్నారు. అనుసరిస్తున్నారు. మంచి ప్రవర్తన, మంచిగుణములు, మంచి జ్ఞానం ఆశించి, అనుభవించుటయే- శ్రేయోమార్గం. కాని, మానవుడిట్టి నిత్య సత్యమైన మార్గము నాశించుట లేదు. కారణమేమిటంటే - శ్రేయోమార్గం నందు సత్ఫలితాలకు కొంతకాలము పడుతుంది. కాని, తానాశించిన ఫలితాలను ఆలస్యముగా అనుభవించుటకు మానవుడు ఇష్టపడడు. తాను ప్రతి విషయానికి పరుగులిడతాడు. తనకు అనుకూలమైన ఆశలను మాత్రమే దృష్టియందుంచు కుంటాడు. అప్పటికప్పుడు గొప్ప పదవులు, కీర్తి ప్రతిష్టలు కావాలని కోరుకుంటాడు. ఇట్టి తాత్కాలికమైన విషయాలను ఆశించుటయే, ప్రయోమార్గము.(ప.3.5.91 పు 299/300)